Politics

పక్క రాష్ట్రాల్లో చికిత్సకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు-జగన్ సర్కార్ నిర్ణయం

aarogyasri now applies to treatments done in bangalore, hyderabad, chennai-YSR Aarogyasri Now Applies To Treatments Done In Other States As Well-పక్క రాష్ట్రాల్లో చికిత్సకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు-జగన్ సర్కార్ నిర్ణయం

ఆరోగ్య రంగంలో నాలుగు కీలక జీవోల విడుదల

ఎన్నికల హామీల అమల్లో ముఖ్యమంత్రి జగన్‌ మరో అడుగు ముందుకేశారు. నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రభుత్వం నాలుగు కీలక ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్లు చేయించుకుంటున్నవారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం డిసెంబర్‌ 1 అందుతుందని, అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి రూ.10వేలు, 5వేలు పెన్షన్లు జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ జాబితాలో ఉన్న వ్యాధులను ప్రకటించింది. అలాగే ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతం రూ. 16వేలకు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి ఈ పెంపుఅమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు– నవంబర్‌ 1 నుంచి అమలు:

పెద్దపెద్ద ఆపరేషన్లుకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తే.. ఆరోగ్య శ్రీ వర్తించడంలేదంటూ పాదయాత్ర సందర్బంగా శ్రీ జగన్‌ దృష్టికి చాలామంది తీసుకు వచ్చారు. అనేకమంది తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ పరిస్థితిని నివారిస్తూ బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వైద్యంకోసం వెళ్తున్నవారికి ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తామంటూ శ్రీజగన్‌ హామీ ఇస్తూ ఎన్నికల ప్రణాళికలో భాగంగా నవరత్నాల్లో వీటిని పొందుపరిచారు. దీన్ని అమల్లోకి తీసుకు వస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరో జీవోను విడుదలచేసింది. ఆరోగ్య రంగంలో సంస్కరణలకోసం నియమించిన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు 17 సూపర్‌ స్పెషాల్టీ విభాగాల్లో 716 వైద్యప్రక్రియలు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఆస్పత్రుల్లో చేయించుకుంటే ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ఆస్పత్రులను గుర్తించిన ఆరోగ్యశ్రీ అధికారులు, ఆయా ఆస్పత్రుల్లో వైద్యసేవల నాణ్యతను కూడా నిర్ధారించే పనిలో ఉన్నారు. వచ్చే నెల నవంబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

కార్డియాక్‌ అండ్‌ కార్డియో థెరపీలో 122 ప్రక్రియలు, కార్డియాలజీలో 10, క్రిటికల్‌కేర్‌లో 8, ఎండో క్రోనాలజీలో 13, గ్యాస్ట్రో ఎంటరాలజీలో 22, జెనిటో యూరినరీ సర్జరీస్‌లో 64, మెడికల్‌ ఆంకాలజీలో 79, నెఫ్రాలజీలో 6, న్యూరాలజీలో 12, న్యూరోసర్జరీలో 69, అవయవాల మార్పిడి చికిత్సల్లో 3, పీడియాట్రిక్‌ సర్జరీలో 66, ప్లాస్టిక్‌ సర్జరీలో 35, రేడియేషన్‌ ఆంకాలజీలో 13, రెముటాలజీలో 6, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో 57, సర్జికల్‌ ఆంకాలజీలో 131 మొత్తంగా 17 సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో 716 వైద్య ప్రక్రియలు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైల్లో చేయించుకుంటే వర్తిస్తుంది.

వైద్యసేవలకోసం ఈప్రాంతాలకు వెళ్లే రోగులకు వైద్య సేవలు అందించడానికి 71 ఆరోగ్య మిత్ర, 3 ఆఫీస్‌ అసోసియేట్స్‌కు, 3 డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్లను అవుట్‌సోర్సింగ్‌ లేదా డిప్యుటేషన్‌ మీద నియమించుకోవడానికి వైయస్సార్‌ ఆరోగ్య హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్లు చేయించుకుంటున్నవారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం– డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి:

ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్లు చేయించుకున్న వారికీ ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ పాదయాత్రలో హామీఇచ్చారు. దీంట్లో భాగంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది. ఆరోగ్య శ్రీ కింద నాణ్యమైన సేవలు అందంచడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆపరేషన్లు చేయించుకుని తిరిగి కోలుకునేంతవరకూ ఈఆర్థిక సహాయం అందుతుంది. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225, లేదా నెలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే డిసెంబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10వేలు, రూ.5వేలు పెన్షన్లు మంజూరు – జనవరి 1 నుంచి అమలు.

పాదయాత్రలో భాగంగా తీవ్ర రోగాలతో సతమతమవుతున్న వారికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రభుత్వం రూ.10వేల చొప్పున ప్రభుత్వం ప్రతినెలా పెన్షన్‌ మంజూరు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా
తీవ్ర కిడ్నీ వ్యాధి అడ్వాంటేజ్‌ స్టేజ్‌లో ఉన్నవారికి కూడా పెన్షన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ హామీ ఇచ్చారు. దీన్నికూడా నెరవేరుస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో జారీచేసింది. తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, తీవ్ర హీమోఫీలియాతో బాధపడుతున్నవారికి రూ.10వేల పెన్షన్‌ మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతోపాటు తీవ్ర బోదకాలు వ్యాధితో బాధపడుతున్నవారికి, తీవ్ర పక్షవాతంలో చక్రాల కుర్చీకి లేదా మంచానికి పరిమితమైనవారికి, తీవ్ర కండరాల క్షీణతతో కదల్లేని పరిస్థితిలో ఉన్నవారికి, ప్రమాదాల బారినపడి, శరీరం సహకరించని స్థితిలో చక్రాల కుర్చీకి లేదా, మంచానికి పరిమితమైనవారికి నెలకు రూ.5వేల చొప్పున పెన్షన్‌ మంజూరుచేశారు.

అలాగే డయాలసిస్‌ చేయించుకోకుండా తీవ్ర కిడ్నీవ్యాధి అడ్వాంటేజ్‌ స్టేజిలో ఉన్నవారికి అంటే స్టేజ్‌ 3,4,5 పరిస్థితిని ఎదుర్కొంటున్నవారికి నెలకు రూ.5వేల చొప్పున పెన్షన్‌ ఇవ్వనున్నారు. స్థానిక ప్రభుత్వ మెడికల్‌కళాశాల ధృవీకరణ దీనికి సరిపోతుంది.

ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతం రూ. 16వేలకు పెంపు– జనవరి 1, 2020 నుంచి అమల్లోకి:

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం భారీగా జీతాలు పెంచింది. ఏలూరులో మెడికల్‌కాలేజీకి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు పారిశుద్ధ్య కార్మికులు తమ ఆవేదనను వ్యక్తంచేశారు. ఆస్పత్రుల్లో సేవలు నాణ్యంగా ఉండాలంటే పారిశుధ్యం బాగుండాలని, కాని, పనిచేస్తున్న కార్మికులకు అరకొరగా జీతాలు ఇస్తున్నామని, వారు చేస్తున్న పనులు ఎవ్వరూ చేయలేనివని సీఎం శ్రీ జగన్‌ ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించారు. వారిజీతాలను పెంచాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వారి జీతాలను రూ.16వేలకు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ జీవో జారీచేసింది. ప్రభుత్వ ప్రాథిమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అందరికీ జీతాల పెంపు వర్తిస్తుంది. 2020 జనవరి 1 నుంచి ఈపెంపు అమల్లోకి వస్తుంది.