Health

బరువు తగ్గడానికి నోరు కట్టేసుకోనక్కర్లేదు

Stay Away From Sugars. You Will Loose Weight Automatically.

బరువు తగ్గాలనుకునేవారిలో ఎన్నో సందేహాలుంటాయి. ఏ పదార్థాలు తినాలో, ఏవి మానేయాలో తెలియక రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటివారికే ఈ చిట్కాలు.
* కొంతమంది అల్పాహారం మానేస్తే బరువు తగ్గుతామనుకుంటారు. ఇలా చేస్తే హార్మోన్ల అసమతుల్యత ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇది ఇతర అనారోగ్యాలకు దారితీస్తుందని గుర్తుంచుకోవాలి. అన్నిరకాల పోషకాలుండే సమతులాహారం ఉదయాన్నే తీసుకోవాలి. అదీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే… మధ్యాహ్నం మితంగా తినగలుగుతారు. మెదడు పనితీరూ మెరుగవుతుంది.
* శరీరంలో పేరుకొన్న కొవ్వు కరగాలంటే… కేవలం మాంసకృత్తులుండే ఆహారం తీసుకుంటే సరిపోదు. జీవక్రియ రేటులో హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలన్నా, కండరాల పనితీరుకు, శక్తికి తగినన్ని పిండిపదార్థాలు శరీరానికి అందాల్సిందే. సంక్లిష్ట పిండిపదార్థాలు ఎంచుకోవాల్సి ఉంటుంది.
* నూనెతో చేసిన పదార్థాలను తీసుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందనేదీ అపోహే. నూనెలో కరిగే విటమిన్లను శరీరం స్వీకరించాలంటే నెయ్యి, పనీర్‌, తాజా పెరుగు వంటివి తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులను అందిస్తాయి. బరువు తగ్గడానికీ తోడ్పడతాయి.
* బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేసి… పండ్లు, కూరలు తీసుకుంటే చాలనుకుంటారు. దానివల్ల ప్రయోజనాలు అందినా అది తాత్కాలికమే. అనారోగ్యాలూ రావొచ్చు. బదులుగా అన్నిరకాల పదార్థాలు తీసుకుంటూనే సన్నబడుతూ, ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి.
* చిన్నచిన్న ప్రయత్నాలే కొంతవరకూ బరువును తగ్గిస్తాయి. ఎలాగంటే… చక్కెర మానేయడం, వేపుళ్లు, బయటి పదార్థాలు తగ్గించడం, హెర్బల్‌ టీలు తీసుకోవడం, తృణధాన్యాలు, చిరుధాన్యాల మోతాదు పెంచడం… వంటివన్నీ చేయాలి. వీటితో శరీరానికి అవసరమైన పోషకాలూ అందుతాయి.