ScienceAndTech

13లక్షల క్రెడిట్ కార్డుల వివరాలు వేలం

13Lakh Credit Cards Information Up For Sale In Dark Web

సుమారుగ 13 లక్షల మంది భారతీయులకు సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంచినట్టు సమాచారం. ఈ వివరాలన్నీ డార్క్ వెబ్లో ‘జోకర్స్ స్టాష్’ అనే సంస్థ కొనుగోలుకు ఉంచిందని గ్రూప్ ఐబీ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ‘ఇండియా-మిక్స్-న్యూ-01’ పేరుతో జోకర్ స్టాష్ డార్క్ వెబ్లో కార్డుల అమ్మకాల గురించి ప్రకటన ఇస్తున్నట్లుగా గ్రూప్ ఐబీ పేర్కొంది. ఏటిఎం కేంద్రాల్లో అమర్చిన స్కిమ్మింగ్ పరికరాలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రాల ద్వారా ఈ వివరాలు తస్కరించినట్లుగా పరిశోధకులు భావిస్తున్నారు. ఒక్కో కార్డు సంబంధించిన వివరాలను వంద డాలర్లకు విక్రయానికి ఉంచినట్లు సంస్థ తెలిపింది. తాజాగా దీనిపై ఆర్బీఐ స్పందించినట్లు సమాచారం. తాజాగా వస్తోన్న ఆరోపణలు నిజమని తెలితే ఖాతాదారులకు కొత్త కార్డులు జారీ చేయాలని ఆదేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఖాతాదారుల డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ డేటా సురక్షితంగా ఉండేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.డార్క్ వెబ్ నుంచి సైబర్ నేరస్తులు ఇలాంటి డేటాను కొనుగోలు చేసి క్లోనింగ్ ద్వారా నకిలీ కార్డులు రూపొందిస్తారు. అలా తయారు చేసిన నకిలీ కార్డుల సహాయంతో ఏటిఎంల నుంచి దర్జాగా నగదు విత్డ్రా చేస్తారు. గత ఐదు సంవత్సరాలలో జోకర్స్ స్టాష్ ఎక్కువగా టార్గెట్, వాల్మార్ట్, సాక్స్ ఫిఫ్త్ అవెన్యూ, లార్డ్ అండ్ టేలర్, బ్రిటీష్ ఎయిర్వేస్ వంటి సంస్థల నుంచే క్రెడిట్ కార్డుల వివరాలు తస్కరించింది. మొదటిసారిగా ఆగస్టు 22న జోకర్స్ స్టాష్ పెంట్రోల్ బంకుల్లోని పీవోఎస్ యంత్రాల ద్వారా సేకరించిన క్రెడిట్ కార్డ్ వివరాలు అమ్మకానికి ఉంచింది.