ఎన్నో ఊహలతో.. మరెన్నో ఆశలతో.. మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో.. ఒక అమ్మాయి.. అబ్బాయి పెండ్లి జరుగుతుంది.. అయితే పెండ్లి కళ వారి ముఖంలోనే కాదు.. వేసుకునే బట్టల్లోనూ కనిపించాలని తాపత్రయపడేవారున్నారు.. పెండ్లికొడుకు.. పెండ్లి కూతురు కో-ఆర్డినేషన్.. ఆ బట్టల్లో కనిపిస్తే పెండ్లి కళ రెట్టింపు అవడం ఖాయం..అందుకోసమే కాంట్రాస్ట్ల కంటే.. మ్యాచింగ్ ముద్దంటున్నారు ఫ్యాషనిస్టులు.. ఈ సంవత్సరంలో టాప్‌లో ఉన్న కాంబినేషన్లేమిటి? ఏ రంగులు.. ఏ సమయంలో బాగుంటాయో.. చెప్పేందుకే వచ్చేసింది ఈ జంటకమ్మ..
* సూపర్ పసుపు
పెండ్లి సమయంలో పసుపు రంగు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. హల్దీ, మెహందీ సమయంలో ఈ రంగు పర్ఫెక్ట్ చాయిస్. దక్షిణాది పెండ్లిళ్లలో ఈ రంగుకు పెద్దపీట వేస్తుంటారు. పెండ్లిరోజు కూడా ఈ రంగును ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ రంగు దుస్తులు ఫొటోషూట్లకి కూడా చాలా బాగా కనిపిస్తాయి. బ్రైట్‌గా ఉండే బట్టలు అందరిలో ప్రత్యేకంగా చూపుతాయి కాబట్టి వీటిని ఎంచుకోవడం బెటర్ అంటున్నారు ఫ్యాషనిస్టులు కూడా. ఇద్దరూ పసుపు రంగు బట్టలు కట్టినప్పుడు.. అమ్మాయి బార్డర్ రంగులో అబ్బాయి దుపట్టాలో ఉంటే మరింత సూపర్ లుక్‌తో మెరిసిపోవచ్చు. ఇద్దరికీ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్లా కనిపిస్తారు.
* తెలుపు గెలుపు
క్లాసిక్ లుక్ సొంతం కావడం కోసం తెలుపు, నలుపు కాంబినేషన్లను ఎంచుకోవడం మంచిది. కాకపోతే కొందరు తెలుపు రంగు ధరించడానికి ఇష్టపడరు. కానీ రిసెప్షన్ సమయంలో డిమ్ లైట్లో తెలుపు రంగు దుస్తులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే పెండ్లికి ముందు జరిగే ఫొటోషూట్ సమయంలో కూడా ఈ రంగు చాలా బాగా నప్పుతుంది. అమ్మాయిలు లాంగ్ గౌన్, అబ్బాయిలు సూట్లతో అదరగొట్టేయొచ్చు. వెస్ట్రన్ కల్చర్ ఇష్టపడేవారు తెల్లని వస్ర్తాలను ఎంచుకోండి.
* కూల్.. కూల్..
పేల్ బ్లూ, పీచ్ రంగులు కూల్ లుక్‌ని తీసుకొస్తాయి. కాబట్టి ఈ రంగు బట్టలను సంగీత్, రిసెప్షన్ వేడుకల్లో ధరిస్తే బాగుంటుంది. ఇద్దరూ కూడా ఈ కలర్ కో-ఆర్డినేట్ చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి పీచ్ రంగు ధరిస్తే అంతగా సూట్ కాకపోవచ్చు. కాబట్టి పేల్ బ్లూ వేసుకొని చిన్న పాకెట్ స్కేర్ పీచ్ కలర్ వాడితే బాగుంటుంది. ఇక అమ్మాయిలు పీచ్ కలర్ లెహంగా, పేల్ బ్లూ కలర్ బ్లౌజ్, మిక్స్డ్ రంగులతో దుపట్టాని ఎంచుకోవడం మంచిది. ఇద్దరికీ కలిపి కామన్ థీమ్ ఉంటే చూడముచ్చటగా కనిపిస్తారు.
* పర్ఫెక్ట్ కాంబినేషన్
తరతరాల నుంచి ఈ రంగు పెండ్లి సమయంలో రాజ్యమేలుతున్నది. ఎప్పటికీ ఎవర్గ్రీన్ పెండ్లిలో అంటే ఈ రంగుల గురించే చెబుతారు. సంప్రదాయంగా ఉంటూనే, క్లాసీ లుక్‌ని తీసుకొస్తుంది తెలుపు, ఎరుపు కాంబినేషన్. దక్షిణాది పెండ్లిలో ఈ రంగులకు పెద్ద పీట వేస్తారంటే అతిశయోక్తి కాదేమో! ఇందులో కూడా వెరైటీ డిజైన్లు మామూలు రేంజ్ నుంచి టాప్ రేంజ్లో కూడా దొరుకుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకుంటే పెండ్లి సమయంలో అందరి చూపులు మీ మీదే ఉంటాయి.
* టాప్ మిక్సింగ్
పౌడర్ బ్లూ, పింక్ రంగుల మేళవింపుతో వచ్చిన అవుట్‌ఫిట్స్ ఇప్పుడు పెండ్లి బట్టల్లో చేరిపోయాయి. పెండ్లికి ముందు జరిగే వేడుకలకు ఇది పర్ఫెక్ట్ అంటున్నారు. పెండ్లికి ముందు కళగా కనిపించాలంటే ఈ రంగులను ఎంచుకోమని సలహా ఇస్తున్నారు. మరి లేత రంగులు అనిపిస్తే.. ఇందులోనే ముదురు రంగులను కూడా ట్రై చేయొచ్చు. ఇద్దరూ సేమ్ కో-ఆర్డినేషన్ కాకుండా కాస్త డిఫరెంట్‌గా కూడా ఈ రంగులను ట్రై చేస్తే మరింత సూపర్‌గా కనిపిస్తారు. అమ్మాయిలు హెవీ ఎంబ్రాయిడరీ చేయించుకోండి. అబ్బాయిలు కుర్తా మీద షేర్వాణీ గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.
* రాయల్ లుక్ కోసం
రిసెప్షన్ కోసం ఎలాంటి కలర్స్ ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అయితే.. నేవీ బ్లూ కలర్ పర్ఫెక్ట్ అంటున్నారు ఫ్యాషన్ పండితులు. పైగా మగవాళ్లు వెల్వెట్ బట్టలు ఎంచుకోండి. అమ్మాయిలూ.. మీరు కూడా బ్లౌజ్ వెల్వెట్ ఎంచుకొని, లెహంగా మీద హెవీగా గోల్డెన్ ఎంబ్రాయిడరీ చేయించండి. దీనివల్ల రాత్రి జరిగే రిసెప్షన్లో ధగధగా మెరిసిపోతారు. ఈ రంగు గురించి ఎక్కువ సెర్చ్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఈ రంగు కలెక్షన్స్ మీకు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటి సెలెక్షన్లో మీకు ఇబ్బంది తలెత్తదు.
* గులాబీ బాలా
చాలామందికి పింక్ కలర్ హాట్ ఫేవరెట్‌గా ఉంటుంది. వెడ్డింగ్ సీజన్లో ఈ రంగుకు చాలా డిమాండ్ ఉంటుందంటున్నారు ఫ్యాషనిస్టులు. ముఖ్యంగా ఆడవాళ్ల వెడ్డింగ్ కలెక్షన్లో ఈ రంగుకు మొదటి ప్రాధాన్యం కల్పిస్తున్నారట. అలాగే మగవాళ్లు కూడా ఈ రంగును ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీల పెండ్లిళ్లలో ఈ రంగు ఎక్కువగా రాజ్యమేలుతున్నది. అబ్బాయిలు మొత్తం పింక్ కాకుండా షేర్వాణీ వరకు పింక్ ఎంచుకొని పైజామా కాంట్రాస్ట్ కలర్ ఏదైనా బాగానే ఉంటుంది. అమ్మాయిలు ఫుల్ హెవీ ఎంబ్రాయిడరీతో నింపి పెండ్లికి ముందు మెహందీ, రిసెప్షన్ సమయంలో ఈ బట్టలను వేసుకోండి.
* కలకాలం పచ్చగా..
డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. రాయల్‌గా కూడా కనిపిస్తారు ఈ రంగుతో. నేచురల్‌గా ఉంటూనే.. ఇద్దరూ పర్ఫెక్ట్ లుక్‌తో మెరిసిపోయేందుకు మింట్ గ్రీన్ కలర్‌ని ఎంచుకోండి. దీని మీద కూడా కాస్త ఎంబ్రాయిడరీ ఎక్కువగా చేయించుకుంటే సూపర్‌గా కనిపిస్తుంది. ఇందులో గోల్డెన్, బీజ్, వైట్, బ్లాక్ జరీ థ్రెడ్లని మిక్స్ చేస్తే లుక్ అదిరిపోతుంది. యూనిక్ కలర్‌గా ఫ్యాషనిస్టులు ఈ రంగును అభివర్ణిస్తారు. ట్రెండింగ్ కలర్లో ఈ సంవత్సరం ఈ రంగును ఎక్కువగా ఇష్టపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిని రిసెప్షన్లాంటి సమయంలో వేసుకుంటే సూపర్‌గా కనిపిస్తారు.