*బంగారం ధర మళ్ళీ పెరిగింది. పది గ్రాముల ధర 40,000దాటింది.
* సీఎం క్యాంప్ ఆఫీస్ కు పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నిరసనలు, సమ్మెలు, ముట్టడిలతో క్యాంప్ ఆఫీస్ వద్ద ఆందోళనలు జరుగుతున్నందున అధికారుల సూచనల మేరకు హై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్న ప్రహరీ గోడకు ఐరన్ గ్రిడ్స్( ఇనుప జాలి) ఏర్పాటు చేస్తున్నారు.
*దీపావళి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిలు, గవర్నర్లు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
* TV-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ బెయిల్‌పై విడుదలయ్యారు. డైరెక్టర్ల అనుమతి లేకుండానే నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి…కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసిన కేసులో రవిప్రకాశ్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ (శనివారం) ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.
* తెలుగు అసోసియేషన్ ఆఫ్ మేరీల్యాండ్ అధ్యక్షుడు యారమల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కళ్ళ జోళ్ళను సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసు చేతుల మీదగా పంపిణీ చేశారు.
* టెస్టు మ్యాచ్‌ల కోసం భారత్‌లో ఐదు శాశ్వత వేదికలను ఎంపిక చేస్తే సరిపోతుందన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యలతో మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఏకీభవించాడు. టెస్టు క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలంటే వేదికల్ని సాధ్యమైనంతంగా తగ్గించడమే ఉత్తమం అని కుంబ్లే అభిప్రాయడ్డాడు.
* చర్చలకు రావాలని ఆర్టీసీ ఐకాసకు యాజమాన్యం లేఖ రాసింది. ఐకాస నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి, వీఎస్ రావు, వాసుదేవరావులకు ఆర్టీసీt ఈడీ వెంకటేశ్వరరావు లేఖలు పంపారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రమంజిల్‌లోని ఈఎన్సీ కార్యాలయంలో ఐకాస నేతలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరపనుంది.
* ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ నడుస్తున్న పలు మార్గాల్లో రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
* శాంతి, మతసామరస్యానికిచ నవ సమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శం కావాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా దీపావళి నిలుస్తోందన్నారు. దీపావళిని ప్రజలంతా రంగురంగుల దీపాలను వెలిగించి జరుపుకోవాలన్నారు
* అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం వచ్చే 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 12 గంటల్లో తుపానుగా మారుతుందని, ఆపై అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
* కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత వీఎస్ అచ్యుతానందన్ నిన్న సాయంత్రం ఆసుపత్రిలో చేరారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అచ్యుతానందన్ గత ఆదివారమే 96వ పడిలోకి ప్రవేశించారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆసుపత్రికి వెళ్లి అచ్యుతానందన్‌ను పరామర్శించారు. ఏడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన అచ్యుతానందన్ ప్రస్తుతం పాలక్కడ్ జిల్లాలోని మల్లంపూజా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2006-2011 మధ్య కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు
*అరేబియా సముద్రంలోని ఒమన్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారడంతో వచ్చే ఐదురోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని కేంద్ర వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
*రత్నగిరికి పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుపాన్ ముప్పు ముంచుకు వస్తోంది.
*అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి ఒమన్ నుంచి భారతదేశం దిశగా పయనిస్తోంది. ఒమన్ తీరంలో ఏర్పడిన తుపానుకు ‘క్యార్రా’ అని నామకరణం చేశారు. ‘క్యార్రా’ తుపాన్ ముంబైకు దక్షిణాన 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
*భూఆక్రమణలపై విచారణకు శనివారం సిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నది. వచ్చే నెల ఒకటి నుంచి ఏడు వరకు ప్రజలు, బాధితుల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
*కృష్ణానదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 5.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడి నుంచి తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా 42 వేల క్యూసెక్కులు, ఏపీ విద్యుత్తు కేంద్రం ద్వారా 25 వేల క్యూసెక్కులతోపాటు పదిగేట్ల ద్వారా 4.73 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
*దక్షిణ మధ్య రైల్వేలో ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిస్షిప్లో స్థానిక నిబంధనలు పాటించకపోవడం వల్ల తెలంగాణ యువత అన్యాయానికి గురవుతోందని, ఉద్యోగావకాశాలను కోల్పోతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు.
*షెడ్యూల్డ్ ప్రాంతాలు, గిరిజనుల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తున్నా.. తెలుగురాష్ట్రాల్లో అనుకున్నమేర అభివృద్ధి జరగలేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి, ఆదివాసీ సంఘం జాతీయ నేత ఫగ్గన్సింగ్ కులస్తే అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో శుక్రవారం జరిగిన గాంధీ సంకల్పయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు.
*కార్మికులకు బోనస్ కింద రూ.258 కోట్లను శుక్రవారం చెల్లించినట్లు సింగరేణి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.64,700 వంతున ఇచ్చారు. ఇది కాకుండా ఇటీవల సీఎం కేసీఆర్ సంస్థ లాభాల్లో 28 శాతం సొమ్మును బోనస్గా ప్రకటించారు.
*డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని అనుబంధ ఆసుపత్రుల్లోనూ కొన్నిరకాల సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు పొందేందుకు వీలు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయనుంది.
*జోన్ పరిధిలో రైళ్ల రాకపోకల సమయపాలన మెరుగుపడిందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 82 శాతంగా నమోదైంది.
*తెలంగాణలో భారీ సంఖ్యలో డీఎస్పీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 68 మందికి స్థాన చలనం కలిగిస్తూ డీజీపీ ఎం.మహేందర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలంగా డీఎస్పీలు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఉప ఎన్నికల కోడ్ ముగిసిన క్రమంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు.
*నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థలు- బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను విలీనం చేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. వీటిని విక్రయించడం, ప్రైవేటీకరించడం, తృతీయ పక్షానికి అప్పగించడం వంటివి ఉండబోవని స్పష్టంచేసింది.
*తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా గజ్వేల్ తెరాస నేత వంటేరు ప్రతాప్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు
*ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తుండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి నిరాటంకంగా ప్రవాహం కొనసాగుతోంది. మూడునెలల్లో రెండు రోజులు మినహా మిగిలిన అన్ని రోజులు శ్రీశైలంలోకి ప్రవాహం ఉంటే, నాగార్జునసాగర్లోకి ఒక్క రోజు కూడా ఆగలేదు. ప్రస్తుతం ఆలమట్టి, తుంగభద్రల నుంచి భారీగా నీటి విడుదల కొనసాగుతుండటంతో మరికొన్ని రోజులు శ్రీశైలం, నాగార్జునసాగర్లు పూర్తి స్థాయి నీటిమట్టాలతో నిండుకుండల్లా తొణికిసలాడనున్నాయి.
*ఖనిజ సంపద వెలికితీతతో దేశ సమగ్రాభివృద్ద్ధి సాధ్యమవుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ‘మైనింగ్.. ప్రస్తుత – భవిష్యత్తు పెట్టుబడులు, సమస్యలు-సవాళ్లు’ అనే అంశంపై ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో రెండ్రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది.
*రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఒప్పంద ప్రాతిపదికన ఆయనను పునర్నియామకం చేసి, పౌరసరఫరాల కమిషనర్గా నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*సింగరేణి కార్మికులకు ఈ నెల 25న బోనస్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ ఉద్యోగులకు ప్రతిభ ఆధారిత ప్రయోజనం (పీఎల్ఆర్) బోనస్ను ఏటా దీపావళికి పది రోజుల ముందే చెల్లిస్తారు. పండుగ సమీపిస్తుండటం, చెల్లింపు తేదీ ఖరారు కాకపోవడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఒక దశలో వచ్చే నెలలో పంపిణీ చేస్తామన్న సంకేతాలు రావడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. గతేడాది రూ.60,500 చొప్పున చెల్లించగా ఈసారి దాన్ని రూ.64,700కు పెంచుతూ గత నెలలో జాతీయ కార్మిక సంఘాలు చేసుకున్న ఒప్పందంలో నిర్ణయం తీసుకున్నారు.
*రాష్ట్రంలోని 25 మంది కలెక్టర్లు సహా 30 మంది ఐఏఎస్ అధికారులు రెడ్క్రాస్ సేవా పురస్కారాలకు ఎంపికయ్యారు. గురువారం రాజ్భవన్లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు
*రాష్ట్రంలో 29 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా పద్ధతిలో గురువారం లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నారు. ఒక్కో షాపుకి 5 కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో.. ఈ నెల 18న ఎంపిక ప్రక్రియ నుంచి వీటిని మినహాయించారు.
*దిగువ కోర్టుల్లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హైకోర్టు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు నవంబరు 4 నుంచి 7 వరకు నిర్వహిస్తామని, ఇప్పటికే హాల్టికెట్లను వెబ్సైట్లో ఉంచామని అందులో పేర్కొన్నారు.
కేసీఆర్ ఇంటికి భారీ భద్రత-తాజావార్తలు-10/26
Related tags :