నారింజ కంటే పెద్ద పరిమాణంలో కనిపించే దబ్బపండుతో పచ్చడి చేసుకుంటారని తెలుసు. పులిహోర చేసేటప్పుడు ఎక్కువగానే ఉపయోగిస్తారు. నిజానికి నారింజ, నిమ్మ, పంపర పనసల్లోని గుణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నదే దబ్బపండు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దబ్బపండులోని 100 గ్రా. గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ. ఈ పీచు క్యాన్సర్కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ తగ్గేందుకూ సహకరిస్తుంది. 100 గ్రా. తాజా పండులో 135 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. గుండె వేగాన్ని నియంత్రించడానికి, రక్తపోటు అదుపుకూ ఇది ఎంతో ఉపయోగం. దబ్బపండులో విటమిన్-ఎ సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. లైకోపిన్, బీటా కెరోటిన్, క్సాంథిన్, ల్యూటిన్… వంటి ఫ్లేవొనాయిడ్లూ ఇందులో ఎక్కువే. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్-సి కూడా పుష్కలంగా ఉంటుంది. సహజమైన ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలతోపాటు కొద్దిపాళ్లలో బి-కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. ఇది ఊబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు నిర్ధారించారు.ఇది సహజమైన క్లెన్సర్ కూడా. దీని గుజ్జుని చర్మం మీద నెమ్మదిగా రుద్దితే మృతకణాలన్నీ తొలగి, నిగారింపుని తీసుకొస్తుంది. అయితే దీన్ని భోజనం తరవాతే తీసుకోవాలిగానీ పరగడుపున తీసుకోకూడదు. అందులోనూ నిత్యం మందులు వాడేవాళ్లు వాటితో కలిపి తీసుకోకూడదనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఎలాంటి సిట్రస్ పండయినా భోజనానికి భోజనానికీ మధ్యలో తీసుకోవడమే మంచిది!
దబ్బపండుతో రోగాలకు దిబ్బిడి దిబ్బిడే

Related tags :