Agriculture

పాడిపశువుల ఆరోగ్య సంరక్షణ చిట్కాలు

Telugu Agricultural News - Cattle Feed And Health Tips

పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు
పాడి పశువుల పోషణ, నిర్వహణతోపాటు వాటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధవహించడం ఎంతో ముఖ్యం. పాడి పశువులు సక్రమంగా మేత మేస్తూ, ఇతర ఇబ్బందులు లేకుండా, దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవాలి.
*అనారోగ్య సూచనలు:
పశువు మందకొడిగా ఉండడం, ముట్టి తడి ఆరిపోయి ఉండడం, కళ్లు ఎర్రబడడం లేదా పుసులు కారడం, మేత తినదు, నెమరు వేయదు, పొట్ట కదలకుండా ఉబ్బరంగా ఉండడం, శరీరం వేడిగా జ్వరంతో ఉండడం, పలుచటి పేడ వేయడం, వణకటం, దద్దుర్లు రావడం, పాల ఉత్పత్తి ఒకేసారి తగ్గించడం/ క్రమేమీ తగ్గించడం, మూత్రం రంగు మారడం. ఈ లక్షణాలు పాడి పశువుల్లో కనిపించినట్లయితే ఊగిలెనంత త్వరగా పశువైద్యుడ్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
**పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు
*వాతావరణం:
విదేశీ ఆవులు వేడి వాతావరణాన్ని తట్టుకోలేవు. అందుకే 50% సంకర జెర్సీ ఆవును లేదా సంకరజాతి హెచ్.ఎఫ్. జాతి ఆవులను ఎన్నుకోవాలి. ఎండలో మేపకుండా ఇంటివద్దనే చెట్ల నీడలలో గానీ, పాక లేదా తాటాకు షెడ్ల కింద చల్లటి వాతావరణంలో పోషించినట్లయితే మంచి పాలదిగుబడినిస్తాయి.గేదెలు నల్ల చర్మం కలిగి ఉండటం వలన వేసవి తాపాన్ని తట్టుకోలేవు. వాటిని ఉదయం పూటనే మేతకు పంపాలి. పగటిపూట ఇంటి వద్ద చల్లటివాతావరణంలో పోషించాలి. అప్పుడే వాటి ఉత్పాదకత కోల్పోకుండా మంచి పాలదిగుబడినిస్తాయి.
**పరిసరాలు :
పాడి పశువులను పెంచే స్థలాల వద్ద పరిసరాలు శుభ్రతగా ఉండే విధంగా చూసుకోవాలి. సరైన గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. మురికి నీరు నిలవకుండా చూసుకోవాలి. దాని వల్ల దోమలు, ఈగలు మొదలగు వాటిని అరికట్టి కొన్ని రకాల వ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు.
*మేత, తాగునీరు:
పాడి పశువులకు మంచి పోషకాహార పదార్థాలు కలిగిన మేత సరిపోయేంత ఇవ్వాలి. పాడి పశువులకు ఇచ్చే మేత దాని శరీర అవసరానికి పోను పాల ఉత్పత్తి కోసం, ఒక వేళ సూడితో ఉన్నట్లయితే గర్భంలో పెరిగే పిండానికి అధిక పోషకాహారం అందించవలసి ఉంటుంది. అందుకే పాడి పశువులకు నాణ్యమైన మేత, దాణా సరిపోయేంత ఇవ్వాలి. పరిశుభ్రమైన తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. మురికినీరు, కలుషితప్రాంతాలలో నీరు తాగించడం వల్ల పాడి పశువులు అనారోగ్యానికి గురవుతాయి. రైతు ప్రతి రోజూ తన పాడి పశువులను గమనించి ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యునిచే చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనపరిస్తే నష్టం అపారం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.