Sports

ఆరోపణలు అంగీకరించిన షకీబ్.రెండేళ్లు నిషేధం.

Shakib Al Hasan Banned Two Years For Meeting With Bookies-ఆరోపణలు అంగీకరించిన షకీబ్.రెండేళ్లు నిషేధం.

బంగ్లాదేశ్‌ టెస్టు, టీ20 సారథి షకిబ్‌ అల్‌ హసన్‌పై ఐసీసీ వేటు వేసింది. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్ల నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం నమోదు చేసిన అభియోగాలను షకిబ్‌ అంగీకరించాడు. అతడిపై ఒక ఏడాది పూర్తిగా నిషేధం, మరో ఏడాది సస్పెన్షన్‌ ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. 2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకిబ్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. 2018 ఐపీఎల్‌ సందర్భంలో 2018 ఏప్రిల్‌ 26న సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా బుకీలు సంప్రదించడాన్నీ వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకిబ్‌ తన తప్పులను అంగీకరించాడు. నిషేధం నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు అతడు దూరమవుతాడు. 2020 అక్టోబర్‌ 29 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు మాత్రం ఐసీసీ అనుమతి ఇచ్చింది. తన తప్పును అంగీకరించిన షకిబ్‌ యువ ఆటగాళ్లకు అవగాహన కల్పించే అంశంలో భాగమవుతానని ప్రకటించాడని ఐసీసీ జీఎం అలెక్స్‌ మార్షల్‌ అన్నారు. అతడి ప్రతిపాదనను అంగీకరించామని వెల్లడించారు. షకిబ్‌పై నిషేధంతో టీమిండియాతో సిరీసులకు బంగ్లాదేశ్‌ కొత్త జట్లను ప్రకటించే అవకాశం ఉంది. టెస్టు సారథిగా ముష్ఫికర్‌ రహీమ్‌, టీ20 సారథిగా మొసాదిక్ హుస్సేన్‌ను బీసీబీ ఎంపిక చేసిందని సమాచారం. నవంబర్‌ 3 నుంచి పర్యటన ఆరంభమవుతుంది.