DailyDose

ఏపీలో వాణిజ్య నిబంధనల సవరణ-వాణిజ్యం-10/25

ఏపీలో వాణిజ్య నిబంధనల సవరణ-వాణిజ్యం-10/25 - Andhra Pradesh Industrial Policy Ammended-Telugu Business News Today Latest-10/25

* సీఎం హామీలు, ఆదేశాలను త్వరగా అమల్లో పెట్టేలా బిజినెస్‌ రూల్స్‌ సవరణ చేస్తూ సర్కార్‌ జీవో జారీ చేసింది. సీఎం చెప్పిన హామీల అమలు జాప్యం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సీఎం హామీల అమలును మూడు కేటగిరీలుగా విభజన చేసింది. వాటిని అవుట్‌ టు డే, మోస్ట్‌ ఇమ్మీడియెట్‌, ఇమ్మీడియెట్‌ కేటగిరీలుగా విభజించింది. అవుట్‌ టుడే కేటగిరిలో నిర్ణయం తీసుకున్న రోజే జీవో జారీ, మోస్ట్‌ ఇమ్మీడియెట్‌ కేటగిరిలో నిర్ణయం తీసుకున్న 5 రోజుల్లో జీవో జారీ, ఇమ్మీడియెట్‌ కేటగిరిలో నిర్ణయం తీసుకున్న 15 రోజుల్లో జీవో జారీ అయ్యేలా బిజినెస్ రూల్స్ ను సవరించింది.

* దేశీయ మార్కెట్లో పసిడి ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. ధన త్రయోదశితో పాటు పెళ్లిళ్ల సీజన్‌ కూడా దగ్గర పడుతుండటంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో బంగారం ధర మళ్లీ 39వేల మార్క్‌ను దాటింది. శుక్రవారం నాటి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 220 పెరిగి రూ. 39,240 పలికింది. అటు వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. ఇవాళ ఒక్కరోజే రూ. 670 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,680కి చేరింది.

* దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ. 3,375.40కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 576.46కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది దాదాపు ఆరు రెట్లు ఎక్కువ కావడం విశేషం. స్టాండ్‌లోన్‌ ప్రాతిపదికన చూస్తే.. బ్యాంక్‌ నికర లాభం మూడు రెట్లు పెరిగింది. గతేడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రూ. 944.87కోట్ల నికర లాభం నమోదు చేయగా.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నికరలాభం రూ. 3,011.73కోట్లకు పెరిగింది. ఇక బ్యాంక్‌ ఆదాయం కూడా పెరిగింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఎస్‌బీఐ గ్రూప్‌ రూ. 89,347.91కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంక్‌ ఆదాయం రూ. 79,302.72కోట్లుగా నమోదైంది. అంతేగాక.. నిరర్ధక ఆస్తులు కూడా తగ్గుముఖం పట్టాయి. గతేడాది జులై-సెప్టెంబరులో 9.95శాతం ఉన్న స్థూల నిరర్ధక ఆస్తులు ఈ సారి 7.19శాతానికి తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తులు 4.84శాతం నుంచి 2.79శాతానికి పరిమితమయ్యాయి.

* జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ 2020 మోడల్‌ ఏ6 సెడాన్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆడీ ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ థిల్లాన్‌తో కలిసి ఈ కారును విడుదలచేశారు. ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ. 54.20లక్షల నుంచి రూ. 59.20 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రీమియం ప్లస్‌, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తోంది. ఎనిమిదో తరానికి చెందిన ఈ కారులో సరికొత్త ఫీచర్లను జోడించినట్లు కంపెనీ తెలిపింది. ఆడీ ఏ6లో 2.0 లీటర్ల టీఎఫ్ఎస్‌ఐ, బీఎస్‌-6 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 240 బీహెచ్‌పీ శక్తిని, 370 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 7 స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేరుబాక్స్‌ను ఇచ్చారు. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.8 సెకన్లలో అందుకుంటుంది. కారు ముందు భాగంలో సింగిల్‌ ఫ్రేమ్‌ గ్రిల్, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌లను అమర్చారు. కారు ఇంటీరియర్‌లో పూర్తి స్థాయిలో మార్పులు చేశారు. దీనిలో డ్యూయల్‌ టచ్‌స్ర్కీన్‌ ఇన్ఫోటైన్మెం‌ట్‌ సిస్టమ్‌ను అమర్చారు. 18 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, హ్యాండ్స్‌ ఫ్రీ పార్కింగ్‌ సదుపాయం, ఫోర్‌జోన్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ఎనిమిది ఎయిర్‌బ్యాగులను అమర్చారు. వీటితో పాటు ఏబీఎస్‌, ఈబీడీ, ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఈఎస్‌పీ, పార్కింగ్‌ సెన్సర్స్‌, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన సౌకర్యాలు కూడా ఉన్నాయి.