ఇతిహాసగాథ అయిన మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో ‘మహాభారత్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొణె ద్రౌపది పాత్రలో కనిపించనున్నారు. మధు మంతెనతో కలిసి దీపిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద్రౌపది పాత్రలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు నటి దీపిక. ఈ విషయంపై ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ..‘ ద్రౌపది పాత్రను పోషిస్తున్నందుకు ఎంతో సంతోషం, గౌరవంగా ఉంది. ద్రౌపది పాత్ర నా జీవితకాలం గుర్తిండిపోతుందని నేను నమ్ముతున్నాను. మహాభారతం ఒక పౌరాణిక గ్రంథంగానే మనకు తెలుసు. ప్రతి ఒక్కరికీ ఈ గ్రంథం ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. ద్రౌపదిని కీలక పాత్రగా చేసుకుని మేము మహాభారతాన్ని చాలా కొత్తగా, ఆసక్తికరంగా అందరికీ గుర్తిండిపోయేలా తెరకెక్కిస్తున్నాం.’ అని దీపిక తెలిపారు. మరో నిర్మాత మధు మంతెన మాట్లాడుతూ.. ‘మనందరికీ మహాభారతం గురించి తెలుసు. మేము కూడా మహాభారత కథనే కొంచెం కొత్తగా, ద్రౌపదిని కీలక పాత్రగా చేసుకుని.. ఆమె దృష్టికోణంలో మహాభారతం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దీపికా పదుకొణె ‘83’, ‘చపాక్’ చిత్రాల్లో నటించారు. భారత క్రికెట్ ఆడగాడు కపిల్ దేవ్ జీవితాన్ని తెరకెక్కిస్తున్న ‘83’ సినిమాలో కపిల్ పాత్రలో రణవీర్, కపిల్ భార్య రోమీ భాటియా పాత్రలో దీపిక నటించారు. అంతేకాకుండా యాసిడ్ దాడికి గురైన బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘చపాక్’ చిత్రంలో దీపిక కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఈ సినిమాతో దీపికా పదుకొణె నిర్మాతగా మారారు.
ద్రౌపదిలో కొత్తగా
Related tags :