నటాషా నోయెల్ మూడేళ్ల వయసులో తన తల్లి ఆత్మహత్య కేసులో సాక్ష్యం చెప్పారు. ఏడేళ్ల వయసులో ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ తరువాత లైంగిక వేధింపులను, మానసిక సమస్యలు ఆమెను తీవ్రంగా వేధించాయి.ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొని నిలబడిన ఆమె, ప్రస్తుతం యోగా టీచర్‌గా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ముంబయిలో ప్రముఖ యోగా నిపుణురాలు (యోగిని)గా పేరు తెచ్చుకున్న నటాషా, బీబీసీ విడుదల చేసిన ‘100 మంది మహిళల’ తాజా జాబితాలో ఒకరు. ‘బాడీ పాజిటివిటీ’ అంశంలో ప్రభావశీల వ్యక్తుల్లో ఆమె ఒకరు.తనకు మూడున్నర ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని నటాషా ప్రత్యక్షంగా చూశారు. ఆ తర్వాత స్కిజోఫ్రీనియా బాధితుడైన ఆమె తండ్రిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దాంతో, అనాథగా మారిన ఆమెను ఒక జంట తీసుకెళ్లి పెంచారు.ఏడేళ్ల వయసులోనే ఆమెపై లైంగిక దాడి జరిగింది. అయినా, ఆమె ఎవరికీ చెప్పలేదు.ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు, మరొకరు అనుచితంగా ప్రవర్తించారు. అప్పుడు కూడా నటాషా బాధను దిగమింగుకుంటూ మౌనంగా ఉండిపోయారు.”నా బాల్యం అపరాధ భావం, తీవ్రమైన వేదనతో ప్రారంభమైంది. ఎప్పుడూ నన్ను నేనే నిందించుకునే దానిని” అని నటాషా బీబీసీతో చెప్పారు.”అత్యాచార బాధితురాలిగా ఉండటాన్ని నేను ఇష్టపడ్డాను. ఎందుకంటే, అది బాధకు చాలా దగ్గరగా ఉంటుంది” అని అన్నారు.ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఆత్మన్యూనతా భావంతో బాధపడిన ఆమెకు, డాన్సులో కాస్త ఉపశమనం కనిపించింది. తనలోని నైపుణ్యాన్ని ఆత్మవిశ్వాసంతో వ్యక్త పరచుకునేందుకు ఆమెకు నృత్యం ఒక మాద్యమంలా ఉపయోగపడింది.ముంబయిలోని ఓ శిక్షణా కేంద్రంలో జాజ్, నృత్య నాటికలతో పాటు, సమకాలీన డాన్సులను కూడా నటాషా నేర్చుకున్నారు.కానీ, మోకాలికి గాయం కావడంతో ఆమె నృత్యాన్ని కొనసాగించలేకపోయారు. పాఠశాలలో వేధింపుల కారణంగా ఓ దశలో ఆమె చదువు కొంతకాలం మానేయాల్సి వచ్చింది.గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకుంటే కనీస భరోసా లభిస్తుందని ఆమె పెంపుడు తల్లి సూచించారు. కానీ, నటాషా అందుకు అంగీకరించలేదు.”నా కొత్త కుటుంబ సభ్యులు నన్ను చాలా బాగా చూసుకునేవారు. అయినా మా అమ్మ (పెంపుడు తల్లి) సూచనను స్వీకరించలేకపోయాను. ఎందుకంటే, టీచర్ వృత్తిని ఎంచుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు” అని నటాషా చెప్పారు.
**బ్రేకప్ నేర్పిన పాఠం
నటాషా తన జీవితంలో మార్పు తెస్తుందనుకున్న ప్రేమ విఫలమైంది. బోయ్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడు.ఈ దశలో “మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరూ మీకు సాయం చేయరు” అన్న పాఠాన్ని ఆమె నేర్చుకున్నారు.”కొన్నేళ్ల పాటు తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాను. శ్వాస ఉన్నంత వరకు తింటాను. ఆ తర్వాత చనిపోతా, లేదంటే కడుపు మాడ్చుకుని పస్తులుంటా అని ఆలోచించేదాన్ని. రోజంతా పడుకునేదాన్ని, లేదంటే అస్సలే పడుకునేదాన్ని కాదు” అని ఆమె గుర్తు చేసుకున్నారు.భారత్‌లో చాలామంది మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్షం చేస్తారు. తాము మానసిక రుగ్మతతో బాధపడుతున్న విషయం ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో అన్న భావన ఒక కారణం, అజాగ్రత్త మరోకారణం.ప్రపంచ ఆరోగ్య సమస్థ అంచనా ప్రకారం, ప్రపంచ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారు.మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు నటాషా తొలుత చికిత్స తీసుకున్నారు. తర్వాత తనే స్వయంగా కొన్ని చిట్కాలు పాటించడం ప్రారంభించారు. ప్రతిరోజూ లక్ష్యాలు పెట్టుకోవడం లాంటి పద్ధతులతో డిప్రెషన్ నుంచి బయటపడేవారు.”రోజువారీగా చిన్నచిన్న చిట్కాలతో డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలో నేర్చుకున్నాను. రోజూ చిన్నచిన్న లక్ష్యాలు పెట్టుకునేదానిని. ఇవాళ జుట్టు దువ్వుకోవాలి, ఐదు నిమిషాల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లాలి అనుకోవడం కూడా నా లక్ష్యాలలో ఉండేవి” అని ఆమె వివరించారు.”ఆ లక్ష్యాలలో ఏదైనా ఒకటి పూర్తి చేయలేని రోజు, నా వైఫల్యాన్ని అంగీకరించేదానిని. విఫలమైనా ఫరవాలేదు, రేపు మళ్లీ ప్రయత్నించాలి అని నాకు నేను చెప్పుకోవడం నేర్చుకున్నాను. అలా నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను. నన్ను నేను ప్రేమించుకోవడంతో పాటు, ఇతరులను కూడా బాగా ప్రేమించేదానిని. ఎలా ఉన్నావని డాక్టర్ నన్ను అడిగితే, బాగున్నాను, మీరెలా ఉన్నారు? అని అడిగేదానిని” అని ఆమె గుర్తు చేసుకున్నారు.
**యోగా చేసిన మేలు
డిప్రెషన్, ఆందోళన నుంచి బయటపడేందుకు నటాషా చేసిన ప్రయాణంలో ధ్యానం కీలకంగా మారింది.ఆమె శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడింది.”మోకాలికి గాయమైన తర్వాత, నృత్యాలు చేయలేకపోయాను. శారీరక శ్రమతో కూడిన ఏ పనీ చేయలేకపోయాను. కానీ, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలు అద్భుతంగా యోగా ఆసనాలు వేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో చూశాను. యోగా భలే ఉంది కదాఅనిపించింది” అని నటాషా చెప్పారు.ఆ తర్వాత ఆమె వెంటనే యోగా నేర్చుకోవడం ప్రారంభించారు. ఆసనాలు వేయడమే కాకుండా, మానసిక ప్రశాంతత కోసం ప్రాణాయామం చేయడం కూడా మొదలుపెట్టారు.”మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ ప్రక్రియ నిదానంగానే ఉంటుంది. కానీ, ఫలితం చాలా ప్రోత్సాహకరంగా ఉంది” అని ఆమె అన్నారు.ఐదేళ్లలోనే యోగాలో మంచి స్థాయికి చేరుకున్నారు.యోగా ఆమెలో ఒత్తిడిని దూరం చేసింది. తనను తాను ప్రేమించుకునేందుకు ఉపయోగపడింది.నటాషా యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. యోగా టీచర్‌గా మారేందుకు శిక్షణ తీసుకున్నారు.
**యోగా టీచర్
27 ఏళ్ల నటాషా ఇప్పటికీ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినా, వెనక్కి తగ్గకుండా ఎలా ముందుకు వెళ్లాలో ఆమె నేర్చుకున్నారు.ఇప్పుడు నటాషా యోగా టీచర్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ కూడా. మానసిక ఆరోగ్యం గురించి అనేక మందికి అవగాహన కల్పిస్తుంటారు. తనను తాను ప్రేమించుకోవడంతోనే తన ప్రయాణం ప్రారంభమైందని ఆమె చెబుతారు.”మీరు నా గురించి అనే మాటలను, నా గురించి నేనే ఎప్పుడో అనుకున్నాను. అవి మరింత దారుణంగా కూడా ఉంటాయి” అని నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ రాసుకున్నారు.ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యోగా చేసేందుకు వారిని ప్రోత్సహిస్తూ, ‘బాడీ పాజిటివిటీ’ అంశం మీద తన అభిప్రాయాలను వారితో పంచుకుంటారు.తన అనుభవాలను, ఆలోచనలను వెల్లడిస్తుంటారు. విషాదమయమైన తన బాల్యం గురించి స్పందిస్తుంటారు.ఆమెను సోషల్ మీడియాలో చాలామంది ‘వ్యక్తిత్వం లేని మనిషి’, ‘అర్హత లేని మనిషి’ లాంటి మాటలతో ట్రోల్ చేస్తుంటారు.భవిష్యత్తుపై నటాషా విజన్: “ప్రపంచంలో ప్రతి మనిషీ సాధికారతతో బతికగలిగే రోజు రావాలనేది నా ఆశ.అందరికీ సమానంగా అవకాశాలు, ప్రాథమిక స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఉండాలి. ప్రతి ఒక్కరు తమ భావోద్వేగ స్థితిని, మేధో స్థితిని పెంచుకొనేందుకు ప్రయత్నించాలి. తద్వారా ప్రతి మనిషి సంపూర్ణ చైతన్యంతో వ్యవహరించగలరు.”
యోగాతో కుంగుబాటుపై విజయం
Related tags :