హిందూ ముస్లింల సమైక్యతకు ప్రతీక జైనబ్బీ దర్గా..
-23 నుంచి ఉరుసు ఉత్సవాలు.
అనంతపురం (ఉరవకొండ) పట్టణంలోని బీబీ జైనబ్బీ దర్గా (పాక్ దామన్ హజ్రత్ సయ్యదున్నీసా బీబీ జైనబ్బి రహంతుల్లా అలైహ) ఉరుసు ఉత్సవాలు ఈ నెల 23 నుండి 25 వరకు జరగనున్నాయి.
23 న గంధం ఊరేగింపు, 24 న ఉరుసు, 25 న జియారత్ ఉంటుందని దర్గా కమిటీ సభ్యులు తెలిపారు.
పట్టణంలో చిన్న చెరువు కట్టవద్ద ఉన్న బీబీ జైనబ్బి దర్గా హిందూముస్లింల సమైక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.
బీబీ జైనబ్బీ దర్గాకు సంబంధించి ఎటువంటి లిఖిత చారిత్రక ఆధారాలు లేకపోయినా పూర్వీకుల కథనం ప్రచారంలో ఉంది.
కథనం మేరకు పాక్ దామన్ హజరత్ బీబీ జైనబ్బీ రహంతుల్లా అలైహ కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ వాస్తవ్యులు.
ఆమె అపురూప సౌందర్యరాశి. ఆమె గ్రామాల్లో సంచరిస్తూ ఉరవకొండ ప్రాంతానికి చేరుకున్నారు.
ఆ సమయంలో బ్రిటీష్ సైనికులు ఆమెను చూసి వెంటపడ్డారు.
వారి నుంచి తనను తాను రక్షించుకునేందుకు మరో మార్గం లేక భూదేవిని నీ బిడ్డనైన నన్ను నీవే కాపాడాలంటూ వేడుకుంది.
దీంతో ఆ ప్రాంతంలో భూమి రెండుగా చీలి ఆమెను లోనికి తీసుకుంది.
వెంటపడ్డ సైనికుల్లో ఒకడు ఆమె జడకుచ్చులను పట్టుకుని లాగగా రక్తం కక్కుకుని మృతి చెందాడు.
ఈ విషయాన్ని మిగిలిన వారు కమాండర్‌కు తెలిపారు. ఆయన వచ్చి వెక్కిలింపుగా మాట్లాడగా చూపు కోల్పోయాడు.
అయితే తనతప్పు తెలుసుకుని వేడుకోగా దృష్టి ప్రాప్తించింది. దీంతో తనవంతుగా ఆ ప్రదేశంలో దర్గాను నిర్మించారు.
ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలను హిందూముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.