కృష్ణాజిల్లా గన్నవరం తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన వంశీ దాదాపు అరగంట పాటు జగన్‌తో సమావేశమయ్యారు. సీఎంతో వంశీ భేటీ కావడంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. పార్టీ మారే విషయంలోనే ముఖ్యమంత్రిని కలిశారా? లేక గన్నవరం నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు, ఇటీవల వంశీపై నకిలీ పట్టాల వ్యవహారంపై కేసు నమోదు చేయడం గురించి చర్చించేందుకు కలిశారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి విజయవాడ పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఆయనతో వంశీ సమావేశమవుతున్నారు. ఇవాళ ఉదయం గుంటూరులో సుజనాచౌదరి పర్యటన సమయంలో ఆయనతో సమావేశమయ్యారు. తర్వాత ఒకే కారులో ఇద్దరూ కలిసి గుంటూరు నుంచి ఒంగోలు వెళ్లినట్టు సమాచారం. తెదేపా ఆధ్వర్యంలో ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చినప్పటికీ వంశీ గన్నవరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. తనపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని నిన్న జరిగిన గన్నవరం నియోజకవర్గ తెదేపా కార్యకర్తల సమావేశంలో వంశీ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వంశీ పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగిన తరుణంలో తాను అయ్యప్ప మాలధారణలో ఉన్నానని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. అనూహ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది.
సుజనా, జగన్‌లతో వల్లభనేని వంశీ సమావేశం
Related tags :