ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు నెరిసిపోవడం. చిన్నపిల్లలు, యుక్తవయసు వారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తోంది. మరి దీనికి కారణాలు… పరిష్కారాలు చూద్దామా…
విటమిన్ లోపం… శరీరమే కాదు, జుట్టూ ఆరోగ్యంగా ఉండాలంటే… సరైన మోతాదులో విటమిన్లను తీసుకోవాలి. వీటి లోపం వల్ల జుట్టు నెరవడం మొదలవుతుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి6, బి12, బయోటిన్, డి, ఈ విటమిన్లు లోపిస్తే ఈ సమస్య ఎదురవుతుంది. ముందు… ఏ విటమిన్ లోపం ఎదురవుతోందనేది తెలుసుకుని, అవి అందే ఆహారం తీసుకోండి. అవసరం అయితే… వైద్యుల సలహాతో సప్లిమెంట్లను ఎంచుకోండి.
వంశపారంపర్యం… జుట్టు నెరవడానికి కుటుంబ చరిత్రా ఓ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సంకేతాలు ముందే తెలుస్తాయి కాబట్టి మొదటినుంచీ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒత్తిడి, నిద్రలేమి… జుట్టు నెరవడానికి ఈ రెండూ కారణాలే. మీకు ఆరోగ్యకరమైన నల్లటిజుట్టు కావాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి. వేళకు నిద్రపోవాలి. ధ్యానం, వ్యాయామాలు వంటివి ఈ సమస్యల్ని అదుపులో ఉంచుతాయి.
తలనూనె: నేటికాలంలో చాలామంది జుట్టుకు నూనె పెట్టుకోవడం మానేశారు. ఇది సరైన పద్ధతి కాదు. జుట్టుకు పోషణ అవసరం. రోజూ కాకపోయినా వారంలో ఒకటిరెండుసార్లు నూనె పెట్టుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు పొడిబారకుండా, రంగు మారకుండా ఉంటుంది.
షాంపూలు: అవసరానికి మించి ఎక్కువసార్లు రసాయనాలున్న షాంపూ వాడినా సమస్యేనని గుర్తుంచుకోండి. వీటిని ఎంత పరిమితంగా వాడితే అంత మంచిది. కాబట్టి వీటిని పరిమితంగా వాడాలి.