అమెరికాలో తెలుగు భాషకు బలం పెరుగుతోంది. గత ఎనిమిదేళ్లలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక ఎప్పటిలాగే అమెరికాలో ఎక్కువ మంది మాట్లాడే భారతీయ భాషగా హిందీ ప్రథమ స్థానంలో నిలిచింది. యూఎస్ సెన్సస్ బ్యూరో ఇటీవల 2018 సంవత్సరానికి గానూ అమెరికన్ కమ్యూనిటీ సర్వే నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం అమెరికాలో 6.7కోట్ల మంది తమ నివాసాల్లో ఆంగ్లం కాకుండా మరో భాషను మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఇక భారతీయ భాషల విషయానికొస్తే హిందీ పాపులర్ భాషగా నిలిచింది. ఆ తర్వాత గుజరాతీ భాష రెండో స్థానంలో, తెలుగు మూడో స్థానంలో ఉన్నాయి. జులై 1, 2018 నాటికి అమెరికాలో 8.74 లక్షల మంది హిందీ మాట్లాడుతున్నట్లు సర్వే పేర్కొంది. 2010 నుంచి 2018 వరకు హిందీ మాట్లాడే వారి సంఖ్య 43.5శాతం పెరిగింది. ఇక ఈ ఎనిమిదేళ్లలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఏకంగా 79.5శాతం పెరిగినట్లు సర్వే వెల్లడించింది. 2010లో 2.23లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉండగా.. 2018 నాటికి ఆ సంఖ్య 4లక్షలకు చేరింది. అయితే 2017తో పోలిస్తే తెలుగు మాట్లాడేవారి సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు సర్వే పేర్కొంది. 2017 నాటికి 4.15 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉండగా.. గతేడాదిలో అది 3.7శాతం తగ్గింది. ఇక ఎనిమిదేళ్లలో బెంగాలీ మాట్లాడే వారు 68శాతం, తమిళం మాట్లాడే వారు 67.5శాతం పెరిగినట్లు సర్వే తెలిపింది.
అమెరికాలో 79శాతం పెరిగిన తెలుగు మాట్లాడే వారు
Related tags :