Politics

అమిత్ షాతో జగన్ సమావేశం

AP CM Jagan Meets Amith Shah In His Delhi Tour

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో జగన్‌ నేడు భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులు, సమస్యలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూలోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి వరదజలాల తరలింపు తదితర అంశాలపై అమిత్‌షాతో మాట్లాడారు. పరిశ్రమలు, సేవారంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాగ్‌తో చర్చించిన అనంతరం 2014-2015లో రెవెన్యూ లోటును సవరిస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అమిత్‌షాను జగన్‌ కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ.. ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.