సర్వమానవాళీ కోరుకొనేవి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుర్దాయం.
ఆ మూడింటినీ అందించే రోజు ‘ధన త్రయోదశి’.ఆశ్వయుజ బహుళ త్రయోదశికి అనేక విశిష్టతలున్నాయి. ఈ రోజుకు వ్యవహారిక నామాలు అనేకం. వాటిలో ప్రధానమైనది ‘ధనత్రయోదశి’. ఉత్తర భారతదేశంలో ‘ధన్ తేరస్’ అని పిలుస్తారు. దీపావళి వేడుకలు ఈ రోజు నుంచే మొదలవుతాయి. ఈ రోజున తమ ఇళ్ళకు పితృదేవతలు
వస్తారన్న నమ్మకం ఉంది.
**లక్ష్మీ కటాక్షం
అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మఽథనం సాగించగా, శ్రీమహా
లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. కాగా, విష్ణుమూర్తి వక్షస్థలం మీద భృగుమహర్షి తన్నడంతో, ఆ వక్షస్థలంలో నెలవైన లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చినట్టు ‘శ్రీవేంకటాచల మాహాత్మ్యం’ కథ చెబుతోంది. వైకుంఠం నుంచి ప్రస్తుతం కొల్హాపూర్‌గా ప్రాచుర్యంలో ఉన్న నాటి కరవీరపురానికి లక్ష్మీదేవి అరుదెంచిన రోజు ఇదేనని ఒక కథనం. ఈ సంగతి తెలుసుకున్న కుబేరుడు అక్కడికి వచ్చి, ఆమెను పూజించి, లక్ష్మీ కటాక్షాన్ని పొందాడట! అందుకే దీన్ని ‘కుబేర త్రయోదశి’, ‘ఐశ్వర్య త్రయోదశి’ అని కూడా అంటారు.
**ఆయుర్దాయకం
ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ‘యమ త్రయోదశి’గా కూడా పిలుస్తారు. ఈ రోజు సూర్యాస్తమయాన సమయంలో ఇంటి ద్వారానికి రెండు వైపులా మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తారు. వీటిని ‘యమదీపాలు’ అంటారు. ఈ దీప జ్వలనం వల్ల అకాల మృత్యుభయం ఉండదని విశ్వాసం.
**ఆరోగ్యప్రదం
పురాణ గాథల ప్రకారం, క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు
ధన్వంతరి కూడా ఇదే రోజున జన్మించాడు. అందుకే ఈ రోజను ‘ధన్వంతరి జయంతి’గా పాటిస్తారు. ఆయన శ్రీమహావిష్ణువు అంశ.
**ఆరోగ్యానికి
అధిదేవత. ఆయుర్వేద వైద్యానికి మూలం ఆయనే! ఎలాంటి అనారోగ్యం లేకుండా చూడాలనీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించాలనీ ధన్వంతరిని స్మరిస్తే ఆయన కటాక్షిస్తాడు. సంపత్కారిణి అయిన శ్రీమహాలక్ష్మీనీ, ధనాధిపతి అయిన కుబేరుణ్ణీ ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తే సిరిసంపదలు, సౌభాగ్యం చేకూరుతాయని చెబుతారు. అందుకే లక్ష్మీదేవి రూపులను పూజామందిరంలో ఉంచి ఆరాధిస్తారు. ఈ రోజు బంగారం, వెండి విరివిగా కొనుగోలు చేయడం ఉత్తరాది ప్రాంతాల వారి ఆనవాయితీ. ఇప్పుడిది దేశమంతటికీ పాకింది. ఇలా విలువైన వస్తువులు ఈ రోజు కొంటే సంవత్సరమంతా తమ ఇళ్ళలో లక్ష్మీదేవి కొలువవుతుందని విశ్వాసం.
సర్వశుభదాయకం…ధన త్రయోదశి
Related tags :