WorldWonders

పాపికొండలు పడవ దొరికింది సరే. మృతదేహాలు గుర్తుపట్టేది ఎలా?

Its becoming a nightmare to identify dead bodies of papikondalu boat accident

తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన పర్యాటక బోటు ‘రాయల్‌ వశిష్ఠ’ ఒడ్డుకు చేరిన విషయం తెలిసిందే. అయితే, ఈ బోటు ప్రమాదంలో వెలికితీసిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఉంచిన ఆ మృతదేహాలను గుర్తించేందుకు గల్లంతైన వారి బంధువులు ప్రయత్నిస్తున్నారు. రాయల్‌ వశిష్ఠ బోటు డ్రైవర్‌ నూకరాజు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం గుర్తించారు. అలాగే, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కడిపికొండ వాసి కొమ్ముల రవీంద్ర, అదే గ్రామానికి చెందిన ధర్మరాజు మృతదేహాలు కూడా ఉన్నాయి. రవీంద్ర జేబులో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా ఆ మృతదేహం ఆయనదేనని నిర్థారించారు. ఆస్పత్రి వద్దకు వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి.
*ఆ టీషర్ట్‌ వల్లే నాన్నను గుర్తించగలిగా!
నూకరాజు మృతదేహాన్ని గుర్తించిన అనంతరం ఆయన కుమారుడు బోరున విలపించారు. తన తండ్రి మూడేళ్లుగా రాయల్‌వశిష్ఠ బోటులో పనిచేస్తున్నారని వెల్లడించారు. 39 రోజుల తర్వాత తన తండ్రిని ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. నూకరాజు ధరించిన టీషర్ట్‌ ఒక్కటే తాను గుర్తించేందుకు ఆధారమనీ.. దాని వల్లే తన తండ్రిని గుర్తించగలిగానని చెప్పాడు.
*ఇంకా లభ్యంకాని రమ్య ఆచూకీ
ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఇంకా ఐదు మృతదేహాలు ఉన్నాయి. మంచిర్యాల వాసి రమ్యశ్రీ మృతదేహం ఇంకా గుర్తించాల్సి ఉంది. రాజమహేంద్రవరం ఆస్పత్రిలో సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. మృతదేహాల శాంపిల్స్‌ను డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్‌ తరలించనున్నట్టు వైద్యులు వెల్లడించారు.
*రమ్య తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం
ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతదేహం లభ్యం కాకపోవడంపై రమ్య తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మంచిర్యాల నుంచి వచ్చి ఆస్పత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ సందర్భంగా రమ్య తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అమ్మాయి గల్లంతై 39 రోజులుగడిచిపోయాయి. తొలుత మేం 15 రోజులు ఇక్కడే ఉన్నాం. మూడు రోజుల క్రితం బోటు తీస్తున్నారనే విషయం తెలిసి ఇక్కడికి వచ్చాం. నిన్న కచ్చులూరుకు వెళ్లాం. మృతదేహాలు లభ్యమైనా అవన్నీ బురదమయంగా ఉన్నాయి. దీంతో గుర్తు పట్టేందుకు వీలుపడటంలేదు. ఇన్ని మృతదేహాల్లో మా అమ్మాయి ఉంటుందని భావిస్తున్నాం. వైద్యులు మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని కన్నీటిపర్యంతమయ్యారు.