సుఖ సంసారాలకు దూరంగా ఎడారి దేశం పయనం.. అందునా యవ్వనం. సహజమైన కోరికలు.. ఒకరినొకరు ఎదురుపడ్డారు. చూపులు కలిశాయి. పలకరించుకుంటే ఇద్దరూ తెలుగువాళ్లే! ఇంకేం.. ఇద్దరూ సహజీవనం చేయడం.. తమ జన్మించిన పిల్లలను అనాథలుగా ఆస్పత్రుల్లో వదిలి వేయడం! ఇలా మానవీయతకు మచ్చ తెస్తున్నారు మన తెలుగువాళ్లు!
ఈ తరహాలోనే గర్భం దాల్చిన మహిళ ఓ ఆస్పత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ మరుసటి రోజే నిర్దయగా ఆ పసిగుడ్డును వదిలేసి పారిపోయింది. ఇది జరిగి ఆరేళ్లయింది. ఆ బాబు అప్పటి నుంచి కువెత్‌లోని ప్రభుత్వ అనాథాశ్రమంలో ఉంటున్నాడు. అతడికి అరబ్బీ భాష తప్ప మరే భాష తెలియదు. తనను ఆస్పత్రిలో వదిలేసి.. తల్లి పారిపోయిందన్నది అంతకన్నా తెలియదు! మరో ఘటనా ఇలాంటిదే. ఆ ఆడ, మగా కూడా తెలుగువాళ్లే. ఓ పాపకు జన్మనిచ్చిన ఆ తల్లి.. రెండేళ్ల తర్వాత ఆ చిన్నారిని ఆస్పత్రిలో వదిలిపారిపోయింది. తొలి కేసులో బాబును వదిలేసిన మహిళను ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా గనపవరం మండల వాస్తవ్యురాలిగా గుర్తించారు. ఆమె కువైత్‌లో పనిచేస్తూ 2012లో పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరి బాబుకు జన్మనిచ్చింది. బాబును వదిలి ఆమె వెళ్లిపోయిన తర్వాత కొన్నాళ్లకు ఆ శిశువును హాదానా అల్ ఎతీం (అనాథాశ్రమం)కు తరలించారు. ఆస్పత్రిలో చేరిన మహిళ వీసా గడువు ముగిసిపోవడంతో ఆమెను సౌదీ నుంచి బహిష్కరించారని తెలుసుకున్నారు. వీసా వ్యవహారంలో పోలీసులకు పట్టుబడిన సమయంలో మరింత చిక్కుల్లో పడతాననే భయంతో తనకు ఓ కుమారుడు ఉన్నాడని.. పుట్టిన వెంటనే ఆస్పత్రిలో బాబును వదిలేశానని ఆమె వెల్లడించలేదు. గత ఆరేళ్లుగా బాలుడిని తల్లికి అప్పగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఏపీకి వెళ్లిందని తెలిసి.. భారత ఎంబసీని అనాఽథాశ్రమం అధికారులు సంప్రదించారు. బాలుడి తల్లికి సంబంధించి ఎలాంటి సమాచారమైనా ప్రస్తుతం ఏపీలో ఉన్న కువైత్ ప్రవాసాంధ్ర సామాజిక కార్యకర్త దుగ్గి గంగాధర్‌ను 9000856534 నంబరుపై సంప్రదించవచ్చు.
మరో కేసులో కడప జిల్లా చెన్నూరు మండలానికి చెందిన మహిళ రెండేళ్ల తన బిడ్డను ఆస్పత్రిలో వదిలి పారిపోయింది. ప్రకాశం జిల్లా కొమ్రోలు మండలం రెడ్డిచర్లకు చెందిన ఆవులమంద శేఖర్‌ను ఆమె నోటిమాటగా పెళ్లాడింది. వారికి రెండేళ్ల క్రితం కూతురు జన్మించగా.. వ్యక్తిగత కారణాలతో ఆ బిడ్డను ఆస్పత్రిలో వదిలేసి పోయింది. ఇటీవల ఇంట్లో గుట్టుగా గర్భస్రావం చేసుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించగా ఆరోగ్యం వికటించడంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె రికార్డును పరిశీలించిన అధికారులకు ‘మొదటి బిడ్డ’ గురించి తెలిసింది. తల్లిదండ్రులిద్దరూ భారతీయులే కావడంతో ఆ చిన్నారి పౌరసత్వం కేసును ఢిల్లీలోని హోంశాఖకు నివేదించారు. చట్టబద్ధంగా వివాహం చేసుకోకుండా.. ప్రైవేటుగా కాపురం చేస్తున్న వారి కారణంగా జరుగుతున్న జననాల కేసులు కువైత్‌లో భారతీయ అధికారులకు తలనొప్పిగా మారాయి. ఈ తరహా కేసుల్లో ఎక్కువ ఏపీవే ఉన్నాయని అంటున్నారు.