*తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీలో టీడీపీ నేతలు అధికార వైసీపీ తీరుతో ఇబ్బంది పడుతున్నామని లబోదిబో అంటున్నతరుణంలో ఊహించని విధంగా హైకోర్టు ఇచ్చిన నోటీసులు టీడీపీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఒక్క గల్లా జయదేవ్ కు మాత్రమే కాదు జయదేవ్‌తో పాటు ఎమ్మెల్యేలు రామానాయుడు, గద్దె రామ్మోహన్ రావులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో భాగంగా న్యాయస్థానం అతనికి నోటీజులు జారీ చేసింది.హైకోర్టులో వేర్వేరుగా దాఖలైన మూడు ఎన్నికల పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మరో టీడీపీ నేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు నోటీసులు జారీ చేసింది. గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గుంటూరులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదంటూ గతంలోనే వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డిపై గల్లా కేవలం 4200 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా జయదేవ్ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేశారని వైసిపి వర్గాలు అప్పట్లోనే ఆరోపణలు గుప్పించాయి. అక్కడ పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో 9 వేల బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రెజెక్ట్ చేశారు.
* చౌతాలా నన్ను మోసం చేశారు: తేజ్ బహదూర్
జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా తనను మోసం చేశారని ఆ పార్టీ అభ్యర్థి, భారత ఆర్మీ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. బీజేపీతో జట్టుకట్టి హరియాణా ప్రజల తీర్పును దుష్యంత్ అపహాస్యం చేశారని విమర్శించారు. బీజేపీకి జేజేపీ బీ- టీమ్‌లా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని అన్నారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 సీట్లు గెలుచుకుని స్థానిక జేజేపీ హరియాణా కింగ్‌మేకర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దుతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ- కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేశాయి.
* రేపు ఖట్టర్ ప్రమాణస్వీకారం..!
హరియాణా ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఖట్టర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భాజపా వర్గాలు తాజాగా వెల్లడించాయి. మరోవైపు భాజపా శాసనసభాపక్షం నేడు భేటీ అయి ఖట్టర్‌ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
* మంత్రి ఇల్లు ముట్టడి
జనసేన నేతలు, భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. తమకు ఉపాధి కల్పించాలని, ఇసుకను అందుబాటులోకి తేవాలని భవన నిర్మాణ కార్మికులు అవంతి ఇంటి వద్ద నినాదాలు చేశారు. మంత్రికి తమ కష్టాలను కార్మికులు వివరించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ… ఇసుక మీద కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రాజకీయాల లబ్దికి వాడుకుంటున్నారన్నారు. త్వరలో ఇసుకను అందుబాటులోకి తెస్తామని వారికి హామీ ఇచ్చారు
*బొత్సను నిలదీసిన కార్మికులు
గుంటూరు నగరంలో మంత్రి బొత్స సత్యనారాయణను భవన నిర్మాణ కార్మికులు నిలదీశారు. ఇసుక కొరత కారణంగా పని దొరకట్లేదని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు.
మంత్రి బొత్స గుంటూరు నగరంలో ఈ ఉదయం పర్యటించారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు పరిశీలించారు. డ్రైనేజీ పనులు అగిపోవడంపై అధికారులను ఆరాదీశారు. అలాగే నగరంలో దెబ్బతిన్న రహాదారులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘మూడేళ్ల క్రితం భూగర్భ డ్రైనేజీ పనులు మొదలయ్యాయి. పనులు సక్రమంగా జరగలేదు. పద్ధతి లేకుండా పనులు చేయటం వల్లే నగరంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయి. రాష్ట్రంలోని ముఖ్య నగరంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.’ అని బొత్స పేర్కొన్నా
* బొటనవేలు దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటాం: తమ్మినేని
ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం ముషీరాబాద్, వెలుగు: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలు గురుదక్షిణగా తీసుకున్నట్లు కుట్రపూరితంగా రంగారావు వేలు కేసీఆర్ తీసుకున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం మండిపడ్డారు . బొటనవేలు దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటా మన్నారు . ముఖ్యమంత్రి మాట్లాడిన తీరును నిరసిస్తూ శుక్రవారం ముషీరాబాద్ సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో తమ్మి నేని వీరభద్రం ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
*అవినీతిలో దొందూదొందే: సుజనాచౌదరి
కుటుంబపాలన సాగిస్తూ అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు, వైఎస్ కుటుంబాలకు ఏమాత్రం తేడా లేదని భాజపా ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. ఒంగోలు, గుంటూరుల్లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు లోగడ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారదర్శక పాలనే సాగిందని.. మలి విడతలో మాత్రం వై.ఎస్.రాజశేఖర్రెడ్డి మాదిరి కుటుంబపాలన, అవినీతి చోటు చేసుకుందని విమర్శించారు. అందుకే తెదేపాను వీడాల్సి వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు నేరుగా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడితే స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. జాతీయపార్టీగా దీనిపై ఇప్పుడే స్పందించబోమని వెల్లడించారు.
*5 నెలల్లో జగన్ చేసింది శూన్యం: యనమల
ఐదు నెలల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ చేసింది శూన్యమని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. లాయర్లకు కనీసం కప్పు టీ కూడా దొరకడం లేదని హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. రాజధానిపై వైకాపా నిర్లక్ష్య వైఖరికి హైకోర్టు వ్యాఖ్యలు చెంపదెబ్బని శుక్రవారం విమర్శించారు. ‘కేంద్ర హోంమంత్రి అమిత్షా, సీఎం జగన్ మధ్య చర్చలు జరగలేదని భాజపా నేతలే చెప్పారు. మరి జరిగినట్లుగా సీఎం పేరుతో ప్రభుత్వం ఎలా ప్రకటన ఇస్తుంది? దీన్నిబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో డొల్లతనం తెలుస్తోంది’ అని విమర్శించారు.
*వైకాపాలోకి తెదేపా ఎమ్మెల్యే వంశీ?
ఉదయమంతా భాజపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో తిరిగారు.. సాయంత్రం అయ్యేసరికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సెల్ఫోన్ ఆపేశారు. దాంతో.. తెదేపాకు చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇక వైకాపాలో చేరిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. వంశీ మాత్రం పార్టీ మారే విషయాన్ని నేరుగా ప్రకటించలేదు. గత కొన్నిరోజులుగా ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో ఉన్న తన ఆస్తుల విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని వంశీ తన సన్నిహితులతో తరచు చెప్పేవారు. రాష్ట్ర మంత్రి కొడాలి నానితో సాన్నిహిత్యం ఉండటంతో.. వైకాపాలోకి రావాలని ఆయన పలు సందర్భాల్లో ఆహ్వానించారు.
*మండలి చీఫ్విప్గా బాధ్యతలు చేపట్టిన భానుప్రసాద్రావు
శాసనమండలి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో శుక్రవారం భానుప్రసాద్రావు పూజలు నిర్వహించి మండలి చీఫ్విప్గా బాధ్యతలు చేపట్టారు. మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, ఏపీ మంత్రి కొడాలి నాని, కార్పొరేషన్ల ఛైర్మన్లు కోలేటి దామోదర్, ఈద శంకర్రెడ్డి, రాకేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
*సిమెంట్ సంస్థలతో జగన్ కుమ్మక్కు: చినరాజప్ప
‘ముఖ్యమంత్రి జగన్ సిమెంట్ సంస్థలతో కుమ్మక్కై ఇసుక విధానంలో తీవ్ర జాప్యం చేశారు. దీంతో పనులు దొరక్క లక్షలాది మంది కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది’.. అని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
*ధర్మపోరాట దీక్ష ఖర్చెంతో నిరూపిస్తా: వర్ల
జగన్ ప్రభుత్వంలోని మంత్రులు నోటికొచ్చినట్లు అసత్యాలు మాట్లాడుతున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ‘దిల్లీలో చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు రూ.10 కోట్లు ఖర్చు పెట్టారని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. దాన్ని ఆయన నిరూపించాలి. దిల్లీలో చేసిన దీక్షకు ఖర్చు పెట్టింది రూ.1.6కోట్లు మాత్రమే. సోమవారం సచివాలయానికి వస్తా. ఎంత ఖర్చు పెట్టామో తేలుద్దాం రండి. దీనికి సిద్ధమేనా?’..అని వర్ల సవాల్ విసిరారు. సీఎం జగన్ ఇంట్లో బాత్రూంలకు రూ.48 లక్షలు ఖర్చు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు పెట్టినట్లు సొంత భవనాలకు ఎలా ఖర్చు పెడతారు’..అని ప్రశ్నించారు.
*నల్లబజారులోనే ఇసుక లభ్యం-భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
రాష్ట్రంలో ప్రజలకు ఇసుక నల్లబజారులోనే దొరుకుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ సమస్య ఏర్పడడానికి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమన్నారు. నెల్లూరు భాజపా కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇసుక కొరత వల్ల నష్టపోతున్న భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10 వేలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పోలవరం పనుల ఆలస్యం, రీటెండరింగ్పై రాష్ట్ర ప్రభుత్వ నివేదికను అనుసరించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపానే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు.
*ఝార్ఖండ్లో భాజపా గూటికి ఐదుగురు విపక్ష ఎమ్మెల్యేలు
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్లో బుధవారం ఐదుగురు విపక్ష శాసనసభ్యులు భాజపాలో చేరారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు జేఎంఎంకు చెందిన వారు కాగా మరొకరు స్వతంత్ర ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి రఘువర్దాస్ సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 81 మంది సభ్యులున్న శాసనసభలో వీరి చేరికతో.. భాజపా బలం 48కి పెరిగింది. ఝార్ఖండ్ మాజీ డీజీపీ డి.కె.పాండే, విశ్రాంత ఐఏఎస్ అధికారి సుచిత్రా సిన్హా కూడా కమలదళంలో చేరారు.
*హరీశ్ రావత్పై సీబీఐ కేసు
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్పైన, గతంలో ఆయన మంత్రివర్గంలో పనిచేసి, ప్రస్తుతం (భాజపా ప్రభుత్వంలో) మంత్రిగా ఉన్న హరక్సింగ్ రావత్పైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 2016లో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే సమయంలో.. ఎమ్మెల్యేల కొనుగోలుకు వారు చేసిన ప్రయత్నాలు ఓ న్యూస్ఛానెల్ వీడియో టేపుల్లో బయటపడినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు నిర్వహించింది
*డీకే శివకుమార్ విడుదల
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియరు నేత డీకే శివకుమార్ తిహార్ జైలు నుంచి బుధవారం రాత్రి విడుదలయ్యారు. రూ.25 లక్షల బాండుతో సహా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు, విదేశాలకు వెళ్లకుండా షరతులు విధిస్తూ దిల్లీ హైకోర్టు బుధవారం మధ్యాహ్నం ఆయనకు బెయిలు మంజూరు చేసింది. మరోవైపు ఈ బెయిలును సవాలు చేస్తూ ఈడీ అధికారులు గురువారం సుప్రీంకు వెళ్లాలని నిర్ణయించారు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకల అభియోగాలపై ఈడీ దాఖలు చేసిన కేసులో ఆయన 33 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది.తిహార్ జైలులో డీకే శివకుమార్ను బుధవారం ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పరామర్శించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు తదితరులు శివకుమార్కు బెయిలు రావడంపై ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
*నిర్బంధాలను ఎదుర్కొందాం ఐక్య సభలో వక్తల పిలుపు
తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని నిర్బంధ వ్యతిరేక సభ విమర్శించింది. వామపక్ష, విప్లవ పార్టీలు- ప్రజాసంఘాల రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ‘అక్రమ అరెస్టులు, అణచివేతలకు’ నిరసనగా హైదరాబాద్లోని సుందరయ్య కళానిలయంలో బుధవారం సదస్సు జరిగింది.రాష్ట్రంలో పోలీసులు ‘నిషేధ సంస్థలు’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. వారంవ్యవధిలో నాగరాజు, బలరాం, మద్దిలేటి, నలమాస కృష్ణ, జగన్, సురేష్, అనిల్ అనే ఏడుగురిని నిర్బంధించారన్నారు.
*ప్రభుత్వం కంటే మీరే నయం-ధర్మాడిని అభినందిస్తూ చంద్రబాబు లేఖ
గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటుని వెలికితీసిన ధర్మాడి సత్యంని అభినందిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం ఆయనకు లేఖ రాశారు. ‘‘బోటు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న మీ తపన, మునిగిపోయిన పడవను బయటకు తీయాలన్న పట్టుదల ప్రశంసనీయం. పడవను వెలికి తీసేందుకు మీరు చూపిన శ్రద్ధలో ఒక్క శాతమైనా ప్రభుత్వం కనబరిచి ఉంటే, బాధిత కుటుంబాలకు ఈ దురవస్థ వాటిల్లేది కాదు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే కచ్చులూరు పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలూ దొరకని దుస్థితి ఏర్పడింది. విపత్తులలో బాధితుల్ని వదిలేసి దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్లారు. మీరు జడివానలో బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు, భౌతికకాయాలను వారికి అప్పగించేందుకు పడిన తపనను తెదేపా మనస్ఫూర్తిగా అభినందిస్తోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
*జగన్ పాలనకు నూటికి 150 మార్కులు
‘ముఖ్యమంత్రి జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది. యువకుడు, ఉత్సాహవంతుడు.. కిందా మీదా పడుతున్నాడు.. లేస్తున్నాడు.. పరుగెడుతున్నాడు.. నేనైతే 100కి 150 మార్కులు వేస్తా’ అని మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుంటూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘చట్ట ప్రకారం ట్రావెల్స్ బస్సుల్లో ఓవర్లోడింగ్ చేయడం తప్పే. చిన్నచిన్న తప్పులను భూతద్దంలో చూస్తూ బస్సులను సీజ్ చేస్తున్నారు. అపరాధ రుసుం విధించి వదిలేయాల్సింది పోయి 3నెలలపాటు బస్సులను తిప్పొద్దంటూ రకరకాల కేసులు పెడుతున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు.
*ర్యాంకు తెదేపా వైఫల్యాలకు సూచిక
‘ఇండియా ఇన్నోవేటివ్ ఇండెక్స్’ అన్న అంశంపై నీతి ఆయోగ్ మొదటిసారి నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో నిలిస్తే వైకాపా ప్రభుత్వ నిర్వాకంవల్లే ర్యాంకుల్లో దిగజారిందని తెదేపా నేత యనమల వ్యాఖ్యానించడం దారుణమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సర్వే చేసిందే మొదటిసారి అయినప్పుడు, ఏపీ ర్యాంకు పడిపోవడంగానీ, పెరగడంగానీ ఎలా జరుగుతుందో యనమలకే తెలియాలి. 7 సూచీలు, 30 ఉపసూచీల ఆధారంగా నీతి ఆయోగ్ ఆ సర్వే చేసింది. వాటిలో ఏవీ ఈ 3 నెలలకు సంబంధించినవి కావు. ఏపీకి తక్కువ ర్యాంకు రావడానికి గత ప్రభుత్వ వైఫల్యాలే కారణం’ అని ఆయన వివరించారు. తెదేపా హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలేవీ రాలేదని నీతి ఆయోగ్ నివేదికే తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అప్పులతో అధికారాన్ని అప్పచెప్పినా, తాము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలందుకుంటున్నామని చెప్పారు.
తెదేపా ఎంపీ ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు-రాజకీయ-10/26
Related tags :