NRI-NRT

న్యూజెర్సీలో దీపావళి వివాదం-తిట్టిపోస్తున్న అమెరికన్లు

Indians Leave Behind Diwali Celebration Trash In New Jersey-Americans Angry

అది న్యూజెర్సీలోని ఇండియా స్క్వేర్‌ ప్రాంతం. దీపావళి నాడు భారతీయులు పేల్చిన టపాకాయల శబ్ధంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అన్నీ టపాకాయలు కాల్చేసిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఖాళీ డబ్బాలతో, కాల్చి పడేసిన టపాకాయలతో వీధి అంతా చెత్త పేరుకుపోయింది. టపాకాయలు కాల్చడం వల్ల కాలుష్యపు పొగలు కూడా కమ్ముకున్నాయి. దీంతో అక్కడి జనం నీళ్లతో వీధిని శుభ్రం చేయటానికి కదిలారు. పద్నాలుగు సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియోను సంధ్య అనే యువతి ట్విటర్‌లో షేర్‌ చేసింది. భారతీయురాలినని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నానంటూ కామెంట్‌ జోడించింది. మరోవైపు ఆ వీధిలో పెట్రోలింగ్‌ నిర్వహించి.. బాధ్యతగా వ్యవహరించిన పోలీసులపై ప్రశంసలు కురింపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారతీయులు పండగ వేడుకలు నిర్వహించుకున్న అనంతరం శుభ్రం చేయకుండా ఉండిపోవడంపై అమెరికన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులపై విమర్శలు గుప్పిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అడుగుపెట్టేముందు భారతీయులకు శుచీ శుభ్రత గురించి పాఠాలు నేర్పాల్సిన అవసరం ఉంది అని ఓ నెటిజన్‌ క్లాసు పీకాడు. ఇదా మీ సంస్కృతి అంటూ మరో నెటిజన్‌ హేళనగా కామెంట్‌ చేశాడు. దీంతో సరదాగా సాగాల్సిన దీపావళి వివాదాలతో ముగిసింది.