DailyDose

ఉగ్రశిబిరాలపై విరుచుకుపడిన భారతసైన్యం-తాజావార్తలు-10/20

Indian army attacks terrorist camps-telugu breaking news-10/20

* కలకలం రేపుతున్న నియామకాల జీఓ. ప్రభుత్వంలో వివిధ శాఖలు, కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న వారిని తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ వర్గాల్లో ఇపుడు చర్చనీయాంశం అయింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన జీఓ నెంబర్ 2323 రూపకల్పనలో పైనున్న ఉన్నతాధికారులకు కూడా తగు విధమైన సమాచారం లేదని అంటున్నారు. ఈ జీఓ అమలయితే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇటీవల నియమితులైన అజయ్ కల్లాం తో సహా పలువురు సలహాదారులు, అధికారులు ఉద్యోగాలకు కూడా ఎసరు పడేలా ఉందని అంటున్నారు. గ్రామ స్థాయి వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ జీఓ కానీ అమలులోకి వస్తే వేలాది కుటుంబాలపై ప్రభావం పడి రోడ్డున పడనున్నారు.  ప్రభుత్వం ఏమాత్రం ముందు చూపులేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అవుట్ సోర్సింగ్ ఏజన్సీల ద్వారా గతంలో నియమితులైన ఉద్యోగుల ప్రస్తావన కొత్తగా జారీ చేసిన జీవోలో ఎక్కడా లేకపోగా , 2323 జీవోలో మాత్రం 2019 మార్చి 31నాటికి రోల్స్ లో ఉన్న అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తొలగించాలని పేర్కొనడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామ, సచివాలయాల్ని ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాల్ని కల్పించామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ తాజాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించడం అన్యామని అంటున్నారు.

* పాకిస్థాన్‌ సైన్యం సాయంతో భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఎదురుదాడి ప్రారంభించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. తంగ్ధార్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్‌ బలగాలు శతఘ్నులతో విరుచుకుపడ్డాయి.ఈ ఘటనలో నలుగురైదుగురు పాక్‌ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన పోస్టులు కూడా ధ్వంసమైనట్లు తెలిసింది.

* ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం దమనకాండను ఆపాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. వంద మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులను అరెస్టు చేశారని, న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావుపైనా ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె భవిష్యత్‌ కార్యాచరణ, ప్రభుత్వం తీరు, అనుసరించాల్సిన వ్యూహాలపై హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్షం, ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమయ్యారు.

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. నవంబర్‌ 3న ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఉపాధి లభించక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న అంశంపై ఈ ర్యాలీ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు దీన్ని ప్రారంభించనున్నారు.

* సీఎం కేసీఆర్‌ తెలంగాణను దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ను జైలుకు పంపేవరకు ఆయన అవినీతిపై తాను పోరాటం చేస్తానని నాగం చెప్పారు. రూ.24వేల కోట్ల విలువైన బీటీ రహదారుల కాంట్రాక్ట్‌ను ఒకే సంస్థకు కట్టబెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

* పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మల్లికాసులపేటలో మంటలు చెలరేగి 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.

* స్వీడన్‌కు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల సంస్థ వోల్వో.. తన తొలి ఎలక్ట్రిక్‌ కారు ‘ఎక్స్‌సీ-40 రీఛార్జ్‌’ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను వెల్లడించింది. ఇదే సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్‌ కారు. కాంపాక్ట్‌ మాడ్యూలర్‌ ఆర్కిటెక్చర్‌ ఫ్లాట్‌ఫాంపై దీన్ని నిర్మించారు. ఇది ఎక్స్‌సీ-40 ఎస్‌యూవీ డీజిల్ ఇంజిన్‌ మోడల్‌ని పోలి ఉంటుంది.

* ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అనేక కంపెనీలు చైనా సహా మరికొన్ని ప్రాంతాల నుంచి తరలిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలను భారత్‌కు ఆహ్వానించేందుకు బ్లూప్రింట్‌ తయారుచేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం వెల్లడించారు. ఆ మేరకు ఆయా సంస్థలతో సమావేశమై చర్చలు జరుపుతామన్నారు. భారత్‌లో ఉన్న సౌకర్యాలు, వసతుల గురించి వారికి వివరిస్తామని తెలిపారు.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కుటుంబానికి చెందిన సొంత గోల్ఫ్‌ రిసార్టులో జీ-7 దేశాధినేతల సమావేశం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రతిపక్షాలు, మీడియాలో తీవ్ర విమర్శలు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. వేరే వేదికలతో పోలిస్తే తన కుటుంబానికి చెందిన రిసార్టులో తక్కువ ఖర్చు అవుతుందని.. ఆ విధంగా ప్రభుత్వానికి మేలు చేద్దామని భావించానన్నారు.

* టెస్టుల్లో ఓపెనర్‌గా అవతారమెత్తిన రోహిత్‌ శర్మ (212; 255 బంతుల్లో 28 ఫోర్లు, 6 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగాడు. అతడికి తోడుగా అజింక్య రహానె (115) శతకంతో, రవీంద్ర జడేజా (51) అర్ధశతకంతో మెరవగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 497/9 భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను భారత పేసర్లు షమి (1/0), ఉమేశ్‌ యాదవ్‌ (4/1) బెంబేలెత్తించారు. ఇన్నింగ్స్‌ ఆరంభమైన తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి తొమ్మిది పరుగులు చేసి కష్టాల్లో పడింది.