ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు ‘జగన్ మాయ’లా మారాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు.పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం మానవ తప్పిదమేనని తేల్చిచెప్పారు. వైకాపా నేతల స్వార్థానికి రోజువారీ కూలీలు బలి అవుతున్నారని మండిపడ్డారు. సొంత ఊళ్లలోని వాగుల్లో ఇసుక తెచ్చుకోవడానికి అనేక అడ్డంకులు సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని దుయ్యబట్టారు. గోదావరి-కృష్ణా అనుసంధానాన్ని రివర్స్ చేస్తున్నారని జలాశయాలు ఎందుకు నింపలేదని సీఎం ఇప్పుడు ప్రశ్నంచడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇటీవల వరదల్లో 4వేల క్యూసెక్కులు సముద్రంలోకి వృథాగా పోయాయని విమర్శించారు.తెదేపా నేతలు చింతమనేని ప్రభాకర్, భూమా అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు దుయ్యబట్టారు. మరో నేత వల్లభనేని వంశీని అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులతో కోడెలను బలి తీసుకున్నారని విమర్శించారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం కార్యకర్తలు నిలబడ్డారని అన్నారు. మానవ హక్కుల కమిషన్ బృందం ఈ రోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిందన్న చంద్రబాబు.. నవంబర్ 1 వరకు రాష్ట్రంలో ఈ బృందం పర్యటిస్తున్నందువల్ల వైకాపా నేతల బాధితులంతా మానవ హక్కుల బృందాన్ని కలవాలని సూచించారు. గత 5నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 620 చోట్ల వైకాపా నేతలు అరాచకాలకు పాల్పడ్డారని, వీటన్నింటినీ మానవహక్కుల బృందం దృష్టికి తీసుకెళ్లాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఇసుక అమ్మకాలు జగన్మాయ
Related tags :