Devotional

శబరిమల యాత్ర ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం

Sabarimala Trip Online Booking Opened

1.శబరిమల యాత్రఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం
అయ్యప్ప భక్తులు శబరిమల యాత్ర కోసం పేర్లను ముందుగానే నమోదు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. భక్తులు www.sabarimalaonline.orgలో లాగిన్‌ అయి వారి పేరు, వయసు, చిరునామా, ఫొటో, స్కాన్‌ చేసిన గుర్తింపు కార్డులు, మొబైల్ నెంబర్ వివరాలతో ముందుగా బుకింగ్‌ చేసుకోవచ్చు. ఒకే కుటుంబమైనా, స్నేహితులైనా విడిగా బుకింగ్‌ చేసుకోవాల్సిందే. ఐదేళ్లలోపు పిల్లలకు బుకింగ్‌ అవసరం లేదు. కానీ, బడికెళ్లే పిల్లలు ఐడీ కార్డు జతచేసి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న ప్రతి సేవకు ఆన్‌లైన్‌ కూపన్‌ అందుబాటులో ఉంది. బుకింగ్‌ పూర్తిచేశాక యాత్ర సమయం, తేదీని సేవ్‌ చేసి స్వామి దర్శన ‘క్యూ’ కూపన్‌ ప్రింట్ తీసుకోవాలి. యాత్రకు వెళ్లేటప్పుడు ఈ పత్రాలతో పాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
2.గాజుల అలంకారంలో జగన్మాత
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను వివిధ వర్ణాల గాజుల దండలతో మంగళవారం అలంకరించారు. నిత్యం స్వర్ణాభరణాలతో దర్శనమిచ్చే దుర్గమ్మను గాజుల అలంకరణలో చూసి భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. మూలవిరాట్తోపాటు మల్లికార్జున మహామండపంలోని ఆరోఅంతస్తులో ఉత్సవమూర్తిని, ఉపాలయాలైన మల్లేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఆలయాలను కూడా గాజుల దండలతో ప్రత్యేకంగా అలంకరించారు. రాజగోపుర ప్రాంగణంలో దుర్గమ్మ విగ్రహాలకు సైతం గాజుల దండలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గాజుల అలంకారంలో ఉన్న జగన్మాత దుర్గమ్మను భక్తులు దర్శించుకునేందుకు వేకువ జాము నుంచి క్యూలైన్లలో బారులు తీరారు. దాతలు పదిలక్షల గాజులను గాజుల ఉత్సవం సందర్భంగా దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. సేవా సిబ్బంది మూడ్రోజుల పాటు దాతలిచ్చిన వాటిని వివిధ రకాల ఆకృతుల్లో దండలుగా గుచ్చి అమ్మవారికి అలంకరణలో భాగస్వాములయ్యారు. గాజుల అలంకారణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులకు మూడ్రోజుల అవకాశం కల్పించినట్లు దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు.
3.ఆధ్యాత్మిక పరిమళం
రూ.1.5 కోట్లతో నిర్మించిన హరేరామ ఆశ్రమం
ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంచి… ఆరోగ్యకర జీవన విధానం వైపు నడిపించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తోంది… కారంచేడులోని శ్రీ వశిష్ట హరేరామ ఆశ్రమం. ఆనందమయ జీవితం, జీవన నైపుణ్యాల పెంపుతో పాటు… భగవద్గీత పఠనంపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. తద్వారా ప్రజల్లో విజ్ఞానం పెంపొందడంతో పాటు… ఎలా జీవించాలన్నది తెలుస్తుందని ఆశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. ఇలా ఇక్కడ వెయ్యి మందికి పైగా గీతా పఠనంపై పట్టు సాధించారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా గ్రంథాలయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం సకల వసతులతో నూతన భవనాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎనిమిది దశాబ్దాల క్రితం కారంచేడులో ఏర్పాటైన ఆశ్రమానికి గ్రామానికి చెందిన జాగర్లమూడి రామయ్య భార్య వెంకటసుబ్బమ్మ… 1940లో 13 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. రూ.లక్ష సొంత నిధులు వెచ్చించి భవనం కూడా నిర్మించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులోని వ్యాసాశ్రమ సంస్థాపకులు మలయాళ స్వామి అప్పట్లో దీనిని ప్రారంభించారు. 1980లో ప్రణవానందగిరి స్వామి ఆశ్రమాధిపతిగా బాధ్యతలు స్వీకరించి కొనసాగుతున్నారు. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో 2017 ఆగస్టులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేర్లు వెల్లడించేందుకు ఇష్టపడని భక్తులు, పలువురు దాతలు, స్థానికులు పెద్ద మొత్తంలో సహకారం అందజేశారు. అలా రూ.1.50 కోట్లతో సకల వసతులతో మూడు అంతస్తుల భవన నిర్మాణం పూర్తిచేశారు. నవంబరు 14న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ఆశ్రమానికి వసతి కల్పించేందుకు భక్తులు అందించిన సహకారం సంతోషం కలిగిస్తోంది. భవిష్యత్తులో కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తామ’ని చెప్పారు ప్రణవానందస్వామి.
4.తితిదే శ్రీవాణి ట్రస్టు దాతలకు గదులు
తితిదే నిర్వహిస్తున్న శ్రీవాణి ట్రస్టుకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోందని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం 85 మంది భక్తులు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించారని వెల్లడించారు. వారు శ్రీవారి దర్శనంతోపాటు వసతి సౌకర్యాన్ని కల్పించాలని కోరారని తెలిపారు. భక్తుల విన్నపాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల తిరుమలలో ప్రారంభించిన వకుళాభవన్లో 50 గదులను శ్రీవాణి ట్రస్టుకు కేటాయించనున్నామని వివరించారు.
5. రాశిఫలం -30/10/2019
తిథి:
శుద్ధ తదియ రా.తె.4.27 , కలియుగం-5121 తీశాలివాహన శకం-1941
నక్షత్రం:
అనూరాధ రా.1.03
వర్జ్యం:
ఉ.7.06 వరకు
దుర్ముహూర్తం:
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం:
మ.12.00 నుండి 1.30 వరకు ,విశేషాలు: త్రిలోచన గౌరీవ్రతం
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. అజీర్ణ బాధలు అధికమగును. కీళ్ళనొప్పుల బాధనుండి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగివుంటారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పట్టుదలతో కొన్ని కార్యాలుల పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారుతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్ర్తిలు చేసే వ్యవహారాల్లో సమస్యలెదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుండును. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా నుండుట మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.6. నేడు అద్దంకిలో శ్రీ పురంద‌ర దాసు, శ్రీ అన్న‌మాచార్యుల‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ఠా మ‌హోత్స‌వాలు టిటిడి దాస సాహిత్యప్రాజెక్టు మ‌రియు ప్ర‌కాశం జిల్లా అద్దంకికి చెందిన శ్రీ దాసభార‌తీయ జాన‌ప‌ద క‌ళాక్షేత్రం సంయుక్త ఆధ్వ‌ర్యంలో అక్టోబ‌రు 30న శ్రీ పురంద‌ర దాసుల‌వారు, శ్రీ అన్న‌మాచార్యుల‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ఠా మ‌హోత్స‌వాన్ని బుధ‌వారం వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.ఇందులో భాగంగా శ్రీ ప్ర‌కాశం ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో బుధ‌వారం ఉద‌యం 6.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు పురంద‌రన‌మ‌నం కార్యాక్ర‌మం ఘ‌నంగా జ‌రుగ‌నుంది. ఇందులో పురంద‌ర దాసు, అన్న‌మ‌య్య జీవిత చ‌రిత్ర‌, వారు ర‌చించిన కీర్త‌న‌లు ప్ర‌ముఖ క‌ళాకారులు ఆల‌పించ‌నున్నారు. అనంత‌రం ఉద‌యం 8.00 గంట‌ల‌కు శ్రీ పురంద‌ర దాసుల‌వారి, శ్రీ అన్న‌మాచార్యుల‌వారి విగ్ర‌హాల‌కు అభిషేక‌ము, పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల నుండి దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో అద్దంకి ప‌ట్ట‌ణంలోని రామ్‌న‌గ‌ర్ నుండి అద్దంకి పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ర‌కు శోభాయాత్ర నిర్వ‌హించ‌నున్నారు. త‌రువాత సాయంత్రం 5.00 గంట‌ల‌కు అద్దంకి న‌గ‌ర పంచాయ‌తీ కార్యాల‌యం ఎదురుగా ప్ర‌ముఖుల‌తో శ్రీ పురంద‌ర దాసుల‌వారు, శ్రీ అన్న‌మాచార్యుల‌వారి విగ్ర‌హా ఆవిష్క‌ర‌ణ‌ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. కాగా, శ్రీ ప్ర‌కాశం ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.00 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి ఊంజ‌ల‌సేవ, పుష్ప‌యాగం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.
7. తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు బుధవారం 30-10-2019 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం…
శ్రీరి దర్శనానికి 18 కంపార్ట్ మెంటులో వేచి ఉన్న భక్తులు…….
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది….
కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 4 గంటల సమయం పడుతోంది…..
నిన్న అక్టోబర్ 29 న 78,885 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.77 కోట్లు…
8. కార్తీక పురాణం – 3
* 3వ అధ్యాయం : కార్తీకస్నాన మహిమ,
బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట.
బ్రహ్మర్షియైన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షియైన జనకునికి ఇంకా యిలా చెప్పసాగాడు; ‘రాజా! స్నానదాన జప తపాలలో దేవినిగానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా – అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో – ఆటువంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.

శ్లో” పౌర్ణమ్యాం కార్తీకేమాసి స్నానాందీస్తు నాచరన్ !
కోటిజన్మసు చండాలయోనౌ సంజాయతే నృప !!

శ్లో” క్రమాద్యోనౌ సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షసః !
అత్త్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనమ్ !!

భావం: కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటీ కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి, తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను.అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్త్వనిష్ఠుడనే బ్రహ్మణుడుండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పకులనివాడూ, అన్ని భూతములయందునూ దయాళువూ, తీర్థాటన ప్రియుడూ అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరీ తీరానగల ఒకానొక యెత్తయిన మర్రిచెట్టు మీద – కారు నలుపు కాయచ్చాయ గలవాళ్లూ, ఎండిన డొక్కలు కలవాళ్లూ, ఎర్రని నేత్రములు – గడ్డములూ కలవాళ్లూ, గ్రుచ్చబడిన ఇనుపతీగెలకుమల్లే పైకి నిక్కివున్న తలవెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులూ, కపాలాలూ ధరించి, సర్వజీవ భయంకరులుగా వున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ల దూరంలో యెక్కడా ప్రాణి సంచారమనేదే వుండేది కాదు. అటు వంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు ఆదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై – శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు.
. తత్వనిష్ఠుడి శరణాగతి
శ్లో” త్రాహి దేవేశ లోకేశ! త్రాహి నారాయ ణావ్యయ సమస్త భయవిధ్వంసిన్! త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ ! త్వత్తోహం జగదీశ్వర !!
అంటే – “దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివయిన వాడా ! నారాయణా ! అవ్యయా! నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతము చేసేవాడూ! నిన్నే శరణుకోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగనివాడను. నన్ను కాపాడు రక్షించు” అని యెలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వదించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరుగెత్తసాగినది. రక్కసులా పారునికి చేరువవుతున్న కొద్దీ, సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడడం వలనా – తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతూన్న హరినామము చెవులబడుట వలనా – వెంటనే వారికి జ్ఞానోదయమయింది. అదే తడవుగా ఆ బాపని కెదురుగా చేరుకొని, దండ ప్రణామా లాచరించి, అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి, ‘ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి. అని పునః పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుట పడిన హృదయముతో – తత్వనిష్ఠుడు ‘మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయడం వలన యిలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్దిమంతుల్లా వున్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను’ అన్నాడు.
. ద్రావిడుని కథ
పారుని పలుకులపై, ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. ‘విప్రోత్తమా! నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మంధరమనే గ్రామాధికారినైన నేను, కులానికి బ్రహ్మణుడనే అయినా – గుణానికి కుటిలుడనీ, వంచనామయ వచః చమత్కారుడినీ అయి వుండేవాడిని. ణా కుటుంబ శ్రేయస్సుకై, అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువలకుగాని, బ్రాహ్మణులకు గాని యేనాడూ పట్టెడన్నమయినా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంచేత – నా కుటుంబము నాతో సహా ఏడు తరాల వాళ్లు అధోగతుల పాలయిపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాతనల ననుభివించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై – నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు’ అన్నాడు.
. ఆంధ్రదేశీయుని గాథ
రెండవ రాక్షసునిలా విన్నవించుకోసాగేడు – ‘ఓ పవిత్రుడా! నేను ఆంధ్రుడను. నిత్యమూ నా తల్లిదండ్రులతో కలహించుచు, వారిని దూషించుచు వుండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ, తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసే వాడిని. బందావ బ్రాహ్మణ కోటికేనాడూ ఒక పూటయినా భోజనము పెట్టక – విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికే వాడిని. ఆ శరీరము కాలంచేశాక నరకానపడి ఘోరాతి ఘోరమైన బాధలనుభవించి చివరి కిక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిదునికివలెనే – నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము’ అని అన్నాడు.
. పూజారి కథ
*అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొఱపెట్టనారంభించాడు. ‘ఓ సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదేశపు బ్రహ్మణుడను.
విష్ణ్వాలయంలో పూజారిగా వుండేవాడిని. కాముకుడనూ, అహంభావినీ, కఠినవచస్కుడినీ అయిన నేను – భక్తులు స్వామి వారికర్పించే కైంకర్యాలన్నిటినీ – నా వేశ్యలకు అందచేసి, విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తెరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి, వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి, అనంతరము యీ భూమిపై నానావిధహీన యోనులలోనూ, నానా నీచజన్మలనూ యెత్తి కట్టకడకీ బెట్టిదమయిన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా! నన్ను మన్నించి – మరలా జన్మించే అవసరం లేకుండా – మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా’ అని ప్రార్ధించాడు
? బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట
తమ తమ పూర్వ భవకృత మహాఘరాశికి – ఎంతగానో పశ్చాత్తాప పడుతూన్న ఆ రక్కసులకు అభయమిచ్చి ‘భయపడకండి – నాతో కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలూ నశించిపోతాయి’ అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడా బ్రహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు – బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి, పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము.
శ్లో” అముకానాం బ్రహ్మరాక్షసత్వ వివారణార్ధం !
అస్యాం కావేర్యాం – ప్రాతఃస్నాన మహం కరిష్యే !!

అనే సంకల్పములతో అతడు విధివిధానముగా స్నానం చేసి, తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా – వారు విగతదోషులూ – దివ్యవేషులూ అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.
విదేహరాజా! అజ్ఞానము వలన కాని, మోహ – ప్రలోభాల వలన గాని, ఏ కారణము చేతనైనా గాని – కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీనదిలో స్నానమాచరించి, విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల – ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా, మరెక్కడయినా సరే – ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానము చేయరో, వాళ్లు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి, అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా! కాబట్టి – ఎటువంటి మీమాంసతోటీ నిమిత్తం లేకుండా స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలి.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందు త్రయీధ్యాయ స్సమాప్త:
9. మన ఇతిహాసాలు శంతనుడు
శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన సూర్యవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు మరియు కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు.
*గంగాదేవి
ఒకరోజు శంతనుడు గంగా నదీ పరిసర ప్రాంతాల్లో విహరించుచుండగా ఒక అందమైన కన్యను చూశాడు. ఆమెను వివాహ మాడదలచి ఆమెను అనుమతి కోరాడు. అప్పుడు ఆమె తను ఏమి చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండేటట్లయితే వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదని షరతు పెట్టింది. అందుకు ఒప్పుకున్న శంతనుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె ఒక పుత్రునికి జన్మనిచ్చింది. ఆమె ఆ శిశువును గంగా గర్భంలో వదలి వేసింది. కానీ ఆమె పెట్టిన షరతును అనుసరించి ఏమీ అడగలేదు. కొంత కాలానికి మరో పుత్రుడు జన్మించాడు. ఆమె ఆ శిశువును కూడా అలాగే గంగార్పణం కావించింది. ఇలా ఏడుగురు పుత్రులను గంగలో వదిలి పెట్టింది. ఎనిమదవ శిశువును కూడా ఆమె అలాగే ముంచివేయడానికి ప్రయత్నించగా కుతూహలం ఆపుకోలేని శంతనుడు ఆమెను ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దాంతో ఆమె షరతుకు భంగం కలిగి ఎనిమదవ శిశువును అలాగే బ్రతకనిచ్చింది. ఆ ఎనిమదవ శిశువే దేవవ్రతుడైనాడు. తర్వాత భీష్ముడిగా పేరుగాంచాడు.
*బ్రహ్మశాపంతో శంతనుడు జన్మించుట
తన మునుపటి జన్మలో, ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన మహాభిషుడు అనే శక్తివంతమైన రాజు ఉన్నాడు. మహాభిషుడు అనేక సద్గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు. మహాభిషుడు వెయ్యి అశ్వమేధ యగాలు, వంద రాజసూయ యగాలు (చక్రవర్తిగా అర్హత సాధించిన తరువాత) చేసిన తరువాత, ఆయన మరణించిన తరువాత స్వర్గలోకం చేరుకున్నాడు. ఒకసారి ఆయనకు బ్రహ్మ ఆస్థానాన్ని సందర్శించే అవకాశం లభించింది. అక్కడ దేవతలు, ఋషులు అందరూ కూడా ఉన్నారు.ఋషులు, దేవతలు అందరూ బ్రహ్మను ఆరాధిస్తుండగా గంగాదేవి బ్రహ్మసభలో ప్రవేశిందింది. ఆమె సభలో ప్రవేశిస్తున్న తరుణంలో ఒక గాలితరగం వీచి, గంగాదేవి పైటచెరగు ఆమె శరీరం నుండి వైదొలిగింది. అది చూసిన సభుకులలో మహాభీషుడు మినహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తలలను వంచుకున్నారు. మహాభీషుడు మాత్రం ఆమెను కామంతో అలా చూస్తూనే ఉండిపోయాడు. ఈ చర్యను చూసిన బ్రహ్మ తన నిగ్రహాన్ని కోల్పోయాడు ఆగ్రహించి అతి పవిత్రమైన బ్రహ్మసభలో సభామర్యాద విస్మరించి కాముఖంగా ప్రవర్తించినందుకు ఆయనను మనుష్యలోకంలో మానవునిగా జన్మించమని శపించాడు. ఈ చర్యను ఆస్వాదించిన గంగా మానవుడిగా తనకారణంగా శాపగ్రస్థుడైన మహాభిష హృదయాన్ని మహాభిషుని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని భూలోకానికి బయలుదేరింది. మహాభిషుడు తాను భూలోకంలో ప్రతీప కుమారుడిగా జన్మించాలని కోరికున్నాడు.కురురాజు ప్రతిపుడు ఒకసారి గంగాతీరంలో ధ్యానం చేస్తున్న సమయంలో గంగా ఒక అందమైన మహిళ రూపాన్ని ధరించి రాజు దగ్గరికి వచ్చి అతని కుడి తొడ మీద కూర్చున్నది. ప్రదీపుడు ఆమెను చూసి ఏమి కావాలని అడిగగానే గంగా ప్రదీపుడితో తనను వివాహం చేసుకొమ్మని కోరింది. ప్రదీపుడు తాను భార్యమినహా ఎవరిపట్ల కామమోతుడు కానని ప్రతిజ్ఞ చేసానని అందువలన ఆమె కోరికను అంగీకరించలేనని, ఆమె తన కుడి తొడ మీద కూర్చుంది కనుక సంప్రదాయాల అనుసరించి ఆమె తనకు కుమార్తె లేదా కోడలు ఔతుందని, ఎడమ తొడ మీద కూర్చుంటేనే భార్య కాగల అవకాశం ఉంటుందని చెప్పి ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అయినప్పటికీ ఆమె తన కుమారుని చేసుకుని తనకు కోడలు కావచ్చునని చెప్పాడు. అందుకు గంగాదేవి అంగీకరించింది.ప్రతిపమహారాజుకు ఆయన భార్య సునందకు వారి వృద్ధాప్యంలో ఒక బిడ్డ మగ జన్మించాడు. కుమారుడు జన్మించిన తరువాత తన కోరికలను తపస్సు ద్వారా శాంతింపజేసాడు కనుక అతనికి ప్రదీపుడు శంతనుడు అని పేరు పెట్టాడు. ప్రతిపుడు అప్పుడు శంతనుడిని హస్తినాపుర రాజుగా నియమించి తాను తపస్సు చేయటానికి అడవులలోకి వెళ్ళాడు. శంతనుడి కంటే పెద్దవాడు అయిన బాహ్లికుడు కూడా శంతనుడికి హస్తినాపుర రాజు కావడానికి అనుమతి ఇచ్చాడు.
10. నేటి ఆణిముత్యం
దానముచేయనేరని యధార్మికు సంపద యుండియుండియున్
దానె పలాయనం బగుట, తధ్యము; బూరుగుమాను గాచినన్
దానిఫలంబు లూరక వృథా పడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁ గాక యభోజ్యము లౌట భాస్కరా!
భావం:
ధర్మం చేయనివానికి గల సంపదలు వాటంతటవే నశిస్తాయి. బూరుగు చెట్టు కాయలు ఎంత రమణీయంగా కాచినా, ఎవరికీ భుజింపతగనివి అవటం వలన ఊరకనే రాలిపోతాయిగానీ ఉపయోగంలేదు కదా?
11. నేటి సామెత
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
తాను మంచిగా వుంటే ఎదుటివారుకూడ మంచిగానె వుంటారని అర్థం. అందరూ స్నేహ భావంతో వుండాలని అర్థం ఈ సామెతలో ఉంది.
12. నేటి సుభాషితం
మనిషి కొంతకాలం పాటు కాలాన్ని వృథా చేస్తే, ఆ తర్వాత అంతవరకూ వృథా అయిన కాలమే ఆ మనిషి జీవితాన్ని అన్నివిధాలుగా నష్టపరుస్తుంది.
13. నేటి మంచి మాట
” కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది.
ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారమవుతుంది. ”
14. శ్రీరస్తు శుభమస్తు
తేది : 30, అక్టోబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : సౌమ్యవాసరే (బుధవారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 48 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 2 ని॥ వరకు తదియ తిధి తదుపరి చవితి తిధి)
నక్షత్రం : అనూరాధ
(నిన్న రాత్రి 11 గం॥ 11 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 59 ని॥ వరకు అనూరాధ నక్షత్రం తదుపరి జ్యేష్ఠ నక్షత్రం )
యోగము : (సౌభాగ్య ఈరోజు మధ్యాహ్నం 12 గం ll 5 ని ll వరకు తదుపరి శోభనం రేపు ఉదయం 9 గం ll 42 ని ll వరకు)
కరణం : (తైతుల ఈరోజు మధ్యాహ్నం 2 గం ll 55 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు ఉదయం 11 గం ll 59 ని ll )
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 3 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ( ఈరోజు తెల్లవారుజాము 2 గం ll 59 ని ll నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం ll 30 ని ll వరకు మరియు ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 37 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 9 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 11 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 25 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 59 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 08 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 14 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 46 ని॥ లకు
సూర్యరాశి : తుల ⚖
చంద్రరాశి : వృచ్చికము
15. తిరుమల \|/ సమాచారం *
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు బుదవారం,
30.10.2019
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 19C°-21℃°
• నిన్న 78,885 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 18
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
12 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 25,652 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.77 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి