DailyDose

కేంద్రం నుండి ఆమ్రపాలికి పిలుపు-తాజావార్తలు-10/28

IAS Amrapali Returns Back To Central Govt-Telugu Breaking News-10/28

* రానున్న 40 రోజుల్లో రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు వరద నీటితో నిండాలని.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రతిపాదనలతో పూర్తి నివేదిక అందివ్వాలని సూచించారు. నిధుల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రాధాన్యతల పరంగా ఖర్చు చేయాలని.. చేసిన ఖర్చుకు ఫలితాలు వచ్చేలా ఉండాలని సీఎం ఆదేశించారు.

* ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసమేతంగా హాజరైన సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. చినజీయర్‌ స్వామితో తనకు ఏర్పడిన పరిచయం సహా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందన్నారు. ఫిబ్రవరిలో ప్రధాన ఆలయాన్ని ప్రారంభించాలని చినజీయర్‌ స్వామి చెప్పారని తెలిపారు. యాదాద్రిలో 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని వెల్లడించారు.

* ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం డిమాండ్‌ చేస్తూనే ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ భాజపాపై శివసేన పరోక్షంగా బెదిరింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు స్పందించారు. మహారాష్ట్రలో ఏర్పడేది భాజపా నేతృత్వంలోని ప్రభుత్వమే అని ధీమా వ్యక్తంచేశారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరలించిందని జీవీఎల్‌ అన్నారు.

* భవన నిర్మాణ కార్మికుల కోసం పార్టీలన్నీ సంఘటితం కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే భాజపా, వామపక్షాలు స్పందించాయన్నారు. విపత్కర పరిస్థితులపై పోరుకు మిగతా పార్టీలూ ముందుకు రావాలని కోరారు. కార్మికుల ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు బాధ కలిగిస్తున్నాయనీ.. నెలల తరబడి ఉపాధిలేక కష్టాలపాలై వారు ప్రాణాలు తీసుకుంటున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

* తెలంగాణ క్యాడర్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి ఇకపై కేంద్ర సర్వీసుల్లో పనిచేయనున్నారు. దిల్లీలోని కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా ఆమెను కేంద్రం డిప్యుటేషన్‌పై నియమించింది. ఆమ్రపాలి తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా సేవలందించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఆమ్రపాలి పదోన్నతిపై వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గానూ పనిచేశారు.

* ఏపీ రాజధాని, ఇతర నిర్మాణ ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. ఆ సూచనలను ఈమెయిల్‌, లేఖల ద్వారా పంపాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ సూచించింది. ఎక్ష్పెర్త్చొమ్మిత్తీ2019@గ్మైల్.చొంకు ఈమెయిల్‌ లేదా విజయవాడ పటమటలో ఉన్న కార్యాలయానికి నవంబర్‌ 12లోపు ప్రజలు తమ అభిప్రాయాలు పంపాలని కోరింది. రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని సెప్టెంబర్‌ 13న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

* ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. తీవ్రమైన కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించారు. సోమవారం ఉదయం తొలుత ఇక్కడి ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించిన అనంతరం.. సాయంత్రం ఎయిమ్స్‌కు తరలించారని సమాచారం. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై భిన్న ప్రకటనలు వినిపిస్తున్నాయి.

* రష్యా తూర్పు ప్రాంతంలో ఉన్న అంగారస్క్‌ నగరంలోని ఓ మ్యూజియం రకరకాల గడియారాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ గడియారాలను ఒక్క చోట చేర్చిన ఈ ప్రదర్శన పురాతన వస్తు ప్రియులను అలరిస్తోంది. దాదాపు 2000 గడియారాలను కలిగి ఉన్న ఈ మ్యూజియం ఈ ఏడాదితో 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు వచ్చి గడియారాలను ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు కానీ ఒకప్పుడు గడియారానికి ఉండే క్రేజే వేరు. ఒకప్పుడు గడియారాన్ని కూడా ఇంటి అలంకరణలో భాగం చేసేవారు.

* ఒలింపిక్స్‌లో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్‌ హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయిర్‌ రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో 1-6 తేడాతో ఘోరపరాభవాన్ని చవిచూసింది. దీంతో వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనుకున్న పాక్‌ హాకీ జట్టు ఆశలకు గండి పడింది.

* జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి క్రూరంగా తన ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేసింది. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి వెళితే.. నర్మెట్ట మండలం భీక్యా తండాకు చెందిన బానోత్‌ రమ ఇంట్లోనే తన ఇద్దరి పిల్లలు భానుశ్రీ (4), వరుణ్‌ (3)ల గొంతు కోసింది. ఇంట్లో మంచంపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఆ తర్వాత ఆమె కూడా గొంతు కోసుకుంది. కొన ఊపిరితో ఉన్న రమను స్థానికులు జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

* ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉందని.. మిగతా అంశాలపై భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. అందుకే మిగతా అంశాలు ముందుగా చర్చించాలని పేర్కొన్నట్లు తెలిపింది. సమ్మె వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానంలో ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల ఐకాస మధ్య వాదనలు కొనసాగాయి. ఈడీల కమిటీ నివేదికను తమకెందుకు సమర్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలు తమ వద్ద కూడా దాచి పెడతారా అంటూ అసహనం వ్యక్తం చేసింది.

* గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ది తెదేపా డీఎన్‌ఏ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. వంశీని వదులుకొనేందుకు తెదేపా సిద్ధంగాలేదని చెప్పారు. వంశీ మోహన్‌తో మాట్లాడేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. వంశీలాంటి మంచి రాజకీయ నేత రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది కాదన్నారు. వంశీ తరఫున పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండకూడదని నాని సూచించారు.

* ఏపీ సర్కార్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రంగులు వేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప వైకాపా పాలించడానికి పనికిరాదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు ఇసుక కొరతను వారికి రిటర్న్‌గిఫ్ట్‌గా ఇచ్చారంటూ ఆక్షేపించారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.150ల కూలీ కూడా రావడంలేదన్నారు.

* యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన సుమారు 25 మంది ఎంపీలతో కూడిన బృందం ప్రధాని నరేంద్రమోదీని సోమవారం కలిసింది. ఆయనతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిల్‌ డోభాల్‌తో కూడా ఈ బృందం భేటీ అయ్యింది. జమ్మూకశ్మీర్‌ పర్యటన నేపథ్యంలో భాగంగా మోదీ, డోభాల్‌తో ఈ బృందం భేటీ అయ్యింది. మంగళవారం ఈ బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది.

* కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులపై మండిపడ్డారు. స్నేహితులకు కానుకలిచ్చిన విషయమై ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మనీల్యాండరింగ్‌ కేసులో డీకేను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తర్వాత దిల్లీ హైకోర్టు ఈయనకు బెయిల్‌ మంజూరు చేసింది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

* యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్‌ గడువును మరోసారి పొడిగించారు. అందుకు ఈయూ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. తాజా గడువు జనవరి 31తో ముగియనుంది. ఈ మేరకు యూరోపియన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ టస్క్‌ ట్వీట్‌ చేశారు. బ్రెగ్జిట్‌ గడువు పొడిగించాలన్న బ్రిటన్‌ అభ్యర్థనకు ఈయూలోని 27 దేశాలు అంగీకరించాయని తెలిపారు. బ్రెగ్జిట్‌పై రెఫరెండం నిర్వహించి ఆమోదం పొంది ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

* కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖైదీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచే కాకుండా అటు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా టాలీవుడ్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రబృందాన్ని ప్రశంసించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ‘ఖైదీ’ చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఖైదీ’ ఒక అద్భుతమైన చిత్రం. పవర్‌ఫుల్‌ స్ర్కీన్‌ప్లేతో ఓ అసాధారణమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తి నటన చాలా బాగుంది. చిత్రబృందానికి నా అభినందనలు.’ అని హరీశ్‌ పేర్కొన్నారు.

* దేశంలో ఆటోమొబైల్‌ రంగం కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. మహీంద్రా సంస్థ ధన్‌తేరస్‌ ఒక్క రోజు 13,500 వాహనాలను డెలివరీ చేసింది. చాల ఆటోమొబైల్‌ సంస్థలు ఆరోజు భారీగా వాహనాలను విక్రయించాయి. గత ఏడాది ధన్‌తేరస్‌తో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కవ. మరోపక్క హ్యూందాయ్‌, బెంజ్‌, ఎంజీ మోటార్స్‌ కూడా భారీగా డెలివరీలు చేశాయి. ‘‘ధనతేరస్‌ పర్వదినం ఒక్కరోజే మా ఆటోమొబైల్‌ విభాగం 13,500 వాహనాలను డెలివరీ చేసింది.’’ అని మహీంద్రా సంస్థ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

* వచ్చేనెల 22న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగబోయే భారత్‌, బంగ్లా టెస్టు మ్యాచ్‌కు తమ దేశం నుంచి 6 వేల మంది వచ్చినా ఆశ్చర్యపోనని బంగ్లా మాజీ సారథి, జాతీయ సెలక్టర్‌ హబిబుల్‌ బషర్‌ అభిప్రాయపడ్డాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈనెల ఆరంభంలో భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ అర్హత మ్యాచ్‌కు సుమారు 60 వేల మంది హాజరైనట్లు సమాచారం.