ప్రవాసాంధ్ర వైద్య ప్రముఖులు, తానా మాజీ అధ్యక్షుడు, డల్లాస్ పురప్రముఖులు డా. గొర్రెపాటి నవనీతకృష్ణ విగ్రహాన్ని ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా ఘంటసాలలో తానా తరఫున ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఆదివారం నాడు అర్వింగ్‌లోని SLPSలో తానా-డల్లాస్ ప్రవాసాంధ్రుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన డా.నవనీతకృష్ణ సంస్మరణ సభలో తానా ప్రతినిధులతో పాటు స్థానిక ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని నవనీతకు నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తాతినేని రామ్ సమన్వయంలో సాగిన ఈ సభలో తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ మాట్లాడుతూ అందమే ఆనందం అంటారని కానీ నవనీతకు ఆనందమే అందమని కొనియాడారు. తనకు నవనీతతో కాకినాడలో చదువుకునే రోజుల నుండి పరిచయం ఉందని అన్నారు. తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ మాట్లాడుతూ నవనీత విగ్రహాన్ని ఘంటసాలలో ఆయన కుటుంబ సభ్యులు కోరుకున్న చోట ఏర్పాటు చేసే బాధ్యత సంస్థ తరఫున తామంతా బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరో మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ శాంతాక్లారాలో 2003 తానా మహాసభల్లో నవనీత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారని, ఆయన నేతృత్వంలో తాను పనిచేసినందుకు గర్విస్తున్నానని తెలిపారు. మరో తానా మాజీ అధ్యక్షుడు డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ నవనీతను కోల్పోవడం డల్లాస్ ప్రవాసాంధ్రులకు తీరని లోటు అని అన్నారు. తానా బోర్డు మాజీ ఛైర్మన్ కొండ్రుకుంట చలపతి, ప్రవాసులు మురళీ వెన్నం, డా.ఆత్మచరణ్ రెడ్డి, కోడె వెంకట్, దొడ్డా సాంబ, బొమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం, బొమ్మారెడ్డి సుభాషిణి, వేమూరి వెంకయ్య, టాంటెక్స్ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం, యు.నరసింహారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు పలువురు సాహితీ, కళా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు నవనీత మృతిపట్ల తమ సంతాపాన్ని వెల్లడిస్తూ పంపిన వీడియో సందేశాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో మల్లవరపు అనంత్, పోలవరపు శ్రీకాంత్, లోకేశ్ నాయుడు, నందిగామ కుమార్, కన్నెగంటి మంజులత, కోనేరు శ్రీనివాస్, కాకర్ల విజయ్ మోహన్, అన్నే అమర్, సుబ్బరాయచౌదరి, బొర్రా విజయ్, సీవీఆర్.రావు, డా.గొర్రెపాటి రంగనాథబాబు, డా.వేమూరి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. వీడియో సందేశాలు పంపినవారిలో డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, బోండా ఉమా, జొన్నవిత్తుల, గుమ్మడి గోపాలకృష్ణ, దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకటరావు తదితరులు ఉన్నారు.
ఘంటసాలలో డా.నవనీతకృష్ణ విగ్రహ ఏర్పాటు
Related tags :