ScienceAndTech

మీ ఫోనుపై స్పైవేర్ దాడిని ఎలా నిరోధించవచ్చు?

How to beat spyware apps installed on your mobile?

టెక్నాలజీ పుణ్యమా అని ప్రస్తుతం మనం స్మార్ట్‌ఫోన్ల ద్వారానే అనేక పనులు చేసుకుంటున్నాం.

ఎంటర్‌టైన్‌మెంట్, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, ఫొటోలు, వీడియోలు చిత్రీకరించుకోవడంతోపాటు బ్యాంకింగ్ లావాదేవీలను కూడా స్మార్ట్‌ఫోన్లలో మనం నిర్వహిస్తున్నాం.

అయితే టెక్నాలజీ వల్ల మనం ఎంత లాభపడుతున్నామో..దాంతో మనం అంతే నష్టపోతున్నాం.

స్మార్ట్‌ఫోన్లలో నిక్షిప్తం అయి ఉండే మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాలతోపాటు బ్యాంకింగ్ సమాచారాన్ని దుండగులు చోరీ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వాట్సాప్ ద్వారా స్పైవేర్‌లను వ్యాప్తి చేస్తూ కేటుగాళ్లు నూతన తరహా సమాచార దోపిడీకి పాల్పడుతున్నారు.

ఇతరుల ఫోన్లలో వారు ఏమేం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఇంతకు ముందు వారి ఫోన్లను తీసుకుని వాటిల్లో వారికి తెలియకుండా స్పైవేర్ యాప్స్ ఇన్‌స్టాల్ చేయాల్సి వచ్చేది.

కానీ ఇప్పుడు హ్యాకర్లు ఆ అవసరం లేకుండానే ప్రపంచంలో ఏదో ఒక మూల నుంచి వినియోగదారుల ఫోన్లకు వాట్సాప్‌లో పలు లింక్‌లకు చెందిన మెసేజ్‌లను పంపుతూ యూజర్లు వాటిని ఓపెన్ చేసేలా చేస్తున్నారు.

దీంతో ఆ ఫోన్లలో స్పైవేర్ వ్యాప్తి చెందుతోంది. ఆ తరువాత వినియోగదారుల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తోంది.

ప్రస్తుతం ఇలాంటి యాప్స్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో లేవు కానీ.. కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్లలో లభిస్తున్నాయి. 

స్పైవేర్ యాప్స్‌లో ఎక్స్‌ఎన్‌స్పై (XNSPY), స్పైజీ (Spyzie), ఫ్లెక్సిస్పై (Flexispy), మొబిస్టెల్త్ (Mobistealth), మొబైల్ స్పై (Mobile Spy), స్పైఎరా (SpyEra), హైస్టర్ మొబైల్ (Highster Mobile), ఫోన్ షెరిఫ్ (PhoneSheriff), ది ట్రూత్ స్పై (The Truth Spy), బ్లర్ స్పై (Blurspy) తదితర యాప్స్ థర్డ్‌పార్టీ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.

వీటిల్లో కొన్ని యాప్స్‌ను కేవలం డబ్బులు చెల్లిస్తేనే వాడుకోగలరు. అలాగే కొన్ని యాప్స్ ట్రయల్ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి.

ఈ యాప్స్‌ను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేస్తే అవి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న విషయం కూడా యూజర్లకు తెలియదు.

ఇక ఆ తరువాత నుంచి ఫోన్‌లో ఉన్న సమాచారాన్నంతా ఈ యాప్స్ ద్వారా అవతలి వ్యక్తులు రిమోట్‌గా సేకరించే అవకాశం ఉంటుంది.

అయితే స్పైవేర్ యాప్స్‌కు అడ్డుకట్ట వేయాలంటే యాంటీ స్పైవేర్ యాప్స్‌ను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుని ఫోన్లను ఎప్పటికప్పుడు ఆ యాప్‌లతో స్కాన్ చేసుకోవాలని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

యూజర్లు తమ ఫోన్లలో స్పైవేర్ ఉందని భావించినా లేదా స్పైవేర్ వస్తుందని అనుమానం ఉన్నా..యాంటీ స్పైవేర్ యాప్స్‌ను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుని వాటితో ఫోన్లపై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలని వారంటున్నారు.

ఈ క్రమంలోనే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో ప్రస్తుతం మనకు అనేక యాంటీ స్పైవేర్ యాప్స్ లభిస్తున్నాయి.

వాటిలో.. మాల్‌వేర్‌బైట్స్‌కు చెందిన సెక్యూరిటీ, వైరస్ క్లీనర్ యాప్, కాస్పర్ స్కై మొబైల్ యాంటీ వైరస్, వెబ్ సెక్యూరిటీ యాప్, అవాస్ట్, ఏవీజీ, నార్టన్ మొబైల్ సెక్యూరిటీ, అవీరా యాంటీ వైరస్ యాప్‌లు ప్రధానమైనవి.

కాగా ఈ యాప్స్‌తో యూజర్లు తమ ఫోన్లలో ఉన్న స్పైవేర్ యాప్స్‌ను తొలగించి ఫోన్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు.