వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, దానశీలిగా పేరుపొందిన స్వర్గీయ డా.గొర్రెపాటి నవనీతకృష్ణ ఒకదశలో రాజకీయాల్లోకి రావాలని తీవ్రంగా ప్రయత్నించారు. కల్లాకపటం ఎరుగని నవనీతకృష్ణ ఈ సందర్భంగా కొందరు రాజకీయ దళారుల చేతిలో తీవ్రంగా మోసపోయారు, నష్టపోయారు.
స్వర్గీయ ఎన్టీరామారావు అభిమాని అయిన నవనీతకృష్ణ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఆ పార్టీకి అభిమానిగా ఉండేవారు. అమెరికాలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లలో నవనీతకృష్ణ కీలకపాత్ర పోషించారు. 2007లో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా అమెరికాలో దాదాపు మూడు వారాలకు పైగా పర్యటించినపుడు నవనీతకృష్ణ తెలుగుదేశం పార్టీకి భారీగా విరాళాన్ని అందించడంతో పాటు చాలా నగరాల్లో చంద్రబాబు సభలను ఏర్పాటు చేసి తెదేపాకు విరాళాలను సేకరించారు. అమెరికాలో తెలుగుదేశం పార్టీకి మంచి నాయకత్వాన్ని, మంచి కేడర్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం చంద్రబాబు, లోకేష్ అమెరికా వచ్చినపుడు వారికి స్వాగత సత్కారాలు ఘనంగా జరగడంలోనూ కీలకపాత్ర పోషించారు.
*** ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు
2009 ఎన్నికల్లో ఆయన స్వగ్రామం ఘంటసాల…బందరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉండటంతో అక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని డా.నవనీతకృష్ణ ఎంతగానో ప్రయత్నించారు. అక్కడ రాజకీయ వాతావరణం నవనీతకృష్ణకు అనుకూలంగా ఉండకపోవడంతో విజయవాడ నుంచి తెదేపా అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన చాలాకాలం మకాం వేసి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అనుకున్నట్లుగానే ఆ ఎన్నికల్లో ఆయనకు తెదేపా అభ్యర్థిత్వం లభించలేదు. అయినప్పటికీ తరచుగా కృష్ణాజిల్లాకు వస్తూ 2014వరకు తెలుగుదేశం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తరచుగా చంద్రబాబును కలిసేవారు. తెదేపా తరఫున సంచార వైద్యశాల కోసం ఒక ప్రత్యేక వాహనాన్ని కొనుగోలు చేయడానికి రూ.20 లక్షలు విరాళంగా అందించారు.
2014 ఎన్నికల్లోనూ డా.గొర్రెపాటి చిరకాల కోరిక నెరవేరలేదు. ఈ సమయంలోనే ఆయన తన ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేశారు. రాజకీయం అంటే అమెరికాలో లాగానే ఆంధ్రాలో కూడా నిఖార్సుగా ఉంటుందని నవనీతకృష్ణ భావించారు. అయితే నిర్మొహమాటంగా, నీతినిజాయతీగా ఉండే తనలాంటి వాళ్లకు ఈ రాజకీయాలు సరిపడవని నవనీత చాలా ఆలస్యంగా గ్రహించారు. ఈలోపుగానే ఆయన ఆరోగ్యపరంగా చాలా దెబ్బతిన్నారు. వాస్తవానికి ఆయన తెలుగు రాజకీయాల్లో అడుగుపెట్టకుండా ఉంటే మరి కొంతకాలం మనమధ్య ఉండేవారు. ఎంతోమంది గుండెజబ్బులు ఉన్నవారికి ప్రాణాలు నిలిపి ఆరోగ్య సేవలు అందించిన డా.గొర్రెపాటి తన ఆరోగ్యం విషయంలో కొంత అలసత్వాన్ని ప్రదర్శించారు.
డా.నవనీతకృష్ణ వంటి వ్యక్తులు నేటి సమాజానికి చాలా చాలా చాలా అవసరం. వ్యక్తిగతంగా, సంస్థలపరంగా, పలువురు రాజకీయ నాయకులకు ఆయన అడగిందే తడవుగా కోట్లాది రూపాయలు విరాళాలు అందించారు. కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం డా. నవనీతకృష్ణకు అలవాటు. కల్లాకపటం కల్మషంలేని డా.నవనీతకృష్ణ జీవితం అమెరికాలో ఉంటున్న నేటి తెలుగు యువతరానికి తప్పనిసరిగా ఆదర్శం.
తానా అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు ఎనలేనివి. తానా అభివృద్ధి కోసం సొంత సొమ్ములు విరివిగా ఖర్చుచేశారు. 2005లో డా.నవనీతకృష్ణ సారథ్యంలో డెట్రాయిట్‌లో జరిగిన తానా మహాసభలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తానా ఆధ్వర్యంలో అమెరికాలో ఉన్న పేద విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌లు అందించే పథకానికి ఆయనే రూపకల్పన చేశారు. డా.నవనీతకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని TNI ప్రగాఢంగా కోరుకుంటోంది. ప్రొఫెసర్.మూల్పురి వెంకట్రావు వంటి నవనీతకృష్ణ సహచరులు ఆయన విగ్రహాన్ని ఇటు ఘంటసాలలోనూ అటు డాలస్‌లోనూ ఏర్పాటు చేయటానికి చొరవ చూపాలి. తానా కార్యవర్గం కూడా దీనికి చొరవ చూపాలి.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.