Agriculture

గుంటూరు మిర్చి యార్డులో యాపిల్ బాక్సుల నిల్వ

Telugu Agricultural News Latest Today - Apple Storage In Guntur Mirchi Yard

కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు యాపిల్‌ సాగుకు ప్రసిద్ధి. అక్కడి సహజసిద్ధమైన చల్లని వాతావరణం యాపిల్‌ సాగుకు అనుకూలం.

దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్కడినుంచే యాపిల్స్​ సరఫరా అవుతాయి.

అలా కశ్మీర్‌, హిమాచల్‌ నుంచి మన రాష్ట్రానికి వచ్చే యాపిల్‌ నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా గిడ్డంగులంటూ లేవు. దీనివల్ల దిగుమతి చేసుకున్న పండ్లు పాడవకముందే అమ్మేయాల్సి వచ్చేది.

ఈ పరిస్థితుల్లో అన్ని సీజన్లలోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంచటం స్థానిక వ్యాపారులకు కాస్త ఇబ్బందిగా మారేది.

ఈ సీజన్లో ఆ పరిస్థితి తప్పింది. ఎందుకంటే.. గుంటూరు జిల్లావ్యాప్తంగా మిర్చి నిల్వ చేసే గిడ్డంగులు ఖాళీగా ఉండటం కలిసొచ్చింది.

ఖాళీగా ఉన్న శీతల గిడ్డంగుల్లో లక్షలాది యాపిల్‌ బాక్సులు నిల్వ చేస్తున్న వ్యాపారులు, డిమాండ్‌ను బట్టి అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.

సాధారణ పరిస్థితుల్లో నెల రోజులపాటు నిల్వ ఉండే యాపిల్‌… శీతల గిడ్డంగుల్లో మూడు నాలుగు నెలలైనా పాడవకుండా ఉంటాయి. 1

0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచడం వల్ల… పండ్ల రంగు, రుచి మారదు. శీతల గిడ్డంగుల్లో ఉంచడం కోసం… ఒక్కో పెట్టెకు 50 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు.

మిర్చి లేని సమయంలో ఈ రకంగా లబ్ధి పొందుతున్నామని గిడ్డంగుల యజమానులు చెబుతున్నారు.

నిల్వ కారణంగా మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

యాపిల్‌ వ్యాపారులు, శీతల గిడ్డంగుల నిర్వహకులు లాభపడుతుండగా… వినియోగదారులకు అవసరాలకు తగినట్లు పండ్లు అందుబాటులో ఉంటున్నాయి.