ఆరు భాషల్లో వెలువడుతున్న సప్తగిరి మాసపత్రికలో బాలబాలికలకు సులభంగా అర్థమయ్యేరీతిలో భక్తి, ఆధ్యాత్మిక అంశాలతో ప్రత్యేక శీర్షిక ప్రారంభించాలని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో శనివారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు స్థానికాలయాల్లో హెర్బల్ క్లీనింగ్ పనులను వెంటనే చేపట్టాలన్నారు. తిరుమల, తిరుపతితోపాటు బయటి ప్రాంతాల్లోని టిటిడి ఆలయాల వద్ద మరింత పచ్చదనం పెంచాలని సూచించారు. ఇంజినీరింగ్ పనుల నాణ్యతను థర్డ్ పార్టీ సంస్థ ద్వారా పరిశీలించాలని, అప్పుడే నాణ్యతా ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపారు. విద్యాసంస్థల్లో హాస్టల్ భవనాలు, ఒంటిమిట్టలోని కల్యాణవేదిక, ఎస్వీబీసీ స్టూడియో, అవిలాల చెరువు అభివృద్ధి పనులు, శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయానికి గోపుర నిర్మాణం, తిరుమలలో మూడో విడత రింగ్ రోడ్డు పనులు, నారాయణగిరి ఉద్యానవనాల్లో క్యూలైన్లు, శ్రీవారి పుష్కరిణి అభివృద్ధి పనులు, బూందీ కిచెన్ కాంప్లెక్స్, బంజారాహిల్స్‌లో అర్చకుల క్వార్టర్ల నిర్మాణం తదితర పనుల పురోగతిపై సమీక్షించారు. అదేవిధంగా, హైదరాబాద్, కన్యాకుమారి, కురుక్షేత్రలోని శ్రీవారి ఆలయాల్లో అభివృద్ధి పనులు, వైజాగ్, సీతంపేటలో శ్రీవారి దివ్యక్షేత్రాల నిర్మాణం, అహ్మదాబాద్, కురుక్షేత్ర, భువనేశ్వర్, అమరావతి, భద్రాచలం, కందుకూరు, గూడూరులో కల్యాణమండపాల నిర్మాణంపై చర్చించారు.
తిరుమలలోని శ్రీవారి ఆలయ తూర్పు మాడ వీధిలో మరుగుదొడ్ల సంఖ్యను పెంచాలని ఇంజినీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. తిరుమలలో మూడో దశలో ఎక్కడెక్కడ సిసిటివిలు ఏర్పాటు చేయాలనే విషయమై అదనపు ఈవో, సివిఎస్‌వో కలిసి చర్చించాలన్నారు. ఇతర ప్రాంతాల్లోని టిటిడి ఆలయాల్లో సిసిటివిల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టిటిడిలో ఇ-ఆఫీస్‌ను మరింత పకడ్బందీగా అమలుచేయాలని, లీవు లెటర్లను కూడా ఇందులోనే పంపాలని సూచించారు. తిరుత్తణిలోని టిటిడి స్థలాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. చెన్నైతోపాటు ఇతర సమాచార కేంద్రాల్లో అంతర్గత ఆడిట్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. టిటిడి ప్రచురణలను పూర్తిగా పరిశీలించిన తరువాతే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, ఎఫ్ఏసిఏవో ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ జి.రామచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.