బాబుగారు మీరు మారాలి.. మీ పద్ధతి మార్చుకోవాలి.. పనిచేసే కార్యకర్తలను గుర్తించాలి. మెతక వైఖరి, నాన్చుడు విధానం విడనాడాలి. సరైన నిర్ణయాలు తీసుకుంటే పార్టీ పటిష్ఠంగా ఉంటుంది..’ అంటూ పలువురు కార్యకర్తలు ఏకరువు పెట్టారు. ‘ఇక నుంచి నిశితంగా పరిశీలిస్తా.. పనిచేసేవారికి గుర్తింపు ఉంటుంది. యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తాను. ఎన్నికలు లక్ష్యంగా ఓట్లు సాధించే నాయకులకు అవకాశాలు వస్తాయి. నేను చేసిన పొరపాట్లు మళ్లీ దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. మీరు కూడా పార్టీ లక్ష్యంగా పనిచేయాలి’ అని అధినేత చంద్రబాబునాయుడు సూచనలు చేశారు. కృష్ణా జిల్లా నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు విజయవాడలో మంగళవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. తొలి రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు పెడన, కైకలూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, తిరువూరు నియోజవకర్గాల సమీక్ష సమావేశాలు జరిగాయి. ఒకొక్క నియోజకవర్గానికి గంట నుంచి గంటన్నర పాటు కేటాయించి నిశితంగా సమీక్షిస్తున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇచ్చి వాస్తవాలు చెప్పాలని సూచిస్తున్నారు. తర్వాత తాను గుర్తించిన అంశాలు వివరిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కోరీతిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాయకుల అలసత్వం వల్ల ఓటమి చెందామని పలువురు అభిప్రాయపడ్డారు. అంతా చంద్రబాబు చూసుకుంటారని వదిలివేశారని కార్యకర్తలు చెప్పుకొచ్చారు. గట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
**అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం..!
పెడన నియోజకవర్గంలో అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం వల్ల ఓటమి చెందామని అక్కడి నాయకులు చెప్పారు. పెడన సమీక్షలో కార్యకర్తలు మాట్లాడుతూ కాగిత వెంకట్రావ్ కుమారుడు కృష్ణప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించడంలో జాప్యం జరిగిందని, దీనివల్ల నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో పార్టీని కూడా పట్టించుకోలేదని కొంతమంది ఆయన దృష్టికి తెచ్చారు. పెడన నియోజకవర్గంలో జనసేన పోటీ చేయడం వల్ల తెదేపాకు భారీగా నష్టం కలిగిందని అభిప్రాయపడ్డారు. జనసేన అభ్యర్థికి ఓట్ల శాతం ఎక్కువగా ఉందని గుర్తు చేశారు.డబ్బు ప్రభావం చూపిందని కొంతమంది చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థత చాటాలని చంద్రబాబు సూచించారు. సమావేశంలో వేదవ్యాస్, కృష్ణప్రసాద్, నేతలు వేణుగోపాల్‌రావు, శ్యామలయ్య తదితరులు పాల్గొన్నారు.
**భాజపాను గెలిపించి…!
2014 ఎన్నికల్లో మిత్రపక్షం అయిన భాజపాను గెలిపించి 2019లో సొంత పార్టీని ఎలా ఓడించారని కైకలూరు నియోజకవర్గం నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. దానికి డబ్బు ప్రభావం చూపిందని కైకలూరు నేతలు సమాధానం ఇచ్చారు. కేవలం డబ్బు మాత్రమే కాదని చిత్తశుద్ధితో నాయకత్వం పని చేయాలని చంద్రబాబు చూసించారు.
**నిజాయతీ లోపించింది..!
నాయకుల మధ్య నిజాయతీ లోపించిందని మచిలీపట్నం నియోజకవర్గం కార్యకర్తలు ఆరోపించారు. సమన్వయం లేకపోవడం వల్ల ఓటమి చెందామన్నారు. ఇక్కడ మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్ర ఓటమి చెందారు. 505 రోజుల పాటు దీక్షలు చేసి పోర్టు సాధించామని గుర్తు చేశారు. మచిలీపట్నం అభివృద్ధికి ఎంతో కృషి చేశామని చంద్రబాబు వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయినా పార్టీ సమావేశాలు జరగలేదని కొంతమంది చంద్రబాబు దృష్టికి తెచ్చారు. నాయకుల మధ్య అనైక్యత, చంద్రబాబు చేస్తారులే అన్న భరోసా, నిజాయతీ లేకపోవడం ఓటమికి కారణాలుగా చెప్పారు.
**2024 ఎన్నికలపై దృష్టి సారించాలి..!
వచ్చే సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచి దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జగ్గయ్యపేట కార్యకర్తలకు సూచించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం సమీక్ష సమావేశాంలోనూ ఆయన గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలను పరిశీలించి తగ్గడంపై ప్రశ్నించారు. 2022 జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు ఉంటే దానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. జగ్గయ్యపేట తెదేపాకు పెట్టని కోట అని కార్యకర్తలు నాయకులు సమన్వయంతో సరైన ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.
**పటిష్ఠ కార్యాచరణతో ముందుకు సాగాలి
వచ్చే ఎన్నికలకు పటిష్ఠ కార్యాచరణతో ముందుకు సాగాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెదేపా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం రాత్రి తిరువూరు నియోజకవర్గంపై ఆయన సమీక్ష నిర్వహించారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో తిరువూరులో తెలుగుదేశం గెలవలేక పోవడంపై బాబు ప్రశ్నించారు. నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య సమన్వయం ఉండాలన్నారు. నియోజకవర్గంలో ఓట్లు ఆర్జించే శక్తి కల్గిన నాయకత్వానికి ప్రాధాన్యం ఉండాలని చెప్పారు. మాజీ మంత్రి కె.ఎస్.జవహర్, నల్లగట్ల స్వామిదాసు, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్యలు సమీక్షలో పాల్గొన్నారు.
చంద్రబాబు నువ్వు మారాలి..కార్యకర్తల డిమాండ్
Related tags :