DailyDose

ఇసుకలేమితో కార్మికులు బాధపడుతున్నారు-తాజావార్తలు-10/25

Pawan Kalyan Questions YS Jagan Govt On Sand Scarcity-Telugu Breaking News Today-10/25-ఇసుకలేమితో కార్మికులు బాధపడుతున్నారు-తాజావార్తలు-10/25

* ఆర్టీసీ ఆస్తులపై తెరాస నేతల కన్ను పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. భాజపాకు ఓటములు కొత్తకాదని.. ఎన్నో ఓటముల తర్వాతే కేంద్రంలో భాజపా వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని.. భాజపా జాతీయ నాయకత్వం కూడా దీన్ని సీరియస్‌గానే పరిగణిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులంతా నిర్భయంగా, ప్రజాస్వామ్య యుతంగా సమ్మె కొనసాగించాలని.. తాటాకు చప్పుళ్లకు భయపడవద్దని సూచించారు.

* రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు పనుల్లేక బాధపడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదని అన్నారు. అసలు అమరావతిలో రాజధాని కడతారా? లేదా? స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పవన్‌ను ఇసుక లారీ యజమానులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

* ఆర్టీని కార్మిక సంఘాల ఐకాస తలపెట్టిన సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమయ్యారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు సరిగా లేదని.. ఆయన మాటలతో ఒక ఆర్టీసీ కార్మికుడు ఒత్తిడికి గురై చనిపోయాడని తెలిపారు. సంఘాలు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే ఉన్నాయన్నారు.

* కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం భాజపా ఎంపీ సుజనా చౌదరిని కలిశారు. వేర్వేరు పార్టీలకు చెందిన వీరిద్దరి కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరులో భాజపా నేత చందు సాంబశివరావు ఇంటికి వచ్చిన ఎంపీ సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. సుజనాను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే వంశీ మీడియా సమావేశం అనంతరం ఎంపీతో కలిసి ఒకే కారులో వెళ్లారు. అయితే, సుజనా చౌదరితో సంబంధాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వల్లభనేని ఇప్పటికే పలుమార్లు చెప్పారు.

* జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం వల్లే స్థానికంగా జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లో తొలిసారిగా ప్రాంతీయ అభివృద్ధి మండలి(బ్లాక్ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్) ఎన్నికలు జరిగాయి. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో 98.3శాతం పోలింగ్‌ నమోదైంది. దీనిపై ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం అని కొనియాడారు.

* హరియాణాలో భాజపా అధికారంలోకి వచ్చేందుకు అడ్డదారులు తొక్కుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కోసమని భాజపా నేతలు సిర్సా ఎమ్మెల్యే, హరియాణా లోఖిత్‌ పార్టీ నేత గోపాల్‌ కండా మద్దతు కోరడాన్ని వారు ఖండించారు. ‘బేటీ బచావో- బేటీ పఢావో’ అని ఓ వైపు నినాదాలు ఇస్తూ.. మరోవైపు అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఎలా కోరతారని ప్రశ్నించారు. ఓ ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక వేధింపుల కేసులో గోపాల్‌ నిందితుడిగా ఉన్నారు.

* దేశీయ మార్కెట్లో పసిడి ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. ధన త్రయోదశితో పాటు పెళ్లిళ్ల సీజన్‌ కూడా దగ్గర పడుతుండటంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో బంగారం ధర మళ్లీ 39వేల మార్క్‌ను దాటింది. శుక్రవారం నాటి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 220 పెరిగి రూ. 39,240 పలికింది. అటు వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. ఇవాళ ఒక్కరోజే రూ. 670 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,680కి చేరింది.

* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శరద్‌పవార్‌ సారథ్యంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని సత్తా చాటిన విషయం తెలిసిందే. శివసేన పత్రిక ‘సామ్నా’లో ఈ విషయానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. మిత్రపక్షమైన భాజపా గురించి ప్రస్తావించకుండా ఎన్సీపీని ప్రశంసల్లో ముంచెత్తింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి వివరిస్తూ రాసిన కథనంలో కాంగ్రెస్‌, ఎన్సీపీలకు సముచిత స్థానం కల్పించింది. ప్రత్యేకంగా పవార్ గురించి కూడా రాసింది. భాజపాపై విమర్శల వర్షం కురిపించింది.

* పండగ సీజన్‌ కావడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ 2,500 అదనపు సర్వీసులను నడుపుతోందని అధికారులు తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా 200 ప్రత్యేక రైళ్లను కేటాయించామన్నారు. ఈ అదనపు సర్వీసులు క్రిస్మస్‌ వరకు కొనసాగుతాయన్నారు. అలాగే రద్దీగా ఉండే పలు మార్గాల్లో ప్రస్తుతం ఉన్ సర్వీసులకు అదనపు బోగీలను జతచేసే ఏర్పాటు కూడా చేశామన్నారు. ముఖ్యంగా దిల్లీ-పట్నా, దిల్లీ-కోల్‌కతా, దిల్లీ-ముంబయి, హావ్‌డా-కతిహార్‌, హరిద్వార్‌-జబల్‌పూర్‌ లాంటి రద్దీ మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు.

* దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా సాగినప్పటికీ.. చివర్లో లాభాల స్వీకరణ తప్పలేదు. ఫలితంగా సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 38 పాయింట్ల స్వల్ప లాభంతో 39,058 వద్ద, నిఫ్టీ ఒకే ఒక పాయింటు లాభపడి 11,584 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.90గా కొనసాగుతోంది.

* రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వం సృష్టించిన ఇసుక సమస్యతో లక్షలాది మంది కార్మికులు పస్తులుంటున్నారన్నారు. వారందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే.. ఇచ్చేది లేదంటూ మంత్రి మాట్లాడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు.

* విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు యారాడ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద ముప్పు తప్పింది. రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీవీయంసీ అధికారులు కొండ చరియలను తొలగిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పంపిస్తున్నారు. విశాఖ మన్యంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

* ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతలపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం, నేతలపై ఉగ్రవాదులు గురిపెట్టినట్లు నిఘావర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదులు.. ఇప్పటికే పీవోకే ద్వారా చొరబడినట్లు సమాచారం.

* హరియాణాలో కింగ్‌మేకర్‌గా అవతరించిన జేజేపీ అధినేత దుష్యంత్‌ చౌతాలా భాజపాకు షాక్‌ ఇచ్చారు. ‘ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే భాజపా నేతలు ఎవరైనా కలిశారా? అని చాలా మంది అడుగుతున్నారు. మేం ఇంతవరకు ఎవర్నీ కలవలేదు. మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ఆ పార్టీకి మద్దతిచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. అలాంటి ఆలోచనలు కూడా లేవు’అని దుష్యంత్‌ తెలిపారు.

* ప్రభుత్వ ఏర్పాటుకు 6 సీట్ల దూరంలో నిలిచిన భాజపా.. జేజేపీ అధినేత దుష్యంత్‌ చౌతాలాను సంప్రదించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నం విఫలమైతే భాజపాకు మరో ప్రత్యామ్నాయం ఉంది. 9 మంది ఇతరులు గెలుపొందారు కాబట్టి వారిని మచ్చిక చేసుకునే అవకాశముందని రాజకీయ నిపుణులు అంటున్నారు. వీరిలో ఇప్పటికే ఇద్దరు దిల్లీకి చేరుకున్నారు.

* కశ్మీర్‌లో మానవహక్కుల పరిస్థితిపై అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు విచారం వ్యక్తం చేయడం భారత ప్రజాస్వామ్యం, సంస్థాగత భద్రతపై వారికి అవగాహన లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుందని విదేశాంగశాఖ అభిప్రాయపడింది. అమెరికా విదేశాంగ శాఖలోని ఆసియా-పసిఫిక్‌ విభాగం నియమించిన సబ్‌కమిటీ కశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్‌ గురువారం స్పందించారు.

* ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా మరోసారి పునరుద్ఘాటించింది. తద్వారా భారత్‌తో శాంతి చర్చలకు ముందడుగు వేయాల్సిన బాధ్యత పాక్‌ పైనే ఉందని స్పష్టం చేశారు. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధమంటూ మరోసారి వ్యాఖ్యానించారు. అయితే ఇరు దేశాలు కోరితేనే అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆయన పాలక వర్గంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

* ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 205, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.95 గా ఉంది.

* మహారాష్ట్రలో మరోసారి కమలం వికసించింది. సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలను పొందాలన్న కమలనాథుల ఆశలకు కొంతమేర గండిపడినా, మిత్రపక్షమైన శివసేనతో కలిసి అధికార పీఠంపై కొలువుదీరడం ఖాయంగా కనిపిస్తోంది. హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా కేవలం 6 స్థానాల దూరంలో నిలిచిపోయింది. ఏ పార్టీకీ స్పష్టమైన సంఖ్యాబలం లేకపోవడంతో కొత్తగా ఏర్పాటైన జన్‌నాయక్‌ జనతా పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా, స్వతంత్రులు కీలకంగా మారారు.

* గ్రూప్‌-2 ఉద్యోగాల తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ గురువారం ప్రకటించింది. మొత్తం 1032 ఉద్యోగాల్లో 1027కి తుది ఎంపిక జాబితా వెల్లడించింది. గురువారమిక్కడ టీఎస్‌పీఎస్సీ భవన్‌లో జరిగిన కమిషన్‌ ప్రత్యేక సమావేశంలో ఈ ఫలితాలను ఆమోదించింది. ఇందులో 259 డిప్యూటీ తహసీల్దార్లు, 284 మంది ఎక్సైజ్‌ ఎస్సైలు, 156 వాణిజ్య పన్నులశాఖ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌ తదితర పోస్టులు ఉన్నాయి.

* రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పరిశ్రమల్లోని అన్ని అవకాశాలనూ స్థానిక యువత అందిపుచ్చుకునేలా శిక్షణనిస్తామని, నిరుద్యోగ సమస్యకు ఇదే సరైన పరిష్కారమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో రూ.50 కోట్లతో నిర్మించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) నూతన ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు.

* ఏపీ రాజధాని నిర్మాణం, స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వాటిపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం సరికాదని అభిప్రాయపడింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రుల ఎజెండాలతో తమకు పని లేదని, చట్టంతో మాత్రమే తమకు సంబంధమని స్పష్టం చేసింది.

* హుజూర్‌నగర్‌లో భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం అక్కడ సభ నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. దీనికి అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస నేతలకు సూచించారు. హుజూర్‌నగర్‌లో ఉన్న పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని ఫోన్‌లో అభినందించారు.

* విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన వినతి పత్రంలోని డిమాండ్లన్నీ నిర్హేతుకమైనవనీ, వాటిలో నెరవేర్చదగినది ఒక్కటీ లేదని భాజపా ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్రం చెబుతున్న లెక్కలన్నీ వాస్తవ విరుద్ధమని, కొన్ని అంచనాల ఆధారంగా వేసినవి మాత్రమేనని కొట్టిపారేశారు.

* టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలకు షాక్‌ ఇచ్చే ఆదేశాలను సుప్రీంకోర్టు గురువారం జారీచేసింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) కింద టెలికాం సంస్థల నుంచి రూ.92,000 కోట్ల రికవరీకి అనుమతించాలన్న కేంద్రప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించింది. ప్రైవేటు సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లతో పాటు ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ లైసెన్స్‌ ఫీజు కింద ఇంకా రూ.92,000 కోట్లు చెల్లించాల్సి ఉందని గత జులైలో సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం తెలిపింది.

* భారత్‌లోని సిక్కులు ఇక పాకిస్థాన్‌లోని పవిత్ర దర్బార్‌ సాహిబ్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా దర్శించుకోవచ్చు. ఇందుకు వీలు కల్పించే కర్తార్‌పుర్‌ కారిడార్‌ను వాడుకలోకి తీసుకొచ్చేందుకు ఉభయ దేశాలు గురువారం చారిత్రక ఒప్పందం చేసుకున్నాయి. భారత పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ మందిరం నుంచి పాకిస్థాన్‌ కర్తార్‌పుర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ మందిరానికి ఈ నడవా అనుసంధానంగా ఉంటుంది.

* గర్భిణులూ జాగ్రత్త! ప్లాస్టిక్‌ డబ్బాల్లోని ఆహారం తినడం వల్ల, సౌందర్య సాధనాలను వినియోగించడం వల్ల… వాటిలోని రసాయనాలు పుట్టబోయే బిడ్డల ప్రజ్ఞాస్థాయిని ప్రభావితం చేస్తాయట. గర్భిణుల్లో హానికర రసాయనాల స్థాయి ఎక్కువగా ఉంటే, వారికి పుట్టే బిడ్డల్లో వివేక స్థాయులు తక్కువగా ఉంటాయని నిర్ధరణకు వచ్చినట్టు పరిశోధకులు వెల్లడించారు.

* ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌ దాటలేకపోయిన సైనాకు తాజా విజయంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి జంట ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చి క్వార్టర్స్‌కు చేరుకుంది.