Business

ఇన్ఫోసిస్‌లో లేఖల కలకలం

Whistleblowers Complain On Infosys CEO To Board

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు చెందిన సీఈవో సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌ఓ నిలంజన్ రాయ్‌ అనైతిక పద్ధతులను అవలంబించినట్లు కంపెనీకి చెందిన కొంతమంది గుర్తుతెలియని ఉద్యోగులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు సెప్టెంబరు 20న రాసిన లేఖ కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు లభించింది. ‘‘పరేఖ్‌, రాయ్‌ అనేక త్రైమాసికాలుగా అనైతిక పద్ధతులను అవలంబిస్తున్నారు. దానికి సంబంధించి ఈమెయిల్‌, వాయిస్‌ రికార్డింగ్‌ రూపంలో ఆధారాలు ఉన్నాయి’’ అని లేఖలో పేర్కొన్నట్లు పీటీఐ వెల్లడించింది. బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో ఫిర్యాదుదారుల్లోని ఓ ప్రజావేగు అమెరికాలోని ‘విజిల్‌ బ్లోయర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాం’ కార్యాలయానికి అక్టోబర్‌ 3న మరో లేఖ రాశారు. ‘గత రెండు త్రైమాసికాలుగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు చూపారు’ అని అందులో ఆరోపించారు. జూన్‌-సెప్టెంబరు త్రైమాసికంలో లాభాల్ని ఎక్కువ చేసి చూపడం కోసం వీసావంటి ఖర్చుల్ని ఖాతాల్లో చూపొద్దని ఆదేశించినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించి వాయిస్‌ రికార్డింగులు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఓ కాంట్రాక్టు విషయంలో 50మిలియన్‌ డాలర్లు విలువ చేసే మార్పులను పరిగణనలోకి తీసుకోవద్దని తమపై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు. రివర్సల్స్‌ వల్ల త్రైమాసిక లాభాలకు గండిపడి షేర్ల ధరపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తమతో చెప్పారన్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు. అలాగే కీలక సమాచారాన్ని ఆడిటర్లకు, బోర్డుకు తెలియకుండా దాచారని ఆరోపించారు. ప్రముఖ కంపెనీలతో కుదిరిన ఒప్పందాలు, కొనుగోళ్లకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారం నమోదు చేసేలా ఒత్తిడి తెచ్చారన్నారు. వీటిని సంబంధించిన ఆధారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పరేఖ్‌ చేతిలో కీలుబొమ్మగా మారిన రాయ్‌ సైతం అందుకు సహకరిస్తూ వస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. కంపెనీలో నిజాయతీగా పనిచేసే ఉద్యోగులకు ఈ కీలక సమాచారం చేరకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. బోర్డు సభ్యులకు ఈ విషయాలేవీ అర్థం కావని.. షేరు ధర రాణించినంత కాలం వారు ఇవేమీ పట్టించుకోరని పరేఖ్‌ గతంలో వ్యాఖ్యానించినట్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కంపెనీ.. ప్రజావేగు ఫిర్యాదుల్ని ఆడిట్‌ కమిటీ ఎదుట ఉంచుతామని ప్రకటించింది. కంపెనీ ప్రజావేగు నిబంధనల ప్రకారం దీన్ని పరిష్కరిస్తామని తెలిపారు.