* వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. గత నెలకుగాను రూ. 95,380 కోట్లు మాత్రమే వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,00,710 కోట్లతో పోలిస్తే 5.29 శాతం తక్కువ. లక్ష కోట్ల కంటే తక్కువగా వసూలవడం ఇది వరుసగా మూడోనెల. పండుగ సీజన్‌లోనూ వసూళ్లు దిగువకు పడిపోయాయి. కానీ, సెప్టెంబర్‌లో వసూలైన రూ.91,916 కోట్లతో పోలిస్తే మాత్రం ఆ మరుసటి నెలలో పెరగడం విశేషం.
* ఉజ్బెకిస్తాన్‌లోని తస్కెంట్‌లో షాంఘై సహకార సంస్థ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రజలను ఏకం చేసేందుకు ఆర్థిక సహకారం పునాదిలా పనిచేస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఆ పునాదే ఉత్తమ జీవితాన్ని అందిస్తుందన్నారు. ఇది చాలా కీలకమైన అంశమని రాజ్‌నాథ్ తెలిపారు.
* ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్‌ఎక్స్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమం ట్విటర్ నుంచి వైదొలగుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘ట్విటర్ ఎంతవరకు మంచిదో చెప్పలేను’ అంటూ వ్యాఖ్యానించారు. దీని కంటే సోషల్ నెట్‌వర్కింగ్ ‘రెడ్డిట్’ బాగుందంటూ ట్వీట్ చేశారు. గతంలో తాను చేసిన పలు ట్వీట్లు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. బహుశా ఆయన ట్విటర్ నుంచి తొలగిపోవడానికి అదే కారణం అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన నిర్ణయంపై అభిమానులు విచారం వ్యక్తం చేశారు. తర్వాత అందుబాటులో ఉండే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం ఏంటో తెలియజేయాలని కోరారు. గత జులైలోనూ ఆయన ఓసారి తన ట్విటర్ ఖాతాను మూసివేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. అయితే, అది ఇప్పటి వరకు యాక్టివ్‌గానే ఉండడం గమనార్హం.
* మార్కెట్ లో బంగారం, వెండి ధరలు. వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,580, విజయవాడలో రూ.38,950, విశాఖపట్నంలో రూ.40,090, ప్రొద్దుటూరులో రూ.39,050, చెన్నైలో రూ.38,760గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,780, విజయవాడలో రూ.36,100, విశాఖపట్నంలో రూ.36,880, ప్రొద్దుటూరులో రూ.36,150, చెన్నైలో రూ.37,130గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.46,700, విజయవాడలో రూ.48,000, విశాఖపట్నంలో రూ.48,100, ప్రొద్దుటూరులో రూ.47,700, చెన్నైలో రూ.50,600 వద్ద ముగిసింది.