నేను ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. చదువుకునేటప్పుడు ఒకబ్బాయిని ప్రేమించా. అతడు మోసం చేస్తే మరిచిపోలేక చనిపోవాలనుకుని చేతిపై గాట్లు పెట్టుకున్నా. గాయం మానినా దాని తాలూకు మచ్చలు అలానే ఉండిపోయాయి. నాకు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. భవిష్యత్తులో వీటివల్ల నా గతం తాలూకు సమస్యలు ఇబ్బంది పెడతాయేమోనని భయమేస్తోంది. ఇవి చెరిగిపోయే మార్గం లేదా?
వీటిని హెసిటేట్ కట్స్ స్కార్స్ అంటారు. అలా పడిన మచ్చలు ఎన్ని పద్ధతుల్లో ప్రయత్నించినా వందశాతం పోవు. గాయం తాలూకు మచ్చ తీవ్రతను మాత్రం కొంత తగ్గించొచ్ఛు అయితే అది ఏ ప్రదేశంలో ఉంది… ఎంత లోతులో ఉంది… వంటివాటిపై చికిత్స, అది మానే విధానం ఆధారపడి ఉంటాయి.
కిిలాయిడ్ టెండెన్సీ స్కార్స్: కొందరిలో వంశపారంపర్యం ప్రకారం కిలాయిడ్ టెండెన్సీ ఉంటుంది. ఇలాంటివారికి తగిలిన దెబ్బకంటే ఆ గాటు ఉబ్బెత్తు పెరిగి, మచ్చ పడుతుంది. రంగు తక్కువ ఉన్నవారిలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. ఆ మచ్చ సమాంతరంగా పరచుకునేందుకు సిలికాన్ షీట్స్, ప్రెజర్ గార్మెంట్స్ వంటివి వాడతారు.
కాంట్రాక్చర్స్ స్కార్స్: ఇవి మామూలు గాయాల్లా కనిపించవు. చర్మం కాలినప్పుడు శరీరభాగాల్ని కదపలేని స్థితిలో కొన్నిసార్లు మచ్చలు పడుతుంటాయి. ఇలాంటప్పుడు శస్త్రచికిత్సలు తప్పనిసరి.
హైపరోట్రోఫిక్ స్కార్స్: ఇవీ ఇంచుమించు కిలాయిడ్ మచ్చల్లానే ఉన్నప్పటికీ గాయం తగిలిన ప్రాంతం దాటి మచ్చ పడదు. సిలికాన్ షీట్స్, ప్రెజర్ గార్మెంట్స్ ఇవ్వడం ద్వారా వీటిని తగ్గిస్తారు.
యాక్నే స్కార్స్: ఈ మచ్చలు యాక్నే వల్ల వస్తాయి. జెల్స్, క్రీమ్స్ వంటి వాటి ద్వారా తగ్గించొచ్ఛు ఏ గాయమైనా మానిన వెంటనే… మచ్చ పోవాలనే ఆలోచనతో చికిత్సల జోలికి వెళ్లకూడదు. ఆరు నెలల నుంచి ఏడాది విరామం తప్పనిసరి. కొన్నిసార్లు సమయం గడిచే కొద్దీ అవి మానిపోతాయి. వీటి ప్రభావం తగ్గించడానికి ప్లాస్టిక్ సర్జరీ, గ్రాఫ్టింగ్, డెర్మాబ్రేషన్, మైక్రో డెర్మాబ్రేషన్, లేజర్ వంటి విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు అందుతాయి. కొలాజిన్ ఇంజెక్షన్స్ ద్వారా, ఫిల్లర్స్, మైక్రో నీడిలింగ్, రోలింగ్ పిన్ వంటి వైద్య చికిత్సలూ చేస్తారు. దేన్ని ఎంచుకున్నా… మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ రాసుకోవడం చాలా అవసరం.