బిలియనీర్ ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ప్రత్యర్థులకు మరోమారు షాకిచ్చింది. ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి, పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమను ఈ ఊబిలో నుంచి బయటపడేసే ఉద్దీపన చర్యలు ప్రసాదించాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకున్నాయి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే, ఇప్పుడు వీటికి షాకిచ్చేలా కేంద్రానికి జియో లేఖ రాసింది. టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాసిన లేఖలో జియో.. వాటి అభ్యర్థనను పట్టించుకోవద్దని, అలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటించొద్దని, అలా చేస్తే మున్ముందు మరిన్ని సంస్థలు క్యూకడతాయని హెచ్చరించింది.
రూ.1.3 లక్షల కోట్లతోపాటు వార్షిక స్థూల రాబడి (ఏజీఆర్)పై వడ్డీతో సహా చెల్లించాలని టెలికం కంపెనీలను సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) మంగళవారం ప్రభుత్వం నుంచి ఉద్దీపన కోరింది. దీంతో స్పందించిన జియో.. ‘‘సుప్రీంకోర్టు తీర్పుపై ఆర్థిక ఉపశమనం కోసం సీవోఏఐ చేసిన డిమాండ్‌ను తిరస్కరించాలి. స్పెక్ట్రం చెల్లింపులు సహా అన్ని బకాయిలను మూడు నెలల కాల వ్యవధిలో చెల్లించడాన్ని తప్పనిసరి చేయాలి’’ అని కేంద్రమంత్రికి లేఖ రాసింది. ఈ డిమాండ్‌ను కనుక అంగీకరిస్తే అన్ని రంగాల నుంచి ఇలాంటి డిమాండ్లే వస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
భారతీ ఎయిర్‌టెల్ దాదాపు రూ.41,507 కోట్లు టెలికం శాఖకు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రూ.22,000 కోట్లు లైసెన్స్ ఫీజు. మిగతాది జరిమానా, వడ్డీ ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా రూ.29,000 కోట్లు లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా, జరిమానా, వడ్డీ అదనం. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.