Politics

నేనే గొడవెందుకని ఇసుక ఉచితంగా ఇచ్చాను

Chandrababu Speaks On Sand Mafia In Bheemavaram

తెదేపా హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తామంటే వైకాపా నేతలు విమర్శలు చేశారని కానీ ఈ రోజు ఇసుక కొరతను తీర్చే పరిస్థితుల్లో లేరని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెదేపా అధినేతకు శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం రణస్థలం మండలంలోని పైడి భీమవరం వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘మా హయంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని విమర్శలు చేశారు. రేట్లు పెరిగాయన్నారు. నేను చాలా సున్నితంగా ఆలోచించి అంతా గొడవెందుకని ఇసుకను ఉచితంగా ఇచ్చాం. అయినా మళ్లీ విమర్శలు చేశారు. దేశంలో ఇసుక ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే. మమ్మల్ని విమర్శించి మీరేం చేశారు? ఇప్పుడు ఇసుకాసురులు ఊరికొకరు తయారయ్యారు. ఇసుకంతా ఎక్కడికి పోతోంది. విశాఖలో లారీ ఇసుక రూ.1లక్ష. మన రాష్ట్రంలోని ఇసుకంతా బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైకి తరలిపోతోంది గానీ మనకు మాత్రం దొరకడంలేదు. దీంతో దాదాపు 32లక్షల మంది ఇసుక లేకుండా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. దసరాకు వారంతా పస్తులుండే పరిస్థితి తీసుకొచ్చారు. దీపావళి వస్తోంది వెలుగులు లేవు. సీఎం మాత్రం పట్టించుకోరు. బంగారమైనా దొరుకుతుందేమో గానీ రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్థితిలేదు. భవన నిర్మాణాలు ఆగిపోయాయి. పనులు పూర్తిగా స్తంభించిపోయాయి’’ అని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో తాము అధికారంలోకి వచ్చినపుడు వచ్చినప్పుడు విద్యుత్‌ కొరత తీవ్రంగా చంద్రబాబు గుర్తుచేశారు. రెండు నెలలు కష్టపడి, ఇబ్బంది పడి ఏ ఒక్కరికీ కరెంటు కొరత ఉండకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు. ‘‘కేవలం రెండు నెలల్లోనే విద్యుత్‌ కొరత తీర్చా. ఐదేళ్లలో ఒక్క నిమిషం కూడా కరెంటు లేకుండా ఉన్న సందర్భంలేదు. విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చా. దోమలపై యుద్ధం అంటే నాపై విమర్శలు చేశారు. ఈ రోజు విద్యుత్‌ కోతలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు’’ అని చంద్రబాబు విమర్శించారు.