Politics

రసకందాయకంలో గన్నవరం గరం రాజకీయం

Gannavaram Politics Picking Up Heat With Vamsis Entry To YSRCP

అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోనూ.. ఇటు అధికార పార్టీ వైకాపాలోనూ కలకలం.. కార్యకర్తల్లో ఉత్కంఠ.. నేతల్లో ఆందోళన.. రకరకాల విశ్లేషణలు.. భవిష్యత్తుపై సమాలోచనలు.. బుజ్జగింపులు.. ఇదీ గన్నవరం నియోజకవర్గంలో రాజకీయపరిస్థితి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ రాజీనామాతో జిల్లాలో కలకలం రేగింది. ఆయన తెలుగుదేశం పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. వైకాపాలో చేరేందుకు అంగీకరించారు. మంగళవారం కానీ, వచ్చేనెల 3న కానీ వైకాపాలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఆయనను నిలుపుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వైకాపా ఇంఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వంశీని పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. తన అభిప్రాయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలియచేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. సీఎంను కలిసే అవకాశం ఆయనకు రాలేదు. సోమవారం పార్టీ నేతలకు ఎవ్వరికి సమయం ఇవ్వలేదు. దీంతో జగన్‌ నివాసానికి వెళ్లిన యార్లగడ్డ నిరాశతో వెనుదిరిగారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.
**కేశినేనికి భాధ్యత..!
ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నిలువరించే బాధ్యత విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం చంద్రబాబుతో కేశినేని నాని భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అనంతరం మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీలు బుద్దావెంకన్న, బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబులు అధినేత చంద్రబాబును కలిసి జిల్లాలో పరిస్థితిపై కొంత సేపు చర్చించారు. మంగళవారం నుంచి జిల్లా పార్టీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా దానిపై సమీక్షించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాసిన లేఖలపై చంద్రబాబునాయుడు సమాధానం ఇచ్చారు. అయితే కారణం పార్టీ పై నెట్టి వైకాపాలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. వంశీ హైదరాబాద్‌లో ఉన్నందున కలిసేందుకు కేశినేని నానికి అవకాశం లేకుండా పోయింది. తాను వంశీతో మాట్లాడేందుకు వీలు కాలేదని ఎంపీ కేశినేని చెప్పారు. తాను సందేశం పంపానని మంగళవారం విజయవాడకు వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ డీఎన్ఏ ఆయన రక్తంలో ఉందని, వంశీ ఎక్కడికీ వెళ్లరని వ్యాఖ్యానించారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీ కార్యాలయంలో హడావుడిగా తయారైంది. వాట్సప్‌ సందేశాలపై మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా సమర్పించకుండా అనవసర గందరగోళం ఏమిటని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ చెక్కుచెదరకుండా ఉండేందుకు నాయకత్వం రంగంలోకి దిగింది. వారితో సంప్రదింపులు జరుపుతున్నారు.
**వైకాపా శిబిరంలో..!
ప్రవాస భారతీయుడైన యార్లగడ్డ వెంకట్రావు వైకాపా తరఫున తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. వైకాపా శిబిరంలోనూ బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట నియోజకవర్గానికి చెందిన దుట్టా రామచంద్రరావుకు టిక్కెట్‌ వస్తుందని ఆశించారు. అనంతరం యార్లగడ్డకు ఇచ్చారు. ప్రస్తుతం దుట్టా అనుచరులు వంశీ రాకను వ్యతిరేకించడం లేదు. యార్లగడ్డ అనుచరులు మాత్రం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. యార్లగడ్డకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్ధమని అధినేత జగన్‌ సూచించినట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా తెలిపారని అంటున్నారు. అయితే రాజ్యం లేని రాజు పదవి తనకెందుకని యార్లగడ్డ అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వంశీ రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే స్వతంత్రంగా పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని యార్లగడ్డ అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి గన్నవరంలో రాజకీయం రసకందాయంలో పడింది.