మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ‘ఛేంజ్ విత్ ఇన్’ అనే కార్యక్రమాన్ని శనివారం ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు హాజరై, మోదీతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అయితే మోదీజీ.. దక్షిణాది తారలను కూడా గుర్తించండి అంటూ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటి ఖుష్బూ సైతం సోషల్‌మీడియా వేదికగా ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ కొన్ని ట్వీట్లు చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి దక్షిణాది తారలను కూడా పిలిచి ఉంటే బాగుండేదని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘శనివారం జరిగిన కార్యక్రమంలో భారతీయ చలన చిత్రరంగం తరఫున ప్రధానిని కలిసి నటీనటులందరిపైన నాకు గౌరవం ఉంది. హిందీ సినీరంగం ఒక్కటే భారత ఆర్థిక వ్యవస్థకు డబ్బులను అందించడం లేదనే విషయాన్ని నేను సోషల్‌మీడియా వేదికగా ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేస్తున్నాను. దక్షిణ భారత సినీరంగం మన ఆర్థికవ్యవస్థకు పెద్దమొత్తంలో సహాయ సహకారాలు అందిస్తుంది. దక్షిణాది సినీ పరిశ్రమ మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. ఎందరో సూపర్‌స్టార్స్ దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వారే. భారతదేశంలో గల ఉత్తమమైన నటీనటులు, టెక్నీషియన్స్ ఇక్కడ నుంచి వచ్చిన వారే. కానీ ‘ఛేంజ్ విత్ ఇన్’ కార్యక్రమానికి ఎందుకని దక్షిణాది తారలను ఆహ్వానించలేదు? దక్షిణాదిపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? దక్షిణాదిలో పేరుపొందిన గొప్ప వ్యక్తులను కూడా ‘ఛేంజ్ విత్ ఇన్’కు ఆహ్వానించి వారిని కూడా గౌరవించి ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. దీని గురించి కొంచెం ఆలోచించండి’. అని ఖుష్బూ పేర్కొన్నారు.
మోడీజీ మీకు దక్షిణ భారతదేశం కనపడదా?
Related tags :