* వజ్రాల వ్యాపారి, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంటోంది. అతడికి చెందిన విలువైన 13 కార్లను ఈడీ వేలం వేయనుంది. ఇందులో రూ.2కోట్లకు పైగా విలువ చేసే కారు కూడా ఉంది. నవంబరు 7న ఈ వేలం జరగనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు లండన్లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విచారణ నవంబరు 6న జరగనుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈడీ మనీలాండరింగ్ చట్టం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇతడి ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది. అతడికి చెందిన విలువైన వాచ్‌లు, పెయింటింగ్స్, కార్లను వేలం వేసే విధంగా అనుమతి పొందింది. ఇందులో భాగంగా నవంబరు 7న వేలం నిర్వహించనుంది. 13 కార్లలో రెండు కార్లను మళ్లీ వేలం వేయనున్నారు. ఇందులో రోల్స్‌రాయిస్ ఘోస్ట్ రూ.1.70కోట్లు విలువ చేయగా, పోర్స్‌చే పనామేరా రూ.60లక్షలు విలువైంది. కార్ల స్థితిని బట్టి వేలం ప్రారంభ ధర నిర్ణయిస్తారు.
* దేశంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో దాదాపు 7 లక్షల మందిని కొత్తతరం పరిశ్రమలు ఆదుకొన్నాయి. ఆన్‌లైన్ మార్కెటింగ్, ఆహార సరఫరా సంస్థలు, ఆర్థిక సేవల సంస్థలు తాత్కాలిక ఉపాధి కల్పించాయి. ఆరు నుంచి ఎనిమిది నెలలపాలు ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ మొత్తం ఉద్యోగాల్లో 1,40,000ల ఉద్యోగాలను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సృష్టించాయి. ఈ సంస్థలు దేశంలోని చివరి ప్రదేశం వరకు డెలివరీ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ఉద్యోగుల అవసరం పెరిగింది. విక్రయాల నెట్‌వర్క్‌లో 30శాతం ఉద్యోగాలను పెంచింది. ఇండియన్ స్టాఫింగ్ అసోసియేషన్ లెక్కల ప్రకారం 6,50,000 ఉద్యోగాలను ఈ పండుగ సీజన్లో సృష్టించినట్లు తేలింది. ‘‘కీలక రంగాల్లో డిమాండ్ తగ్గినా.. ఈ రంగాల్లో నియామకాలు జోరుగా జరిగాయి. ఈ నియామకాలు మొత్తం మూడు విభాగాల్లో జరిగాయి. డెలివరీ సిబ్బంది, అనుబంధ విభాగాలు, సరఫరా వ్యవస్థల్లో, విక్రేతల గోదాముల్లో ఈ నియామకాలు జరిగాయి ’’ అని ఇండియన్ స్టాప్ ఫెడరేషన్ అధ్యక్షురాలు రితుపర్ణ చక్రబర్తి పేర్కొన్నారు. వీరి జీతాలు రూ.30,000 వరకు ఉంటాయని అన్నారు. దీనిపై పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ 8,000 మంది ఏజెంట్లకు అదనంగా మరో 5,000 మందిని నియమించుకొన్నామన్నారు.