Health

అల్జీమర్స్ నివారణకు బయోజెన్ ఔషధం

Biogen drug to prevent alzheimers

అల్జీమర్స్‌ వ్యాధి గురించి నేడు అందరికి తెల్సిందే. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు భారతీయుల్లో కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ జబ్బు ప్రధాన లక్షణం. అతి మతి మరుపు. తన ఇంటివారు, ఇరుగు పొరుగు, పరిసరాలను ఎప్పటికప్పుడు మరచిపోవడమే కాకుండా తన గురించి తాను మరచిపోవడాన్ని ‘అల్జీమర్స్‌’ లక్షణాలుగా వైద్యులు చెబుతారు. ఈ వ్యాధి సోకిన వారు బయటకు వెళితే మళ్లీ వారంతట వారు ఇంటికి వచ్చే అవకాశం లేదన్న కారణంగా చాలా మంది వ్యాధిగ్రస్థులను ఇంటికో, ఇంట్లోని ఓ గదికో పరిమితం చేస్తారు.డిమెన్షియా వ్యాధి ముదురితే అల్జీమర్స్‌ వస్తుంది. డిమెన్షియా వ్యాధి వచ్చినవారు ఇతరులు, పరిసరాల గురించి మరచి పోతారు గానీ, తన గురించి జ్ఞాపకం ఉంటుంది. తన గురించి కూడా మరచిపోవడాన్ని అల్జీమర్స్‌ గా పేర్కొంటారు. డిమెన్షియా వ్యాధికి తాము ఔషధాన్ని కనిపెట్టామని, తద్వారా అల్జీమర్స్‌ వ్యాధిగా అది ముదరకుండా నిరోధించగలమని అమెరికాకు చెందిన ఆలోపతి మందుల దిగ్గజ సంస్థ ‘బయోజెన్‌ ఇన్‌కార్పొరేషన్‌’ సోమవారం రాత్రి వెల్లడించింది.ఈ ఔషధ మాత్రల కోసం వచ్చే ఏడాది మొదట్లో అమెరికా, యూరప్, జపాన్‌ దేశాల్లో లైసెన్స్‌కు దరఖాస్తు చేస్తామని, అల్జీమర్స్‌ కు సంబంధించి అదే ఓ గొప్ప విప్లవం అవుతుందని, తాము ఈ పరిశోధనల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించామని, మరే సంస్థ ఇంతగా ఖర్చుపెట్టలేదని, లైసెన్స్‌ దరఖాస్తు కోసం కనీసం ముందుకు వచ్చే అవకాశం లేదని కంపెనీ సీఈవో మైఖేల్‌ వోనత్సోస్‌ వ్యాఖ్యానించారు. అల్జీమర్స్‌కు ఇదో అద్భుత ఔషధమని చెప్పవచ్చని ఆయన అన్నారు.