* మున్సిపల్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. న్యాయపరమైన చిక్కులు లేని 53 మున్సిపాల్టీలు/ కార్పొరేషన్లకు ఈ నెల 4న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మున్సిపాల్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులు ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది. శనివారం ఈసీకి రిజర్వేషన్ల వివరాలు అందజేస్తారని, సోమవారం నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. జవహర్‌నగర్, బడంగ్‌పేట, నిజాంపేట కార్పొరేషన్లతోపాటు 50 మున్సిపాల్టీల్లో ఈ నెల 19న పోలింగ్ నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్ ఒకట్రెండు రోజులు ఆలస్యమైతే 21లోగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
* జగన్ పాలనలో భయం భయంగా జనం: కన్నా
జగన్ ఐదు నెలల పాలనలో రాష్ట్ర ప్రజలు భయపడుతూ బతికారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. మరో నాలుగున్నరేళ్లు ఎలా ఉండాలో అని ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘మా పార్టీ వారిని కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాం. చట్టం ముందు అందరూ సమానమేనని ఈరోజు కోర్టు తీర్పుతో వెల్లడైంది. జగన్‌పై నమోదైన కేసు వ్యక్తిగత హోదాలోనే కదా? అయినా ప్రజల సమస్యలు తీర్చకుండా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎందుకు? మాకైతే అవతరణ వేడుకలకు ఎటువంటి ఆహ్వానం అందలేదు’’ అని తెలిపారు.
* కేసీఆర్‌తో నేను మాట్లాడతా: పవన్
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి పట్టు విడుపు ఉండాలని, సీఎం ఎందుకు కోపంగా ఉన్నారో తెలియడం లేదన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు గురువారం హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను కలిసి మిలియన్ మార్చ్ కు మద్దతివ్వాలని కోరారు. 27 రోజులుగా సమ్మె జరుగుతున్న తీరు, డిమాండ్లను పవన్‌కు వివరించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక కూడా ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు.
* ఈనెల 5న ఫడ్నవీస్ ప్రమాణం !
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్.. నవంబర్ 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా సమాచారం అందింది. స్వంతంగానే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనెల 6 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ నేతలంటున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించనున్నారు. కూటమి నుంచి శివసేన దూరంగా ఉన్నా.. బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్దమైంది. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల బాధ్యతలను బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్, చంద్రకాంత్ పాటిల్ తీసుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. అయితే అధికారాన్ని పంచుకోవాలన్న నిబంధనను శివసేన వత్తిడి చేయడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది.
* చట్టానికి ఎవరూ అతీతులు కారని మరోసారి రుజువైంది: సోమిరెడ్డి
జగన్‌పై సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టానికి ఎవరూ అతీతులు కారని మరోసారి రుజువైందన్నారు. ఒక్కసారి కోర్టుకు హాజరైతే ప్రభుత్వానికి రూ.60లక్షలు ఖర్చవుతుందని… సీఎం జగన్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. వ్యక్తిగత కేసులకు జగన్ ప్రభుత్వ సొమ్మును ఎందుకు వినియోగిస్తున్నారన్నారు. జగన్ కేసులను కోర్టులు త్వరితగతిన విచారించాలని సోమిరెడ్డి కోరారు.
* కేసీఆర్ నియంత.. ఆయనకు జ్ఞానం లేదు: పొన్నం ప్రభాకర్
కేసీఆర్ ఒక నియంత అని.. ఆయనకు జ్ఞానం లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కారణంగా50 వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయన్నారు. కార్మికులు చనిపోతుంటే.. కనికరం లేదా..? అని నిలదీశారు. పట్టు విడుపులు ఉండాలని.. కేసీఆర్‌కు ఇంత అహం పనికి రాదని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఝార్ఖండ్ ఎన్నికలకు మోగనున్న నగారా
దేశంలో మళ్లీ ఎన్నికల వాతావరణం మొదలుకానుంది. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు ఎన్నికల తేదీలు ప్రకటించనుంది. ఝార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం అక్కడ భాజపా అధికారంలో ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో కలిసి భాజపా 43 సీట్లలో గెలిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. భాజపా ఒక్కటే 37 స్థానాల్లో విజయం సాధించింది. అంతకుముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) గత ఎన్నికల్లో కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌కు 8 సీట్లు మాత్రమే రావడం గమనార్హం.
* పొరుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించిన జగన్
ఆరోగ్యశ్రీ పథకాన్ని పొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మూడు రాష్ట్రాలకు వర్తింపజేసే పోస్టర్‌ను సీఎం జగన్ శుక్రవారం ఆవిష్కరించారు. దీనిలో భాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో సుమారు 17 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు వైద్యసేవలు నేటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై ఏపీకి చెందిన రోగులు ఎవరైనా ఆయా నగరాల్లో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే అవకాశం కలగనుంది. 130 ఆస్పత్రుల్లో గుర్తించిన సూపర్ స్పెషాలిటీ సేవలను సీఎం జగన్ ఈరోజు ప్రారంభించారు.
* నల్గొండకు డ్రై పోర్టు: కేటీఆర్
తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. నల్గొండ జిల్లా దండుమల్కాపూర్‌లో నిర్మితమవుతున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పర్యావరణహితంగా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 శాతానికిపైగా ఉద్యోగావకాశాలు కల్పించేది ఎంఎస్‌ఎంఈ సంస్థ మాత్రమేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
* సింగపూర్ కన్సార్టియం రద్దెందుకు:యనమల
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆత్మహత్యలపై వైకాపా నాయకులు హేలనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను విమర్శించడానికే మంత్రులు పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా పాలనలో ఇసుక కొరత లేదని, కార్మికులకు చేతినిండా పని దొరికిందని గుర్తు చేశారు. సింగపూర్ కన్సార్టియం ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు.
*రాజ్యాంగాన్ని కాలరాయడమే
ఏపీ ప్రభుత్వ చీకటి జీవోపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజంప్రజాస్వామ్య చరిత్రలో మీడియాను అపహాస్యం చేయాలని, కట్టడి చేయాలని ప్రయత్నించిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారని, పిచ్చి ముదిరితేనే ఇలాంటి పనులు చేస్తారని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మీడియా స్వేచ్ఛను హరించేలా జీవో 2430 ఉందన్నారు. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2007లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇదేవిధంగా మీడియాను కట్టడి చేయాలని జీవో 938 తీసుకొచ్చారని, దానిపై అప్పట్లో ప్రజాస్వామ్యవాదులు, మీడియా సహా అన్నివర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని తెలిపారు.
*చెన్నమనేని పౌరసత్వంపై ముగిసిన విచారణ
వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్బాబు పౌరసత్వం కేసు తుది విచారణ కేంద్ర హోంశాఖలో బోర్డర్ మేనేజ్మెంట్ సెక్రటరీ ఎదుట గురువారం జరిగింది. పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరఫున న్యాయవాదులు రవికిరణ్రావు, రోహిత్ రావు.. రమేష్బాబు తరఫున న్యాయవాదులు వెంకటరమణ, రామారావు వాదనలు వినిపించారు. రమేష్బాబు భారతీయ పౌరసత్వం చెల్లదంటూ పిటిషనర్ ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు.
*రాజ్యసభ బీఏసీలో కేకే
రాజ్యసభలో ఎనిమిది కమిటీలను ఛైర్మన్ వెంకయ్యనాయుడు పునర్వ్యవస్థీకరించారు. పలు కమిటీలకు ఛైర్మన్లను మార్చడంతోపాటు వివిధ పార్టీలకు చెందిన సభ్యులకు కమిటీల్లో స్థానం కల్పించారు. ఈ మేరకు సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ బులెటిన్ విడుదల చేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీలకు ఛైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షత వహిస్తారు. తాజాగా ఏర్పాటు చేసిన బీఏసీలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, వినయ్ పి సహస్రబుద్దే, బీకే హరిప్రసాద్లున్నారు. పిటిషన్స్ కమిటీకి ప్రసన్న ఆచార్య ఛైర్మన్గా, ఎథిక్స్ కమిటీకి ప్రభాత్ ఝా ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్గా టి.సుబ్బరామిరెడ్డిని నియమించారు.ఈ కమిటీలో సభ్యునిగా వైకాపా నేత విజయసాయిరెడ్డిని నియమించారు. రూల్స్ కమిటీలో ఇటీవలే భాజపాలో చేరిన సుజనాచౌదరికి స్థానం కల్పించారు.
*భాజపా సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) పిలుపు మేరకు ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ఆందోళనల కోసం పార్టీ ముఖ్య నేతలకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు. మొత్తం 32 జిల్లాలకు ఇన్ఛార్జులను నియమిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా గురువారం జాబితా విడుదల చేశారు. హైదరాబాద్ బాధ్యతలను జానారెడ్డి, భట్టివిక్రమార్క, మర్రి శశిధర్రెడ్డిలకు కేటాయించారు. మిగతా జిల్లాలకు ఒక్కొక్కరి చొప్పున నియమించారు.
*ప్రతిపక్షమే లేకుండా చేయాలని కుట్ర: లోకేశ్
తెదేపా కార్యకర్తలు, నాయకులపై అధికార పార్టీ 610 తప్పుడు కేసులు బనాయించిందని, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని కుట్ర పన్నుతోందని, గత 5 నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయని మాజీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా జైలులో ఉన్న మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ను కలిశారు. తర్వాత పెదవేగి మండలం దుగ్గిరాలలోని చింతమనేని నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఏలూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని, పోలవరం నిర్మాణం, ఇసుక సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్ష పార్టీని అణచే పనిలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని విమర్శించారు. తెదేపా నాయకులను గ్రామాలు వదిలివెళ్లేలా ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబరు 6 నుంచి 10 మధ్య చింతమనేనిపై 12 తప్పుడు కేసులు పెట్టారన్నారు.
*జగన్ అవినీతికి ఆ వ్యాఖ్యలే నిదర్శనం: జవహర్
‘విశాఖలో ఏసీబీ అధికారుల కంటే దోపిడీ దొంగలే నయం’ అని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించడమే ముఖ్యమంత్రి జగన్ అవినీతి పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శించారు. అవినీతిపరుడి పాలనలో ఉన్నందునే వ్యవస్థలన్నీ అవినీతిమయం అవుతున్నాయని గురువారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
*4న తెదేపా విస్తృత స్థాయి సమావేశం
తెదేపా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 4న విజయవాడలోని ఏ1 కన్వెన్షన్లో జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొంటారు. 5న పార్టీ సంస్థాగత ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు.
*వైకాపా నేతలకు దోచిపెట్టేందుకే.. మరోసారి క్విడ్ ప్రొకోకు తెరలేపారు: అమరనాథ్రెడ్డి
ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరకు వైకాపా నేతలకు కట్టబెట్టేందుకే ‘మిషన్ బిల్డ్ ఏపీ’ పేరుతో భూ కుంభకోణానికి సీఎం జగన్ తెరలేపారని తెదేపా నేత, మాజీ మంత్రి అమరనాథ్రెడ్డి ఆరోపించారు. సంపద సృష్టించి ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సింది పోయి సంపదనిచ్చే వనరులను అమ్మేందుకు సిద్ధపడుతూ మరోసారి క్విడ్ప్రోకోకు తెరలేపారని మండిపడ్డారు.
*చంద్రబాబుతో వేదికలను పంచుకోం: భాజపా
చంద్రబాబు నాయుడు ఏ వేదికపై ఉన్నా…భాజపా దూరంగానే ఉంటుందని, చంద్రబాబు అటు కాకపోతే.. ఇటు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్ స్పష్టం చేశారు. విజయవాడలో రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఇసుక సమస్యపై నవంబరు 3న విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ లాంగ్మార్చ్ నిర్వహిస్తున్నారు. ఆయన మా పార్టీ వేదికపై పాల్గొనేందుకు వస్తే ఆహ్వానిస్తాం’ అని వెల్లడించారు. పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్రెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో పవన్ పోరాటం వెనుక చంద్రబాబు ఉన్నారన్నారు. నవంబరు 4న ఇసుక సమస్యపై భాజపా రాష్ట్రస్థాయిలో ఆందోళనలు చేస్తుందన్నారు.
* రెండు విడతల్లో మున్సి‘పోల్స్’?
మున్సిపల్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. న్యాయపరమైన చిక్కులు లేని 53 మున్సిపాల్టీలు/ కార్పొరేషన్లకు ఈ నెల 4న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మున్సిపాల్టీలకు సంబంధించిన రిజర్వేషన్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులు ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది. శనివారం ఈసీకి రిజర్వేషన్ల వివరాలు అందజేస్తారని, సోమవారం నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. జవహర్‌నగర్, బడంగ్‌పేట, నిజాంపేట కార్పొరేషన్లతోపాటు 50 మున్సిపాల్టీల్లో ఈ నెల 19న పోలింగ్ నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్ ఒకట్రెండు రోజులు ఆలస్యమైతే 21లోగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
రెండు విడతల్లో మున్సిపాలిటీ ఎన్నికలు-రాజకీయం-11/01
Related tags :