Sports

దాదా…కుంబ్లేను విరాట్ నెత్తి మీద కూర్చోబెట్టేవాడు

Saurav Would Have Made Kumble Control Virat

టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే, సారథి విరాట్‌ కోహ్లీ మధ్య వివాదం భారత క్రికెట్లో ఓ పెద్ద కుదుపు. ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో అని చాలా మంది బాధపడ్డారు. కోహ్లీకి నచ్చజెప్పేందుకు సచిన్‌, గంగూలీ ఎంతో ప్రయత్నించారు. చివరికి జంబో రాజీనామా చేసి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. ఇదే వివాదం గనక ఇప్పుడు చోటు చేసుకుంటే గంగూలీ బలవంతంగానైనా సరే కుంబ్లేను కొనసాగించేవాడని క్రికెట్‌ పాలకుల కమిటీ మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ అన్నారు. అసలు అప్పుడు ఏం జరిగిందో వివరించారు.

‘మనకున్న అత్యుత్తమ కోచ్‌ అనిల్‌కుంబ్లే. అతడి ఒప్పందంలో పొడగింపు నిబంధన ఉంటే కచ్చితంగా పదవీకాలం పొడగించేవాడిని. కుంబ్లే అంటే నాకెంతో గౌరవం. పొడగింపు నిబంధన లేకపోవడంతో నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోయాను. క్రికెట్‌ సలహా సంఘంపై ఆధారపడ్డాను. సచిన్‌, సౌరవ్‌తో సుదీర్ఘంగా మాట్లాడాను. ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతున్నప్పుడు బర్మింగ్‌హామ్‌లో సచిన్‌, కోహ్లీ, కుంబ్లేను కలిశాను. హైదరాబాద్‌ నుంచి ముంబయిలోని విరాట్‌తో టెలీఫోన్‌లో చాలాసేపు మాట్లాడానని అప్పుడు సచిన్‌కు చెప్పా. కుంబ్లేను కొనసాగించడం అతడికి ఇష్టం లేదని పేర్కొన్నా. మీ స్థాయి వ్యక్తులు చెబితే అతను ఒప్పుకోవచ్చని అన్నా. సచిన్‌, గంగూలీ అతడితో మాట్లాడారని తెలుసు. కోహ్లీతో చాలాసేపు మాట్లాడానని దాదా ఈ మధ్యే చెప్పాడు. కుంబ్లేను అంగీకరించకపోతే మేమెలా ఒప్పించగలమని పశ్నించాడు’ అని రాయ్‌ తెలిపారు.

‘డ్రస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌, సారథి మధ్య విభేదాలుంటే ఎవరిని తీసేస్తారో చెప్పండి? కచ్చితంగా కోచ్‌నే. అక్కడే మేం దొరికిపోయాం. ఈ విషయం జనాలకు తెలిసిపోయింది. రామచంద్ర గుహ రాజీనామా చేశారు. మిథాలీ, రమేశ్‌ పొవార్‌ విషయంలోనూ ఇదే జరిగింది. డ్రస్సింగ్‌ రూమ్‌లో వైరుధ్యాలు ఉండటంతో మళ్లీ మేం సలహా సంఘంపై ఆధారపడ్డాం. చాలా వివాదం జరిగింది. వీటిని అత్యుత్తమంగా నియంత్రించే వారెవరు? అదే వివాదం ఇప్పుడు చోటుచేసుకొని ఉంటే కుంబ్లేను సౌరవ్‌.. కోహ్లీ నెత్తిమీద కూర్చోబెట్టేవాడు! కానీ, అది మరింత ఆందోళనకు గురిచేసేది. కుంబ్లే తనంతట తానే వెళ్లిపోయినందుకు అతడంటే నాకెంతో గౌరవం’ అని రాయ్‌ వెల్లడించారు.