Editorials

నాకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి అనుకూలంగా రాస్తున్నాయి. నిషేధించాలి.

Trump calls for ban on Washington Post & NY Times

అమెరికాలో దిగ్గజ వార్తా పత్రికలైన వాషింగ్టన్‌ పోస్ట్‌, ద న్యూయార్క్‌ టైమ్స్‌లపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఆ పత్రికల చందాను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. ఆ పత్రికలు ‘నకిలీ’ అని, అన్ని ప్రభుత్వ సంస్థలు వాటి చందాను రద్దు చేసుకోవాలని అన్నారు. ద న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక ‘ఫేక్‌ న్యూస్‌ పేపర్‌’ అని మండిపడ్డారని, ఇకపై ఆ పత్రిక వైట్‌ హౌజ్‌లో ఉండేందుకు వీలులేదని ట్రంప్‌ ఆదేశించినట్లు ద న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం రాసింది. దీంతోపాటు వాషింగ్టన్‌ పోస్ట్‌ను కూడా నిషేధించినట్లు పేర్కొంది. ఈ మేరకు వైట్‌ హౌజ్‌లోని అధికారులు ఆ రెండు పత్రికలను నిలిపేయాల్సిందిగా ఆదేశించారు. స్థానిక వార్తా పత్రిక రాసిన కథనం ప్రకారం.. ట్రంప్ పత్రికా విలేకరులను ‘ప్రజల శత్రువులు’ అని పిలిచారు. విమర్శనాత్మక వార్తల కవరేజీని ‘నకిలీ’గా అభివర్ణించారు. అంతేకాక జర్నలిస్టులపై అపవాదులనే కేసు పెట్టడాన్ని సులభతరం చేస్తామని బెదిరించారు. అమెరికాలోని ప్రముఖ పత్రికలకు వైట్‌ హౌజ్‌ ఏళ్లుగా చందా కలిగి ఉంది. వాషింగ్టన్‌ పోస్ట్‌, ద న్యూయార్క్‌ టైమ్స్‌ సహా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, యూఎస్‌ఏ టుడే, ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వంటి పత్రికలు రోజూ ఉదయం అక్కడికి వస్తాయి. అమెరికా అధ్యక్షుడు ఇలా పత్రికల చందా రద్దు చేయడం ఇది మొదటిసారి కాదు. 1962లో జాన్‌ ఎఫ్‌.కెనడీ ద న్యూయార్క్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ అనే పత్రికను వైట్‌ హౌజ్‌లోకి రాకుండా నిషేధించారు.