DailyDose

అసాంజె హత్యకు కుట్ర-తాజావార్తలు-11/02

Julian Assange To Be Killed-Telugu Breaking News Today-11/02

* తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆర్టీసీ సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ విభజన జరగలేదని, తాము ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీలోనే ఉన్నామని చెప్పారు. అందువల్ల ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జరగదని, కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆర్టీసీ ఐకాస నేతలు, విపక్ష నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె తదుపరి కార్యాచరణను ప్రకటించారు.

* ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్న కార్మికుల బాధలు చూడలేకే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ర్యాలీ చేస్తున్నారని ఆ పార్టీనేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. గత ప్రభుత్వ ఇసుక విధానంపై అనేక విమర్శలు చేసిన జగన్‌.. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక సరఫరా ఆపేశారని ఆరోపించారు. పవన్‌ ఆందోళనలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు విశాఖలో తలపెట్టిన లాంగ్‌ మార్చ్‌ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు వీవీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

* కరీంనగర్‌ ఘటనపై ఎంపీ బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, డీజీపీ తీరుపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్‌ బాబు అంతిమయాత్రలో పోలీసులు తనపై దాడి చేశారని, పోలీసుల తీరుపై పార్లమెంట్‌లో హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తానని సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.

* గత ఐదేళ్లుగా తెదేపా అనుబంధ పార్టీగానే జనసేన నడుస్తోందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. ఇసుక కొరతపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ విశాఖలో లాంగ్‌మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అనిల్‌కుమార్‌ స్పందించారు. పవన్‌ చేపడుతోంది లాంగ్‌ మార్చ్‌ కాదు.. రాంగ్‌ మార్చ్‌ అని ఎద్దేవాచేశారు. చంద్రబాబు పిలుపు ఇవ్వగానే జనసేన ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. ఏర్పేడు ఘటన బాధితులను కనీసం పవన్‌ పలకరించారా?అని అనిల్‌ కుమార్‌ ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్‌ దత్తపుత్రుడిగా మారారని ఎద్దేవాచేశారు.

* చంద్రయాన్‌-2తో కథ ముగియలేదని.. త్వరలో ‘సాఫ్ట్‌ ల్యాండింగ్‌’ని నిజం చేసి చూపుతామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్‌ శివన్‌ ధీమా వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో అనేక అత్యాధునిక శాటిలైట్‌లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. చంద్రయాన్‌-2 ప్రయోగం నుంచి సాంకేతికతపరంగా ఇస్రో ఎంతో అనుభవం గడించిందని తెలిపారు. దీంతో సమీప భవిష్యత్తులో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కలని నిజం చేసి తీరతామన్నారు. ఐఐటీ దిల్లీలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

* ‘ఆదాయపు పన్ను రీఫండ్‌ కోసం రిక్వెస్ట్‌ పెట్టండి’ అంటూ మీ మొబైల్‌కు ఏమైనా మెసేజ్‌ వచ్చిందా..? జాగ్రత్త! అది నకిలీ మెసేజ్‌. అలాంటివి వచ్చినప్పుడు వెంటనే సైబర్‌ అధికారులకు ఫిర్యాదు చేయండని హెచ్చరిస్తోంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. ఈ మేరకు ట్విటర్‌లో పేర్కొంది. ‘ఆదాయపు పన్ను రీఫండ్‌ కోసం రిక్వెస్ట్‌ పంపాలని ఐటీ శాఖ నుంచి ఏదైనా మెసేజ్‌ వచ్చిందా? ఆ మెసేజ్‌లు నకిలీవి. సైబర్‌ మోసగాళ్ల సరికొత్త పంథా ఇది. అలాంటివి వచ్చినప్పుడు అందులో ఇచ్చిన లింక్‌లను క్లిక్ చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయండి’ అని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది.

* వికీలీక్స్‌తో అమెరికా, బ్రిటన్‌ సహా అనేక దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన సమాచార విప్లవ యోధుడు జూలియన్‌ అసాంజేకు చికిత్స పేరుతో ఆయన ప్రాణాలను తీసేందుకు యత్నిస్తున్నారని ఐక్యరాజ్యసమితి హక్కుల నిపుణుడు నీల్స్‌ మెల్జర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు తలదాచుకున్న అసాంజేను, నీల్స్‌ లండన్‌ జైలులో మే 9న ఆఖరిసారిగా కలిశారు. అసాంజేను మానసిక హింసకు గురిచేస్తున్నారంటూ ఆయన అప్పుడే ఆరోపించారు.

* మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈనెల 7లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందన్న భాజపా నేత సుధీర్‌ ముంగంటివర్‌ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. రాష్ట్రపతిపాలన పేరిట భాజపా బెదిరింపులకు దిగుతోందా? అని శివసేన ప్రముఖనేత సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ ‘మహారాష్ట్రకు అవమానం. రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా?’ శీర్షికతో శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లోనూ శనివారం సంపాదకీయం ప్రచురించారు.

* సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ చమురు ఉత్పత్తి సంస్థ ఆరాంకో.. ఐపీవోకు వెళ్లేందుకు ఆ దేశ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఆరాంకో ఐపీవోపై ఆదివారం అధికారిక ప్రకటన చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆరాంకో మార్కెట్‌ విలువ 1.5 నుంచి 1.7 ట్రిలియన్‌ డాలర్ల మధ్య ఉంది. ఈ ఐపీవో ద్వారా ఆరాంకో 5శాతం షేర్లను విక్రయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.