Kids

నిజమైన తెలివి దీపాన్ని వెలిగిస్తుంది

Telugu Kids Moral Stories-Real Talent Lies In Bringing Lights To Life

రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని వారికో పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు. తన ఇద్దరు కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి “ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువేదైనా కొనండి” అని వారితో చెప్పాడు.

పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్న పళంగా మార్కెట్టు వైపు వేగంగా వెళ్లి, మార్కెట్టులో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపడానికి ఆ గడ్డి సరిపోలేదు.

రెండవ కొడుకు తన తండ్రి అప్పజెప్పిన పని ఎంతో తెలివి తేటలతో పూర్తి చేయాలి అని అనుకుని దాన్ని గురించి బాగా ఆలోచించి, తండ్రి ఇచ్చిన డబ్బులో ఒక్క రూపాయితో క్రొవ్వొత్తిని కొని ఇంటికి వచ్చి, గదిలో క్రొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే ఆ క్రొవ్వొత్తి ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది.

రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్దకొడుకుకి చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు.