న్యూజిలాండ్-ఆస్ట్రేలియా తొలి సాహితీ సదస్సును నిర్వహించాలని న్యూజిలాండ్ తెలుగు సంఘం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 16, 17 తేదీల్లో ఆక్లాండ్‌లో తొలి సంధ్య బ్యానర్‌పై ఈ సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంఘం అధ్యక్షురాలు శ్రీలత మగతల తెలిపారు. 2018 నవంబర్‌లో మెల్‌బోర్న్‌లో లోక్‌నాయక్ ఫౌండేషన్ (విశాఖ), వంగూరి ఫౌండేషన్ (అమెరికా) ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ ప్రపంచ సాహితీ సదస్సు తమ దేశాల్లోని భాషాభిమానులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సాహితీ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిచిందని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలోని తెలుగువారిలో సాహితీ తృష్ణను తట్టిలోపి ఒక సుదీర్ఘ ప్రణాళికా రచనకు ప్రోత్సహాన్నిచ్చిందన్నారు. ఇందులో భాగంగానే రెండు దేశాల్లోని తెలుగు భాషాభిమానులు ఏటా ఆయా ముఖ్య పట్టణాల్లో ఒక సాహితీ సదస్సు నిర్వహించాలని భావించినట్టు శ్రీలత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్లాండ్‌లో తొలి సాహితీ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎంతో మంది అహర్నిశలు కృషిచేస్తున్నారని, తెలుగు సాహిత్యాభిమానులు విచ్చేసి జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సదస్సు ప్రధాన ఆశయాలివే..
* ఆస్టేలియాలో ఉన్న తెలుగు రచయితలు, పండితులు, సాహితీప్రియులు కలుసుకొని తెలుగు సాహిత్యాభిమానాన్నీ, రచనలనూ ఆత్మీయ వాతావరణంలో పంచుకొనే వేదికను కల్పించడం,
* ఆయా ప్రాంతాల్లో తెలుగు భాష అమలుపై ప్రత్యేక సమీక్ష – ఆచరణ సాధ్యమైన ప్రణాళికలపై చర్చించడం
* ఔత్సాహికులైన భాషాభిమానులు, రచయితలకు రచనా రంగంలో స్వతంత్ర భావాల వ్యక్తీకరణకు ప్రోత్సహించడం
* నిష్ణాతులైన సాహిత్యకారుల ఆహ్లాదకరమైన ప్రసంగాలు, పద్యాలు, పాటలు, కవితలు వినే అవకాశం కల్పించడం
* తెలుగు భాషా సంస్కృతులకు అద్దంపట్టే రంగస్థల నాటక కళాకారులను ప్రోత్సహించడం
ఏమేం ఉంటాయి?
చర్చావేదికలు, నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, నూతన పుస్తకావిష్కరణలు, ప్రేక్షకులకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చే జాతీయాలు, సామెతలు, సరదా సాహిత్య పోటీలు, జానపదాలు, పద్యాలు, తెలుగు భాషా సాహిత్యంలో హాస్య ఘట్టాలు, మాండలికాలు – వాటి ప్రాముఖ్యత, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తెలుగువారి జీవన విధానాలపై కవితలు, కథానికలు, అంతా అప్పటికప్పుడు పాల్గొనే గొసులు కథ, పుస్తక విక్రయ శాల.. మరెన్నో..
తెలుగు భాషాభిమానులంతా ఆహ్వానితులే..
తొలిసారిగా జరగబోయే ఈ సదస్సులో పాల్గొని తమ రచనలు, అభిప్రాయాలు, విశ్లేషణలు పంచుకోవాలని అందరినీ ఆహ్వానిస్తున్నట్టు ఆమె తెలిపారు. తెలుగు భాషాభిమానులంతా ఈ సదస్సుకు ఆహ్వానితులేనన్నారు. ముఖ్యంగా స్థానిక రచయితలు, సాహితీ వేత్తలకు ఇదో ప్రత్యేక వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఈ సదస్సుకు హాజరు కావాలనుకుంటున్నవారు phone:+64 210 275 0346; email- president@nzta.orgలను సంప్రదించాలని కోరారు.