Sports

అతను హక్కులు సంపాదించుకున్నాడు

Dhoni earned the right to decide on his retirement-Ravi Shastry

భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ భవితవ్యం గురించి చర్చించే వారిపై టీమ్ఇండియా కోచ్‌ రవిశాస్త్రి మండిపడ్డాడు. ధోనీ రిటైర్మెంట్‌పై మాట్లాడే వారిలో సగం మందికి షూలేస్‌ కూడా కట్టుకోవడం రాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘టీమ్‌ ఇండియాకు ధోనీ 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. క్రికెట్‌ నుంచి ఎప్పుడు వైదొలగాలో అతడికి తెలుసు. టెస్టులకు గుడ్‌బై పలికినప్పుడు అతడు ఏమి చెప్పాడు? జట్టుకు అతడు నీడలాంటి వాడు. టీమ్‌ ఇండియాను విజయపథంలో నడిపించడానికి అతడి ఆలోచనలను జట్టుతో పంచుకుంటాడు. ధోనీ రిటైర్మెంట్‌పై వ్యాఖ్యలు చేయడమంటే అతడిని అగౌరవపరిచినట్లే. ధోనీ భవితవ్యంపై మాట్లాడే వారిలో సగం మందికి షూలేస్‌ కట్టుకోవడం కూడా రాదు. అతడు క్రికెట్‌కు గుడ్‌బై పలకాలని వారు ఎందుకు తహతహలాడుతున్నారు? చర్చించడానికి వేరే విషయాలు లేక అతడి గురించి చర్చిస్తున్నారా? అతడు భవిష్యత్తులో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అందరికీ తెలుసు. సమయం వచ్చినప్పుడు అతడే నిర్ణయం తీసుకొంటాడు. మీ చర్చలకు ముగింపు పలుకుతాడు. ధోనీ తనకు నచ్చినప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటించే హక్కుని సంపాదించుకున్నాడు’ అని తెలిపాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ నిష్క్రమించిన తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ఇచ్చాడు. భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. తాజాగా బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీ లేడు. అయితే, ధోనీ తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ అందుకోవడానికి ఝార్ఖండ్‌ అండర్‌-23 జట్టుతో కలిసి అతడు సాధన చేసే అవకాశముంది.