Devotional

కేదారేశ్వర వ్రతం అంటే తెలుసా?

Telugu Devotional News-Kedareswara Vratam Info

దీపావళి పండుగ వేళ కేదారేశ్వర వ్రతం ఆచరిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమినాడు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. మంగళగౌరీ అనుగ్రహం కోసం, దాంపత్య సౌఖ్యం కోసం చేసే ఈ వ్రతాన్ని కేదారేశ్వర వ్రతం అని కూడా అంటారు. ఇది భార్యాభర్తలిద్దరూ కలిపి చేసుకునే వ్రతం. భర్తకు కుదరనప్పుడు భార్య మాత్రమే చేసుకోవచ్చు. భార్యకు వీలుకాక పోతే మాత్రం భర్త ఒక్కడే చేయకూడదు. వివాహంకాని ఆడపిల్లలు కూడా ఈ నోము నోచుకోవచ్చు. ముందుగా 21 పేటల పట్టు దారాన్ని కాని, నూలు దారాన్ని కాని తోరంగా కట్టుకోవాలి. కలశంలోకి, ప్రతిమలోకి కేదారేశ్వరుని ఆవాహన చేయాలి. 21 ఉపచారాలతో పూజ చేయాలి. గోధుమపిండితో 21 నేతి అరిసెలు వండాలి.పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసం, అన్ని రకాల కూరలు, పళ్లు నివేదన చేయాలి. కథ చెప్పుకున్నాక అక్షింతలు వేసుకోవటం మర్చిపోకూడదు.ఇలా 21 సంవత్సరాలు చేయాలి. ముగింపు విషయానికి వస్తే పార్వతీదేవి ఉద్యాపన చేసినట్టు ఉంది కాని ఏమి చేసిందో తెలియదు. నోచుకున్నవారు ఉద్యాపన సంకల్పం చెప్పుకుంటే చాలునని పెద్దలమాట. ఆసక్తి ఉన్నవారు తమ శక్తికొద్దీ చేసుకోవచ్చు. కేదారం అంటే మాగాణం. వరి పండే పొలం. దానికి అధిపతి కేదారే శ్వరుడు. పార్వతీదేవి ప్రకృతి స్వరూపిణి. పార్వతి లేకపోతే శివుడు శక్తి హీనుడయిన గాథను వ్రత కథగా చెప్పుకుంటారు. ఈ వ్రతకథ స్త్రీ పురుషుల సమానత్వాన్ని తెలియచేస్తుంది. గౌరీదేవి లేనిదే శివుడికి పూజలేదు. గౌరితో కూడిన సాంబశివుణ్ణి పూజించే అరుదైన వ్రతం ఇది.