* ఘననివాళి అర్పించిన ప్రవాసులు
* అమెరికా నలుమూలల నుండి అశేషంగా తరలివచ్చిన స్నేహితులు
* నవనీత ఉగాది పచ్చడి లాంటివారని కొనియాడిన వక్తలు
* సార్థక నామధేయుడని ప్రస్తుతించిన ఆత్మీయులు
కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన ప్రవాసాంధ్రులు, ప్రముఖ వైద్యులు, తానా మాజీ అధ్యక్షులు డా.గొర్రెపాటి నవనీతకృష్ణ అంత్యక్రియలు ఆదివారం సాయంకాలం అలెన్‌లోని టరెంటీన్ జాక్సన్ మరో ఫ్యునెరల్ హోంలో అశేష జనవాహిని నడుమ ఘనంగా నిర్వహించారు. అమెరికా నలుమూలల నుండి నవనీతకృష్ణ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, సహచరులు, ఘంటసాల మిత్రులు భారీసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన జీవిత విశేషాలను నెమర వేసుకుని ఘనవీడ్కోలు పలికారు. డా.తోటకూర ప్రసాద్ వ్యాఖ్యానంలో సాగిన ఈ కార్యక్రమంలో తొలుత నవనీత సోదరులు రంగనాథబాబు, పట్వర్ధన్‌బాబు, సురేంద్రలు మాట్లాడారు. ఆయనను ఆదివారం ఆసుపత్రిలో జేర్పించిన అనంతరం తిరిగి కోలుకున్నారని, మంగళవారం ఇంటికి తీసుకొచ్చామని, గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తామంతా అండగా నిలబడతామన్నారు. అనంతరం తానా మాజీ అధ్యక్షులు డా.బండ్ల హనుమయ్య, కాకరాల ప్రభాకర చౌదరి, పద్మశ్రీ ముత్యాల, నాదెళ్ల గంగాధర్, నన్నపనేని మోహన్‌లు మాట్లాడుతూ బ్యాక్‌ప్యాక్ కార్యక్రమంతో పాటు తానా ఆధ్వర్యంలో ఎలాంటి సేవా కార్యక్రమానికైనా నవనీత ముందుకొచ్చేవారని, మాతృభూమి పట్ల ఆయన మమకారం అమూల్యమైనదని అన్నారు.
నవనీతకృష్న స్వగ్రామనికే చెందిన మరో ప్రవాసాంధ్ర ప్రముఖులు డా.మూల్పూరి వెంకటరావు మాట్లాడుతూ….తాను నవనీతకృష్ణను బాల్యం నుండి ఎరుగుదునని, ఒక పనిలో లేదా కార్యక్రమంలో సేవాతత్పరత, మంచిదనం ఉంటే దాన్ని ఎంత కష్టమైనా వదలకుండా ధృడచిత్తంతో పూర్తి చేసేదాకా నిద్రపోని పసిమనస్కుడు నవనీతకృష్ణ అని అన్నారు. ఆయన ఉగాది పచ్చడి లాంటి వారని…అన్ని రుచుల కలయిక ఉగాది లాగా అన్ని సద్గుణాల కలయిక నవనీత అని పేర్కొన్నారు. డా.ముక్కామల అప్పారావు మాట్లాడుతూ అమరావతిలో ఆసుపత్రి వ్యవహారాలపై తాము ఇరువురము చాలా సార్లు చర్చించుకున్నామని, అది పెద్ద తలకాయనొప్పి వ్యవహారమని ఈ వయస్సులో అది వద్దని చెప్పినా వినకుండా సేవా లక్ష్యంతో ఏర్పాటు చేసే ఈ ఆసుపత్రి ప్రారంభించి తీరాల్సిందేనని ఆశించారని, ఇప్పుడు అది నిజమవుతున్నప్పటికీ దాన్ని చూసి ఆనందించడానికి నవనీత లేకపోవడం బాధాకరమని వాపోయారు. నవనీత మిత్రులు డా.ఆత్మచరణ్‌రెడ్డి ఆయనతో తనకున్న సరదా సంగతులను సభికులతో పంచుకున్నారు. కోనేరు ఆంజనేయులు, విజయభాస్కర్, తాతినేని రామ్, రాజేశ్వరి, కరుణ తదితరులు నవనీతతో తమ అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రవాసులు వెన్నం మురళీ, పోలవరపు శ్రీకాంత్, యలమంచిలి రామ్, కంచర్ల కిషోర్, అన్నే విజయశేఖర్, కొండ్రుకుంట చలపతి తదితరులు పాల్గొన్నారు.
పేరుకు తగ్గట్టుగానే నవనీతకృష్ణ వెన్న వంటి మనస్కులు, చిరు దరహాసం, మందహాసభరితమైన మోము, ధృడసంకల్పం, నిత్య నవీనత కోసం ఆరాటం, ఆప్యాయత, అనురాగం, నిర్మొహమాటం, కల్మషరహితం వంటి ఎన్నో సద్గుణాలు కలిగిన డాక్టర్ గారు ఓ మానసిక వైద్యుడి కన్నా ఎక్కువగా, మనువు, తనువు ఎరిగిన మనస్సున ఓ గొప్పమనిషిగా సార్థకనామధేయులుగా చరిత్రలో కలిసిపోయారు. అందులో చిరంతనంగా మిగిలిపోతారు. ఇదే TNI ఆయనకు అందిస్తున్న అశృనివాళి.